వన్యప్రాణి రక్షకుడు

అత్యంత విషపూరిత కింగ్‌ కోబ్రాని అతి జాగ్రత్తగా పట్టేస్తాడు. అలుగులాంటి అరుదైన జీవుల్ని కంటికి రెప్పలా కాపాడతాడు. అంతరించిపోతున్న ప్రాణుల కోసం అహరహం శ్రమిస్తాడు. అలుపెరుగని ఆ తపనకే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. అతడే  కంటిమహంతి లక్ష్మీనరసింహమూర్తి. తను ఈతరంతో మాట కలిపాడు. పాము.. అనమాట వింటేనే ఆ దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లరు. కానీ మూర్తి మాత్రం జనారణ్యంలోకి వచ్చే కింగ్‌ కోబ్రాలను సైతం చాకచక్యంగా పట్టుకొని దూరంగా అడవుల్లో వదిలేస్తున్నాడు.

Updated : 24 Jun 2023 00:34 IST

అత్యంత విషపూరిత కింగ్‌ కోబ్రాని అతి జాగ్రత్తగా పట్టేస్తాడు. అలుగులాంటి అరుదైన జీవుల్ని కంటికి రెప్పలా కాపాడతాడు. అంతరించిపోతున్న ప్రాణుల కోసం అహరహం శ్రమిస్తాడు. అలుపెరుగని ఆ తపనకే అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. అతడే  కంటిమహంతి లక్ష్మీనరసింహమూర్తి. తను ఈతరంతో మాట కలిపాడు.

పాము..
అనమాట వింటేనే ఆ దరిదాపుల్లోకి ఎవరూ వెళ్లరు. కానీ మూర్తి మాత్రం జనారణ్యంలోకి వచ్చే కింగ్‌ కోబ్రాలను సైతం చాకచక్యంగా పట్టుకొని దూరంగా అడవుల్లో వదిలేస్తున్నాడు. అతడి నేతృత్వంలో 40మంది వలంటీర్లు శ్రీకాకుళం నుంచి గుంటూరు దాకా, ఇదే పనిపై శ్రమిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అంతరించిపోతున్న పాంగోలిన్‌(అలుగు) లాంటి అరుదైన ప్రాణుల్ని సంరక్షించేందుకు ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టి పదేళ్లుగా నడిపిస్తున్నారు. విషసర్పాలు, అరుదైన జంతుజాలాన్ని కాపాడటానికి తెలుగు రాష్ట్రాల్లో పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతూ స్థానికుల్లో చైతన్యం కలిగిస్తున్నారు.

మూర్తిది విశాఖపట్నంలోని సింహాచలం. చిన్ననాటి నుంచే వన్యప్రాణులంటే ఇష్టం. పాములు విషపూరితమైనా.. అవి తమంత తాముగా మనుషుల జోలికి రావు. అలాంటప్పుడు వాటిని చంపడం ఎందుకని తీవ్రంగా మథనపడేవాడు. చిన్నవయసులోనే తరచూ స్థానిక జంతుప్రదర్శనశాలలకి వెళ్లి, అక్కడి జంతువుల గురించి జూ సిబ్బందిని అడిగి తెలుసుకునేవాడు. వన్యప్రాణులు, పర్యావరణంపై అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనేవాడు.

ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఎమ్మెస్సీ జువాలజీ పూర్తి చేశాక, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వెళ్లి అక్కడ ఒక వన్యప్రాణుల సంరక్షణ సంస్థలో పని చేశాడు. 2011లో తండ్రి చనిపోవడంతో వైజాగ్‌ తిరిగొచ్చాడు. అప్పట్నుంచి సొంతంగానే వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాలు చేస్తుండేవాడు. ఇవి పెరిగాక ‘ఈస్ట్రన్‌ ఘాట్స్‌ వైల్డ్‌లైఫ్‌ సొసైటీ’ పేరుతో ఓ సంస్థ ప్రారంభించాడు. జంతు ప్రదర్శనశాలలు, జాతీయ పార్కులు, పులుల అభయారణ్యాలకు వైల్డ్‌లైఫ్‌ కన్సల్టెంట్‌గానూ పని చేసేవాడు. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో మొదలు పెట్టి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రాజెక్టులు చేశాడు. ఆ సమయంలో జనాల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేశాడు. మన చుట్టుపక్కల ఉన్న జంతుజాలాలు ఏమిటి? వాటి నివాసాలు ఎక్కడుంటాయి? ప్రమాదకరమైన విషసర్పాలు మన జోలికి రాకుండా ఏం చేయాలి? వాటిని తీసుకెళ్లి అడవిలో ఎలా వదలాలి? ఈ విషయాలన్నీ చర్చించేవాడు. ఈ విషయంలో మరింత పరిజ్ఞానం సంపాదించాలనుకొని, ప్రపంచ వ్యాప్తంగా వన్యప్రాణులపై శిక్షణనిచ్చే ప్రముఖ సంస్థలకు దరఖాస్తు చేశాడు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న ఫ్లోరిడాలోని ‘ఎమర్జింగ్‌ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ లీడర్స్‌’ అనే 18 నెలల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యాడు. దేశం నుంచి మూర్తి ఒక్కడికే ఈ అవకాశం దక్కింది. అంత్యంత కఠినంగా సాగే ఈ శిక్షణను 2015లో పూర్తి చేశాడు.


తూర్పు కనుమల్లో..

తూర్పు కనుమల్లో కనిపించే కింగ్‌ కోబ్రాలు అత్యంత విషపూరితమైనవే కాదు.. అరుదైనవి కూడా. వీటి కాటుతో అక్కడక్కడా మనుషులు చనిపోతున్న సంఘటనలున్నాయి. ఈ కారణంగా.. పాములు కనిపించగానే జనాలు కొట్టి చంపేసేవారు. దీన్ని ఆపడానికి ఎవరైతే పాములు చంపుతారో వారినే తన ప్రాజెక్టు కోసం ఎంపిక చేసుకున్నాడు మూర్తి. కింగ్‌ కోబ్రాలు, ఇతర విషపూరిత పాములను ఎలా పట్టుకోవాలో శిక్షనిస్తున్నాడు. విశాఖ పరిసరాల్లో మండలానికి ఇద్దరు చొప్పున స్నేక్‌ రెస్క్యూ బృందాలను తయారు చేస్తున్నాడు. వారికి పాములు పట్టే పరికరాలు అందించాడు. 2016లో మొదలైన ఈ సంరక్షణ కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో అటవీశాఖ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, నల్లమల అటవీ ప్రాంతాల్లోనూ ఇవి కొనసాగించారు. వీటి ద్వారా ఏ పాములు విషపూరితం, ఏవి కావు లాంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేపట్టాక ఆయా ప్రాంతాల్లో పాము కాట్లు తగ్గాయని తమ అధ్యయనం ద్వారా తేలిందంటున్నాడు మూర్తి. ‘మద్రాస్‌ క్రొకడైల్‌ బ్యాంక్‌ ట్రస్ట్‌’ సహకారంతో పాము పొదిగిన గుడ్ల నుంచి పిల్లలు రాగానే వాటిని అడవుల్లో వదిలి పెడుతున్నారు. క్షీరద జాతికి చెందిన అరుదైన వన్యప్రాణి అలుగు ప్రపంచంలోనే అత్యధికంగా అక్రమ
రవాణాకు గురవుతోంది. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖతో కలిసి ఈజీడబ్ల్యూఎస్‌ కృషి చేస్తోంది. నీటి కుక్కలు, అడవి పిల్లి, బావురు పిల్లి, ఫిషింగ్‌ క్యాట్‌, నక్షత్ర తాబేళ్లు వంటి వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మూర్తి చేస్తున్న సేవలకు గుర్తింపుగా అమెరికాలోని హ్యూస్టన్‌ జూ నుంచి వైల్డ్‌లైఫ్‌ వారియర్‌ అవార్డు, డిస్నీ కన్జర్వేషన్‌ హీరో అవార్డులు వరించాయి. నెదర్లాండ్స్‌ దేశానికి చెందిన ఫ్యూచర్‌ ఫర్‌ నేచర్‌ సంస్థ అవార్డుకి నామినేట్‌ అయ్యాడు.

చిరుమామిళ్ల లక్ష్మణరావు, అమరావతి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని