భళా.. మీ నేత కళ!

కడుపు నింపే వృత్తినే తమ ప్రతిభ ప్రదర్శించే వేదికగా మలిచారు... పడుగు, పేకల దారాలతోనే అచ్చెరువొందే చిత్తరువులు సృష్టిస్తున్నారు

Updated : 15 Jul 2023 00:38 IST

మోడీ మెచ్చేలా.....

కడుపు నింపే వృత్తినే తమ ప్రతిభ ప్రదర్శించే వేదికగా మలిచారు... పడుగు, పేకల దారాలతోనే అచ్చెరువొందే చిత్తరువులు సృష్టిస్తున్నారు. ఆ అరుదైన కళకు జనమంతా సలాం కొడుతున్నారు. ఆ ఇరువురినీ అవార్డులు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రధాని మెచ్చుకోలు, రాష్ట్రపతి పురస్కారాలూ అందాయి. ఈ ఘనత సాధించిన ఆ చేనేతకారులే వెల్ది హరిప్రసాద్‌, సాయిని భరత్‌లు.

చదివింది పదే అయినా.. పాఠశాల స్థాయి నుంచే ప్రయోగాల బాట పట్టాడు సిరిసిల్ల వాసి వెల్ది హరిప్రసాద్‌. తన మెదడుకి పదును పెట్టి బుల్లి ఆవిష్కరణలు చేశాడు. వృత్తిలోకి దిగాక అక్కడా ప్రత్యేకత చాటుతూ తనదైన ముద్ర వేస్తున్నాడు.

ప్రధాని మోదీ తన 95వ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో వెల్ది హరిప్రసాద్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎలాంటి అతుకులు లేకుండా నేసి పంపిన జీ20 లోగో చూసి మంత్రముగ్ధుడినయ్యానన్నారు. ఇలా పెద్దవాళ్ల ప్రశంసలు పొందడం హరికి చిన్ననాటి నుంచే అలవాటు. తండ్రి నుంచి వారసత్వంగా నేత పని నేర్చుకున్నాడు. ఇంట్లో ఒకవైపు పనిలో సాయపడుతూనే సూక్ష్మమైన చేనేత కళాఖండాలు రూపొందించేవాడు. చప్పట్లు కొడితే నడిచే బుల్లి పవర్‌లూం, అగ్గిపెట్టెలో ఇమిడే రాట్నం, చిన్న వార్పిన్‌ ఇలా సూక్ష్మ వస్త్రోత్పత్తి యంత్రాలు తయారు చేశాడు.

పది పూర్తవగానే నేత పనిలోకి దిగాడు. మగ్గం ఎక్కాక అక్కడా అద్భుతాలే చేస్తున్నాడు. ఉంగరంలో, దబ్బనంలో, చిన్న సూదిలో దూరే అతి సూక్ష్మమైన చీరలు నేసి అంతా ఆశ్చర్యపోయేలా చేశాడు. సాధారణంగా పట్టుపీతాంబరాలు రూపొందించాలంటే చాలా శ్రమతో కూడిన పని. బంగారం, వెండి పోగులతో చేనేత మగ్గంపై అతి జాగ్రత్తగా రూపొందించాల్సి ఉంటుంది. గతేడాది భద్రాచలం సీతమ్మవారికి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన పట్టుపీతాంబరాల చీర హరిప్రసాద్‌ నేసినదే. ప్రస్తుతం వేములవాడ రాజన్నకూ పట్టు పీతాంబరం తయారు చేసే పనిలో ఉన్నాడు. అంతకుముందు ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ వేడుకలను పురస్కరించుకొని పట్టు వస్త్రంపై ఎలాంటి కుట్లు, అల్లికలు, ప్రింటు ఉపయోగించకుండా.. తెలుగులో జాతీయ గీతంతో పాటు మూడు రంగులతో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లోగో, భారతదేశ పటం, అశోక చక్రాన్ని రూపొందించాడు. ఇవికాక ప్రముఖులు మోదీ, ద్రౌపది ముర్ము, కేసీఆర్‌, సచిన్‌, ధోనీల చిత్రాలు వచ్చేలా వస్త్రాలు తయారు చేశాడు. సిరిసిల్ల సిరిపట్టుతోపాటు 400 వరకు వివిధ రకాల పట్టు చీరలు తయారు చేశాడు. ఇండియా మొదటిసారి జీ 20 సదస్సుకు అధ్యక్షత వహించనున్న సందర్భంలో జీ 20 లోగోను వస్త్రంపై నేసి ప్రధాన మంత్రి మోదీకి అందజేశాడు. దీని గురించే ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
తవుటు సౌమ్య, సిరిసిల్ల


గుర్తింపు

* హరిప్రసాద్‌ని ప్రధాని మోదీ అభినందించిన తరువాత గవర్నర్‌ తమిళిసై రాజ్‌భవన్‌కి ప్రత్యేకంగా పిలిపించుకొని సన్మానించారు.
* 2019 చేనేత దినోత్సవంలో రాష్ట్రప్రభుత్వ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారం.
* నేషనల్‌ హ్యాండ్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రత్యేక పురస్కారం, ప్రశంసాపత్రం.


అధ్యాపక వృత్తి వదిలి

ఒకే వస్త్రానికి రెండువైపులా రెండు రంగులు, వేర్వేరు డిజైన్లు. పట్టు వస్త్రాలపై పలువురి చిత్రాలు. ఇవి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి యువకుడు సాయిని భరత్‌ చేతిలో రూపుదిద్దుకున్న కొన్ని మెచ్చుతునకలు. ఎంటెక్‌ చేసినా చేనేత వృత్తిపై మమకారంతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నాడు తను.

ఎంటెక్‌ చదివిన ఎవరైనా సాఫ్ట్‌వేర్‌ బాటో, సర్కారీ కొలువుల వేటనో చేస్తారు. భరత్‌ ముందు ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా పని చేశాడు. మంచి వేతనం వస్తున్నా ఏదో అసంతృప్తి. చేనేత కార్మికుల దీనగాథలకు చలించిపోయేవాడు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ వృత్తికి తనవంతుగా పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలి ఇటువైపు వచ్చాడు. ఎంతో అనుభవం, నేర్పు, పట్టుదల ఉంటేగానీ చేనేతలో సృజనాత్మకత చూపడం సాధ్యం కాదు. అయినా కేవలం ఆ వృత్తిపై ఉన్న మమకారంతోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ అందరితో మెప్పు పొందుతున్నాడు. పట్టు వస్త్రంపై జాతీయ పతాకం.. మహాత్మాగాంధీ, చే గువేరా, రాజముద్ర, భగత్‌సింగ్‌, మదర్‌ థెరీసా, స్వామి వివేకానంద, నెల్సన్‌ మండేలా, సచిన్‌, సుభాష్‌ చంద్రబోస్‌, ప్రధాని మోదీ తదితరుల చిత్రాలను మగ్గంతో ఆవిష్కరించాడు. వీటిని తయారు చేయడానికి 30 కొయ్యల ఆసును ప్రత్యేకంగా తయారు చేశాడు. ఒక్కో కళాఖండాన్ని 10 నుంచి 15 రోజుల్లో రూపొందించాడు. వీటి అంచుల్లో జరీ డిజైన్‌ వేసి అబ్బుర పరిచాడు. ముందుగా నేయాలనుకున్న కళాఖండాన్ని గ్రాఫ్‌పై గీసుకొని, ఆసుపై డిజైన్‌ వేసి నేస్తానంటున్నాడు భరత్‌.

కొత్తదనం కోసం పరితపించే భరత్‌కి ఒకే వస్త్రంతో రెండు వైపులా వేరువేరు రంగులు, వేరువేరు డిజైన్లు రూపొందించాలనే ఆలోచన వచ్చింది. ఎన్నో సార్లు విఫలమైనా.. రెండేళ్లు కష్టపడి చివరకు అనుకున్న విధంగా తయారు చేయగలిగాడు. దీనికి 2018 సంవత్సరానికి గాను ‘నేషనల్‌ మెరిట్‌ సర్టిఫికెట్‌ డిజైన్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ హ్యాండ్లూమ్‌’లో అవార్డు దక్కింది. దీంతోపాటు 2014లో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించాడు. 2018లో రాష్ట్ర ప్రభుత్వ కొండా లక్ష్మణ్‌ బాపూజీ పురస్కారం అందుకున్నాడు. చేనేత కళలో వినూత్న ఆలోచనలతో వస్త్రాలను రూపొందించేందుకు ‘కళాపునర్వి’ హ్యాండ్లూమ్స్‌ పేరుతో, 40 మగ్గాలతో చేనేత వర్క్‌షెడ్‌ను ఏర్పాటు చేసి 60 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. తెలంగాణ టెక్స్‌టైల్‌్్స అండ్‌ అపెరల్‌ పాలసీ పథకం కింద హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేసి, దారం నుంచి చీర వరకూ యూనిట్‌లోనే అన్నీ తయారు చేయిస్తున్నాడు.                           

బెదరకోట శ్రవణ్‌కుమార్‌, భూదాన్‌పోచంపల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని