అలవాటుగా విజయాలు..

సెయిలింగ్‌.. సాహసోపేతమైన ఆట. విసురుగా వచ్చే భారీ సముద్రపు అలల్ని దాటుకుంటూ ముందుకెళ్లాలి. భారీ చెరువుల్లో ఇతరులతో పోటీ పడుతూ ఒడుపుగా లక్ష్యాన్ని చేరాలి. భారీ బరువుండే బోటును ముందుకురికించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం.

Updated : 12 Aug 2023 03:12 IST


ఉవ్వెత్తున ఎగసిపడే అలలతో ఆడితే ఆనందం... ఆ అలకి ఎదురెళితే సాహసం.. అలల్ని అధిగమించి సుదూర లక్ష్యం చేరితే విజయం! ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ విజయాలు పదులకొద్దీ సాధించారు పిల్లి అఖిల్‌, అలేఖ్య ఖండూలు. జూనియర్‌ విభాగంలో దేశంలోనే నెంబర్‌వన్‌ జోడీ వీళ్లది. తాజాగా స్పెయిన్‌లో జరిగిన వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి,  సత్తా చాటారు.

సెయిలింగ్‌.. సాహసోపేతమైన ఆట. విసురుగా వచ్చే భారీ సముద్రపు అలల్ని దాటుకుంటూ ముందుకెళ్లాలి. భారీ చెరువుల్లో ఇతరులతో పోటీ పడుతూ ఒడుపుగా లక్ష్యాన్ని చేరాలి. భారీ బరువుండే బోటును ముందుకురికించాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. గంటపాటు సాగే పోటీలో పాల్గొన్నా, అందుకని సాధన చేసినా.. విపరీతంగా అలసిపోతారు. దానికోసం శారీరకంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలి. నిరంతరం వ్యాయామం చేయాలి. అలల వేగం, వాటి పొడవూవెడల్పు, నీటి లోతు.. అప్పటికప్పుడు అంచనా వేస్తూ నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి మానసికంగానూ సంసిద్ధంగా ఉండాలి. ఇది పోటీలో దిగినప్పటి పరిస్థితి. దానికి ముందు అసలు సెయిలింగ్‌ రెగట్టా సాధన చేయడానికి అందుబాటులో భారీ నీటి వనరులుండాలి. సొంతంగా పడవ కొనుక్కోవడం అంటే ఖరీదైన వ్యవహారమే. ఈ సమస్యలన్నీ దాటుకొని విజయాలు సాధిస్తూ, టాప్‌ ర్యాంక్‌కి చేరుకున్నారు అఖిల్‌, అలేఖ్యలు.

బాబాయ్‌ బాటలో..

అఖిల్‌ది ఖమ్మం జిల్లాలోని కోస్టాల. అతడి బాబాయ్‌ ప్రతి ఆటలో చురుకుగా పాల్గొనేవారు. తనలాగే అఖిల్‌ని మంచి ఆటగాడిగా చేయాలనుకునేవారు. ఆయన చొరవతో హైదరాబాద్‌ హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశం పొందాడు. తనకి ఈతలో మంచి ప్రావీణ్యం ఉండటంతో.. స్పోర్ట్స్‌ స్కూల్‌ నిర్వాహకులు సెయిలింగ్‌ శిక్షణకు ఎంపిక చేశారు. హుస్సేన్‌సాగర్‌ జలాల్లో జరుగుతున్న పోటీల్లో ఇతడి ప్రతిభ గమనించిన బెంగళూరు బాయ్స్‌ స్పోర్ట్స్‌ కంపెనీ కోచ్‌.. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) బెంగళూరు శిక్షణ కేంద్రానికి ఎంపిక చేశారు. దాంతో అక్కడి కేంద్రియ విశ్వవిద్యాలయంలోని పడవ పోటీల్లో ప్రత్యేక శిక్షణకు అర్హత సాధించాడు అఖిల్‌. ఇది ఐదేళ్ల కిందటి మాట. అక్కడ రాటుదేలాక, తను వెనుదిరిగి చూసుకున్నదే లేదు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటుతున్నాడు.


కుర్రాళ్లతో పోటీ పడుతూ..

‘సెయిలింగ్‌ యువతను మానసికంగా, శారీరకంగా దృఢంగా మార్చే ఆట. అయితే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో యువత పెద్దగా ఇటువైపు చూడటం లేదు. మనదేశంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఈ ఆటను బాగా ప్రోత్సహిస్తోంది. భోపాల్‌ నగరంలో ఒక సెయిలింగ్‌ పాఠశాల ఏర్పాటు చేశారు. పడవలు, నీటి మైదానం, కోచింగ్‌ ఇతరత్రా సదుపాయాలు కల్పించారు. అన్నిచోట్లా ఇలాంటి ఏర్పాట్లు ఉంటే.. మేటి క్రీడాకారులు తయారవుతారు. ప్రస్తుతం మా దృష్టంతా 2024లో బ్రెజిల్‌లో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌పైనే ఉంది. ఇక రెగట్టాలో దేశానికి ఒలింపిక్‌ పతకం అందించాలన్నది మా కల’.

హైదరాబాదీ అలేఖ్య ఖండూ చదువులో మేటి. రసాయనశాస్త్రంలో గోల్డ్‌ మెడలిస్ట్‌. గిటార్‌ వాయించడంలో దిట్ట. ఇన్ని ప్లస్‌పాయింట్లు ఉన్నా.. ఇంకా తానేంటో నిరూపించుకోవాలనే మనస్తత్వం తనది. బంధువు ఒకరు సెయిలింగ్‌లో శిక్షణ తీసుకుంటుండగా ఆసక్తిగా గమనించింది. నేనూ నేర్చుకుంటానని పట్టు పట్టింది. ఇది ఎంతో శారీరక శ్రమతో కూడుకున్న ఆట. పైగా ప్రమాదకరం. ‘అమ్మాయికి ఇలాంటి ఆటలు అవసరమా?’ అన్నారు కొందరు. అయినా తల్లిదండ్రులు తమ కుమార్తె అభీష్టాన్ని కాదనలేదు. పైగా ప్రోత్సహించారు. తను ఐదోతరగతి చదువుతున్న సమయంలోనే సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు సెయిలింగ్‌ క్లబ్‌లో చేర్పించి శిక్షణనిప్పించారు. ఇష్టమైన క్రీడ కావడంతో కుర్రాళ్లతో పోటీ పడి మరీ మెలకువలు పట్టేసింది. బోటుతో నీటిలోకి దిగితే పతకాలు కొల్లగొట్టడం అలవాటుగా మార్చుకుంది.

జంటగా హిట్‌

* యాచింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (వైఏఐ) నిర్వహించిన జాతీయ సెయిలింగ్‌ డబుల్‌ మిక్స్‌ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి, అంతర్జాతీయ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌నకు ఎంపికయ్యారు.
* నాలుగేళ్ల తర్వాత అండర్‌-19 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌నకి ఎంపికైన జోడీ వీళ్లదే.
* సింగిల్‌, డబుల్‌, మిక్స్‌డ్‌ డబుల్‌ పోటీల్లో అఖిల్‌ జాతీయస్థాయిలో 12 పతకాలు గెలిచాడు.
* 2018లో చెన్నై అంతర్జాతీయ సెయిలింగ్‌ పోటీలో రెండోస్థానం. మణిపుర్‌ షిల్లాంగ్‌ జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్‌మెడల్‌.
* ఈ జులైలో స్పెయిన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సెయిలింగ్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఈ జంట ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇందులో 35 దేశాల నుంచి 210 జట్లు పోటీ పడ్డాయి.
* మైసూరు, కృష్ణపట్నం, భోపాల్‌, హైదరాబాద్‌లోని జాతీయస్థాయి పడవ పోటీల్లో పాల్గొని రెండు బంగారు, రెండు వెండి పతకాలు సాధించింది అలేఖ్య.

బుడత చంద్రశేఖర్‌, ఈజేఎస్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని