ఆమె ఇన్‌స్టా తెరిచా..ప్రేమని కోల్పోయా

నేను, ఒకమ్మాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి, సర్దుకున్నాయి. ఏడాది కిందట అనుకోకుండా, తనకు తెలియకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌ తెరిచా.

Updated : 02 Sep 2023 07:24 IST

నేను, ఒకమ్మాయి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మా మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయి, సర్దుకున్నాయి. ఏడాది కిందట అనుకోకుండా, తనకు తెలియకుండా తన ఇన్‌స్టాగ్రామ్‌ తెరిచా. ఆ విషయం తెలిసి కొంచెం సీరియస్‌ అయ్యింది. ఇంకోసారి అలా చేయనని మాట ఇచ్చినా.. ఉండబట్టలేక రెండు నెలల కిందట మరోసారి ఓపెన్‌ చేశాను. ‘నాపై నీకు అనుమానం. అందుకే ఇలా చేస్తున్నావు’ అంటూ నాతో మాట్లాడటం మానేసింది. తను అందరినీ గుడ్డిగా నమ్ముతుంది. ఎవరైనా ఆమెని మోసం చేస్తారనే ఉద్దేశమే తప్ప మరేం లేదు. ఆ విషయం తనకి ఎంత చెప్పినా నమ్మడం లేదు. ప్రస్తుతం నన్ను బ్లాక్‌ చేసింది. తను లేకుండా ఉండలేకపోతున్నా. ఏం చేయాలో చెప్పండి.
 మహేశ్‌, ఈమెయిల్‌

హలో మహేశ్‌.. నాలుగేళ్ల మీ ప్రేమలో చాలా గొడవలు జరిగాయంటే.. మీ మధ్య సఖ్యత సరిగా లేదని అర్థమవుతోంది. ప్రస్తుత విషయానికొస్తే.. ఆ అమ్మాయి అనుమతి లేకుండా ఆమె సోషల్‌ మీడియా ఖాతా తెరవడం పొరపాటే. తను మీ లవర్‌ అయినా.. తన ప్రైవసీ తనకి ఇవ్వాల్సిందే. అదీకాకుండా తనకి మాట ఇచ్చి మరీ, మళ్లీ అదే పొరపాటు చేసినప్పుడు ఎవరికైనా కోపం రావడం సహజం. అలా చేసే ముందైనా మీ ఉద్దేశం చెబితే అర్థం చేసుకొని ఉండేదేమో! అలా చేయకపోవడంతో.. ఆమె స్థానంలో ఎవరు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారు.

మీ గాళ్‌ఫ్రెండ్‌ లేకుండా ఉండలేకపోతున్నాను అంటున్నారంటే.. తనని ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో తెలుస్తోంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే ఆచరణలోకి దిగండి. చాటింగ్‌, ఫోన్‌ ద్వారా కాకుండా.. ఆమెని ఒక్కసారి నేరుగా కలవండి. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో వివరంగా తెలియ జేయండి. మీ ఇద్దరికీ మ్యూచువల్‌ ఫ్రెండ్‌ ఎవరైనా ఉంటే.. తన ద్వారా మీ బాధ, ఉద్దేశం చెప్పండి. తన పట్ల ఉన్నది జాగ్రత్తే తప్ప అనుమానం కాదనీ, మరోసారి ఇలా జరగదని స్పష్టంగా చెప్పించండి. అనుబంధాన్ని దృఢం చేసిన సంఘటనలను ఒక్కసారి గుర్తు చేయండి. చివరగా మీరు తనని ఎంతలా ప్రేమిస్తున్నారో వివరించండి. తను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. ఆల్‌ ది బెస్ట్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని