ఘనమైన పరిశోధనలు.. వరించిన పురస్కారాలు!

ప్రతి పరిశోధకుడు జీవితంలో ఒక్కసారైనా అందుకోవాలని కలలుగనే అవార్డు... ప్రతి సాంకేతిక నిపుణుడు గర్వంగా ముద్దాడాలని భావించే పురస్కారం... దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించేది.. శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు.  

Published : 16 Sep 2023 00:50 IST

ప్రతి పరిశోధకుడు జీవితంలో ఒక్కసారైనా అందుకోవాలని కలలుగనే అవార్డు... ప్రతి సాంకేతిక నిపుణుడు గర్వంగా ముద్దాడాలని భావించే పురస్కారం... దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించేది.. శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు.  సెల్‌ బయాలజీ విభాగం నుంచి 2022 సంవత్సరానికి మన తెలుగు వ్యక్తి మద్దిక సుబ్బారెడ్డి ఎంపికయ్యారు. ఆ ఘనత వెనకాల ఉన్న ప్రతిభ.. చేసిన పరిశోధన వివరాలు ‘ఈతరం’తో పంచుకున్నారు.

దుల విభాగాల్లో.. దేశవ్యాప్తంగా వేల దరఖాస్తులు వచ్చే పోటీలో విజేతగా నిలవడం అంటే మాటలు కాదు. ఆయా రంగంలో చేస్తున్న పరిశోధనలు, భారతీయ సైన్స్‌ రంగానికి చేసిన సేవల్ని సునిశితంగా పరిశీలిస్తారు. దరఖాస్తుదారు పరిజ్ఞానం, ప్రచురితమైన పరిశోధక వ్యాసాలు.. సహాధ్యాయులు, పరిశోధక విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తున్న వైనం.. ఇవన్నీ విశ్లేషించి.. అనేక వడపోతల అనంతరం అవార్డుకు ఎంపిక చేస్తారు. దీనికన్నా ముందు ఆయా పరిశోధక సంస్థల విభాగాధిపతులు, సైన్స్‌ అకాడెమీ అధిపతులు, విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్స్‌లర్లు ఈ పురస్కారానికి సిఫార్సు చేయాలి. సుబ్బారెడ్డిని గతేడాది సీడీఎఫ్‌డీ డైరెక్టర్‌ డా.తంగరాజ్‌.. అవార్డుకు సిఫార్సు చేశారు.

తాతయ్య దారిలో..

రంగం ఏదైనా కావచ్చు. శిఖరాన్ని అధిరోహించిన ప్రతి విజేత ఎన్నో ఆటంకాలు దాటి వస్తాడు. ఒక స్థాయికి చేరిన ప్రతి వ్యక్తి వెనకాల ఓ స్ఫూర్తి కోణం దాగి ఉంటుంది. నా విజయం వెనక తాత సుబ్బారెడ్డి వెన్నుదన్ను ఉంది అంటారు సుబ్బారెడ్డి. ఆయన మారుమూల పల్లె నుంచి వచ్చి, భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయుడు. సొంతూరు కడపతోపాటు చుట్టుపక్కలా మంచి పేరుండేది. నేను అధ్యాపక వృత్తిలో ఉంటే.. నా మనవడు సమాజానికి ఉపయోగపడే వైద్య వృత్తిని ఎంచుకోవాలని అనేవారు. తాత ఆశయమే తన కలగా మార్చుకొని, వైద్యుడిగా స్థిరపడాలనుకున్నారు సుబ్బారెడ్డి. చివరికి మెడిసిన్‌లో సీటు సైతం సంపాదించారు. ఆ సమయంలోనే..  వైద్యుడిగా స్థిరపడితే కొందరికే పరిమితం అవుతాం.. శాస్త్రవేత్తగా మారితే.. మొత్తం మానవాళికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయొచ్చు అని భావించారు. అందుకే మెడిసిన్‌ వదిలి డిగ్రీకి వెళ్లారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ పీజీ, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మ్యానిటోబాలో సెల్‌ బయాలజీలో పీహెచ్‌డీ, అమెరికాలోని ప్రఖ్యాత యేల్‌ యూనివర్సిటీ నుంచి పోస్ట్‌డాక్టోరల్‌ ఫెలోషిప్‌ పూర్తి చేశారు. చదువులో మెరిట్‌ కావడంతో అంతా స్కాలర్‌షిప్‌ల ద్వారానే సాగేది. పీహెచ్‌డీ, పోస్ట్‌ డాక్టోరల్‌ సమయంలోనే.. గణనీయమైన పరిశోధనలు చేశారు. పలు పురస్కారాలు అందుకున్నారు.

మరింత దూకుడుగా

2009లో భారత్‌ తిరిగొచ్చి సొంతంగా ఒక పరిశోధక ల్యాబ్‌ ఏర్పాటు చేసుకున్నారు సుబ్బారెడ్డి. కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ (డీబీటీ)- లండన్‌కి చెందిన వెల్‌కమ్‌ట్రస్ట్‌ నుంచి భారీగా ఫండింగ్‌ అందుకున్నారు. మానవ కణాల ప్రవర్తనా పద్ధతులు, క్యాన్సర్‌ కారకాల గుర్తింపు, రక్తంలో ఫాస్ఫేట్‌ స్థాయిల వల్ల కలిగే దుష్ఫలితాలపై పరిశోధనలు చేశారు. డీబీటీకి అనుబంధంగా పని చేశారు. కేంద్ర ప్రభుత్వ సీఎస్‌ఐఆర్‌ ఆధ్వర్యంలో పరిశోధనలు చేశారు. తర్వాత దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా భావించే పరిశోధనాసంస్థ.. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నోస్టిక్స్‌ (సీడీఎఫ్‌డీ)లో సీనియర్‌ రిసెర్చ్‌ సైంటిస్ట్‌గా చేరారు. మానవ కణాల్లో మాలిక్యులర్‌ సిగ్నలింగ్‌ నెట్‌వర్క్‌, సెల్‌ బయాలజీ, ఫాస్ఫేటేస్‌ బయాలజీ, యుబిక్విటిన్‌ బయాలజీ విభాగాల్లో అలుపెరుగని పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని పలు క్లిష్టమైన కేసుల చిక్కుముళ్లు విప్పుతూ.. పోలీసులు, దర్యాప్తు సంస్థలకు సహకరిస్తున్నారు. మరోవైపు పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నారు.

అయితే ఇంజినీర్‌ లేదా డాక్టర్‌ అనే మనస్తత్వాన్ని తల్లిదండ్రులు వదిలేయాలి. ఇవి కాకుండా బయట అపారమైన అవకాశాలున్నాయి. ముఖ్యంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత ఎదగడానికి ఆకాశమే హద్దు. ఇవి ఎంత అభివృద్ధి చెందితే దేశం అంతగా పురోగమిస్తుంది. ఈ రంగాల్లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. మన ఇష్టం, ప్యాషన్‌, హాబీని కొనసాగిస్తూనే అద్భుతాలు చేయొచ్చు. కెరియర్‌గా ఎంచుకుంటే.. సమాజంలో గౌరవమూ ఉంటుంది. ఒక శాస్త్రవేత్త సమాజానికే కాదు.. మొత్తం మానవాళికే ఉపయోగపడే ఆవిష్కరణలు చేయొచ్చు.

గుర్తింపు, అవార్డులు

  • పరిశోధక విద్యార్థిగా.. నాన్సీ జే మౌరో స్కాలర్‌షిప్‌, మెర్క్‌ ఫ్రాస్ట్‌ అవార్డు.
  • ఈఎల్‌ డ్రెవ్రీ మెమోరియల్‌ అవార్డు.
  • డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ నుంచి ఇన్నోవేటివ్‌ బయో టెక్నాలజిస్ట్‌ అవార్డు.
  • సీనియర్‌ ఇన్నోవేటివ్‌ యంగ్‌ బయోటెక్నాలజిస్ట్‌ అవార్డు.
  • బీఎం బిర్లా సైన్స్‌ ప్రైజ్‌. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా నాసి-స్కోపస్‌ యంగ్‌ సైంటిస్ట్‌ అవార్డు.
  • నేషనల్‌ బయోసైన్స్‌ అవార్డు. నేషనల్‌ అకాడెమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోషిప్‌.
  • ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడెమీ ఫెలోషిప్‌.
  • ఎంబో, సెల్‌ సైన్స్‌, నేచర్‌లాంటి ప్రఖ్యాత జర్నళ్లలో 40 వరకు పరిశోధక వ్యాసాలు ప్రచురితం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని