సంకల్పమే.. వారి కంటివెలుగు

ఉద్యోగం రాలేదని ఉసురు తీసుకుంటున్న యువతని చూస్తున్నాం! డిగ్రీ పట్టాలున్నా కొలువు దక్కట్లేదని ఉసూరుమనే కుర్రాళ్లను గమనిస్తున్నాం... అన్నీ సవ్యంగా ఉన్నవాళ్లే అంధకారంలో ఉంè …పోతుంటే.. కంటిచూపు లేకున్నా పట్టుబట్టి.. మంచి స్థాయికి చేరారు ఈ విజేతలు.

Updated : 16 Sep 2023 07:26 IST

ఉద్యోగం రాలేదని ఉసురు తీసుకుంటున్న యువతని చూస్తున్నాం! డిగ్రీ పట్టాలున్నా కొలువు దక్కట్లేదని ఉసూరుమనే కుర్రాళ్లను గమనిస్తున్నాం... అన్నీ సవ్యంగా ఉన్నవాళ్లే అంధకారంలో ఉండిపోతుంటే.. కంటిచూపు లేకున్నా పట్టుబట్టి.. మంచి స్థాయికి చేరారు ఈ విజేతలు. కలలు కనడానికి కళ్లు కాదు.. సాధించాలనే సంకల్పం ఉంటే చాలని నిరూపించారు.

ఆరంకెల వేతనం

అంబటి వెంకట ప్రేమ్‌స్వరూప్‌

ప్రేమ్‌ది అనంతపురం జిల్లా ధర్మవరం. మూడో తరగతిలో ఉండగా తీవ్రమైన జ్వరం వచ్చింది. అది నయమయ్యేలోపే కంటిచూపు పోయింది. అయినా కన్నవాళ్లు తమ కుమారుడిని భారంలా భావించలేదు. బ్రెయిలీ లిపిలో చదివించారు. అనంతపురంలోని రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్‌డీటీ) అండగా నిలిచింది. తర్వాత హైదరాబాద్‌లో ఇంటర్‌, తిరుపతిలో డిగ్రీ పూర్తి చేశాడు. ఆపై క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించి, ఐఐఎం-రాయ్‌పుర్‌లో సీటు సాధించాడు. ప్రాంగణ నియామకాల్లో.. టాటా స్టీల్‌ కంపెనీలో మార్కెటింగ్‌ మేనేజర్‌గా సంవత్సరానికి రూ.20 లక్షల జీతంతో ఉద్యోగం దక్కించుకున్నాడు.

పుట్టుకతోనే చూపును కోల్పోయినా..

అబ్బుల ప్రసాద్‌

సత్యసాయి జిల్లా పంతుల చెరువు గ్రామం ప్రసాద్‌ది. పుట్టుకతోనే 75శాతం చూపు లేదు. అమ్మా నాన్నలు వ్యవసాయ కూలీలు. చదువే కుటుంబం తలరాత మారుస్తుందని నమ్మేవాడు. డిగ్రీలో ఉండగా దుర దృష్టవశాత్తు ప్రసాద్‌ నాన్న చనిపోయారు. అయినా కష్టపడుతూనే చదువుల యాగం కొనసాగించాడు. జాతీయస్థాయి మొదటి ర్యాంకుతో పాండిచ్చేరి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందాడు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో దాదాపు రూ.లక్ష వేతనంతో ఓ కార్పొరేట్‌ సంస్థలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల హెడ్‌గా ఉద్యోగం సాధించాడు.

కన్నవాళ్లు దూరమైనా..

సాకే లక్ష్మణ్‌

అనంతపురం కమలానగర్‌ కుర్రాడు లక్ష్మణ్‌కి పుట్టుకతోనే చూపు లేదు. పైగా చిన్నతనంలోనే కన్నవాళ్లనూ కోల్పోయాడు. ఆర్డీటీనే అమ్మానాన్నగా మారింది. సెలవుల్లోనూ పాఠశాల హాస్టళ్లోనే గడిపేవాడు. ల్యాప్‌టాప్‌తోనే డిగ్రీ వరకు పరీక్షలు రాశాడు. ఇంటర్లో టెలీకాలర్‌గా పార్ట్‌ టైం ఉద్యోగం చేసేవాడు. తర్వాత మధ్యప్రదేశ్‌లో ఒక సంస్థలో బ్రెయిలీ లిపి ఇన్‌స్ట్రక్టర్‌గా పని చేశాడు. ఇవి చేస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తుండేవాడు. ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌ (ఈఎస్‌ఐసీ) పరీక్ష రాసి, గతేడాది కేంద్ర ప్రభుత్వ కొలువు సాధించాడు. ప్రస్తుతం బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్నాడు.

మాదల సత్యనారాయణ, ఈనాడు పాత్రికేయ పాఠశాల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని