అంతరిక్షం..అందుకునేలా...

చదివింది మామూలు డిగ్రీనే. కానీ మనసంతా అంతరిక్ష రహస్యాలు తెలుసుకోవడంపైనే. ఆ ఇష్టమే ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యేలా చేసింది

Updated : 07 Oct 2023 07:16 IST

చదివింది మామూలు డిగ్రీనే. కానీ మనసంతా అంతరిక్ష రహస్యాలు తెలుసుకోవడంపైనే. ఆ ఇష్టమే ప్రతిష్ఠాత్మక అంతరిక్ష పరిశోధన సంస్థ శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యేలా చేసింది. కృత్రిమ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలో ప్రయోగాలకు పురికొల్పింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న ఆ కుర్రాడే ఆకుల మోహన సాయి. తన అనుభవాల్ని ఈతరంతో పంచుకుంటున్నాడిలా..

సాయిది సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ తండ్రి దినసరి కూలీ.. తల్లి సాధారణ గృహిణి. సామాన్య కుటుంబంలో పుట్టినా.. అతడి ఆలోచనలు మాత్రం అంతరిక్షం, గ్రహాలు, అక్కడి జీవం చుట్టూ తిరిగేవి. ఆ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి బయాలజీ మాస్టర్ల చుట్టూ తిరుగు తుండేవాడు. చదువులో చురుకైన కుర్రాడు కావడంతో అంతా ప్రోత్సహించేవాళ్లు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక పరిశోధనా సంస్థ సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)లో ఏటా సెప్టెంబరులో సందర్శనకు విద్యార్థులను అనుమతిస్తుంటారు. సాయి ప్రతి ఏడాది అక్కడికెళ్లేవాడు. కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటుండేవాడు. అలా డిగ్రీ పూర్తయ్యేసరికే జీవశాస్త్ర, ఖగోళ విషయాలపై పట్టు సాధించాడు.

అంచెలంచెలుగా..

మోహన సాయి ప్రస్తుతం ముంబయిలోని అమిటీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఇన్‌ ఆస్ట్రోబయాలజీ అండ్‌ సైన్స్‌ చేస్తున్నాడు. దేశంలోనే ఈ కోర్సు తొలిసారి ప్రవేశ పెట్టారు. తన ప్రాజెక్టులో భాగంగా.. గతేడాది లద్ధాఖ్‌, రాజస్థాన్‌లకు వెళ్లి.. మార్స్‌ రిసెర్చ్‌ సైట్‌లలో పరిశోధనలు చేశాడు. భూమ్మీదే అంగారక గ్రహ వాతావరణ పరిస్థితులను పోలి ఉన్న ఎనిమిది ప్రాంతాల్లో ఈ ఎనలాగ్‌ సైట్స్‌ ఉన్నాయి. అక్కడ శిలలు ఎలా ఏర్పడ్డాయి? మట్టి రకాల పరిశీలన, మొక్కలు పెరిగే విధానం, జీవ ప్రక్రియలు ఎలా కొనసాగుతున్నాయి.. వీటిన్నింటిపై పరిశోధనలు చేశాడు. మార్స్‌ సొసైటీ ఆఫ్‌ ఆస్ట్రేలియా సహకారంతో, ఎంపిక చేసిన విద్యార్థులతో ఈ పరిశోధక ప్రాజెక్టు చేయించారు. ఈ సమయంలోనే కొందరు శాస్త్రవేత్తలతో పరిచయం ఏర్పడింది. వాళ్ల సలహాతో పోలండ్‌లోని అనలాగ్‌ మిషన్‌ ప్రాజెక్టుకి దరఖాస్తు చేసుకున్నాడు. శారీరక, మానసిక పరీక్షలు చేసి, అనేక వడపోతల అనంతరం ఈ మిషన్‌కి ఎంపిక చేస్తారు. చివరగా ఈ మిషన్‌కి ఎందుకు రావాలి అనుకుంటున్నారు? దీని ద్వారా ఏం సాధించదలచుకుంటున్నారో ఆకట్టుకునేలా చెప్పగలగాలి. అలా మూడు సంవత్సరాల కృషి ఫలితంగా పోలండ్‌ దేశంలోని క్రాకో పట్టణ సమీపంలోని అడవిలో ఏర్పాటు చేసిన కృత్రిమ అంతరిక్ష యంత్రం అనలాగ్‌ మిషన్‌ శిక్షణకు ఎంపికయ్యాడు. కెనడా, పోలండ్‌, బ్రెజిల్‌, ఇటలీ, గ్రీస్‌, భారతదేశాలకు చెందిన ఆరుగురు మాత్రమే దీనికి అర్హత సాధించారు. పీహెచ్‌డీ పూర్తి చేసి, అంతరిక్షంపై మంచి అవగాహన ఉన్న వారు మాత్రమే ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపికవుతుంటారు. అలాంటిది సాయి ప్రతిభ, అనుభవాలే ఈ అవకాశం దక్కేలా చేశాయి.

ఎనిమిదిరోజులపాటు..

ఈ అనలాగ్‌ ఆస్ట్రోనాట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ను యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీలో శాస్త్రవేత్త, ఇంజినీర్లుగా పని చేసిన డా.అగాథా, మ్యాట్‌ అనే ఇద్దరు ప్రారంభించారు. మానవ అంతరిక్షయాన అధ్యయనాలను వేగవంతం చేసేందుకు వీళ్లు కృషి చేస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన చాలామంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, వ్యోమగాములుగా ఎంపికయ్యారు. నమూనా అంతరిక్ష కేంద్రంలో అంతరిక్షంలోని వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారో అదే తీసుకోవడం, దినచర్య.. అన్నీ అలాగే ఉండేవి. ఈ పరిస్థితులను తట్టుకోవడం మానసికంగా, శారీరకంగా అత్యంత కష్టసాధ్యం. మొదటి మూడు రోజులు చాలా ఇబ్బంది పడ్డాడు సాయి. బీపీ అదుపు తప్పింది. తర్వాత అన్నీ సర్దుకున్నాక పరిశోధనలు వేగవంతం చేశాడు. అక్కడి వాతావరణంలో ధనియాల మొక్కల పెంపకాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాడు. ఒకవైపు పీజీ కొనసాగిస్తూనే పసిఫిక్‌ సముద్రంలోని హవాయి దీవుల్లోని ఓ అగ్నిపర్వతం సమీపంలో ఏర్పాటు చేసిన మార్స్‌ అనలాగ్‌ ల్యాబ్‌లో పరిశోధనలు చేయడానికి సమాయత్తం అవుతున్నాడు.


అనలాగ్‌  మిషన్‌ అంటే  
అంతరిక్షం, చంద్రమండలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటిని కృత్రిమంగా ఒక ప్రత్యేకమైన ల్యాబ్‌ని భూమి మీదే సృష్టించి అందులోకి శిక్షకులను పంపిస్తారు. లోపలికి వెళ్లిన తర్వాత బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. సమయం, రోజూ లెక్కలుండవు. డే-1, డే-2.. అనే వ్యవహరించాల్సి ఉంటుంది. మిషన్‌లో ఆహారం, దినచర్య అంతా భిన్నంగా ఉంటుంది. వీరిని మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఎంసీసీ) నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ శిక్షణ 8 రోజులు ఉంటుంది. కానీ దానికి ముందు బయట కూడా 20 రోజుల పాటు వీరి ఆహారపు అలవాట్లు, దినచర్యల్లో ఆ పరిస్థితులను తట్టుకునేలా శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో వీరు ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటూ ల్యాబ్‌లో పలు పరిశోధనలు చేస్తారు.


నేను సిద్ధం

ఇప్పటివరకు అంగారక గ్రహ ప్రయోగాలకు సంబంధించి పెద్దగా పరిశోధనలు జరగలేదు. రోవర్‌ని పంపినా.. మనుషులెవరూ వెళ్లలేదు. అక్కడికి వెళ్లి రావాలంటే దాదాపు 36 నెలలు పడుతుంది. వ్యోమనౌకలో వెళ్లేవారు తమ శరీర బరువులో ఆరునెలలకోసారి 25శాతం కోల్పోతుంటారు. అంటే యాత్ర పూర్తయ్యేసరికి మనుషులు మిగలరు. ఇలా జరగకుండా ఉండేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ మానవసహిత అంగారక గ్రహ ప్రయోగాలు కార్యరూపం దాల్చితే వెళ్లడానికి సంసిద్ధంగా ఉండటమే నా లక్ష్యం. మన దగ్గర ప్రతిభ, వనరులకు కొదవ లేదు. ఇస్రో అద్భుతాలు చేస్తోంది. ఇవన్నీ గ్రామీణ యువతకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లు తిరుగుతున్నాను. విద్యార్థులు, యువతకున్న సందేహాలు తీర్చుతున్నాను.

- నూకల నరేందర్‌, హుజూర్‌నగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని