రంగుల కల.. సాధించారిలా!

చూసేవాళ్లకి సినిమా ఓ రంగుల ప్రపంచం అయితే.. తీసేవాళ్లకి, నటించేవాళ్లకి ఓ జీవిత కల. అది నెరవేరాలంటే.. ప్రతిభ ప్రదర్శించాలి. పదిమందిని మెప్పించాలి

Updated : 18 Nov 2023 03:27 IST

చూసేవాళ్లకి సినిమా ఓ రంగుల ప్రపంచం అయితే.. తీసేవాళ్లకి, నటించేవాళ్లకి ఓ జీవిత కల. అది నెరవేరాలంటే.. ప్రతిభ ప్రదర్శించాలి. పదిమందిని మెప్పించాలి. అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అవసరమైతే త్యాగాలు చేయాలి. ఈ ఇద్దరు యువకులు అదే దారిలో వెళ్లి, కలల గమ్యాన్ని చేరారు. వారితో మాట కలిపింది ఈతరం.

సినిమాలు చాలామంది చూస్తారు... సినిమా కథలు కొందరే రాస్తారు... తన జీవితాన్నే కథగా మలిచి, సినిమా తీసేవాళ్లు అరుదు... శ్రీమంతుల వీరేశ్‌ అదే తరహా. ఆ ప్రతిభని జాతీయస్థాయి అవార్డులు వరించాయి.

సొంత కథే గెలిపించింది

వీరేశ్‌ది కర్నూలు జిల్లా హలిగెర. చాలామందిలాగే తనకీ సినిమాలంటే పిచ్చి. కానీ అందరూ చూసి ఆనందిస్తే.. తనేమో అందులోని కథల వెనకాల పడేవాడు. తప్పొప్పులు ఎంచేవాడు.. మార్పులు, కూర్పులు చెప్పేవాడు. ఎనిమిదోతరగతి నుంచే ఈ ఆసక్తి మొదలైంది. ఐదేళ్ల కిందట అతడి పదోతరగతి పూర్తైంది. బళ్లారిలోని ఓ సెలూన్‌ షాపులో చేర్పించారు నాన్న. కుటుంబం గడవాలంటే పనిచేయక తప్పని పరిస్థితి. కానీ అతడి మనసంతా సినిమాలపైనే ఉండేది. ఒకవైపు పని చేస్తూనే ఖాళీ సమయాల్లో కథలు రాసుకునేవాడు. అలా రాసిన కథల్ని హైదరాబాద్‌ వెళ్లి నిర్మాతలకు వినిపించేవాడు. అదీ ఎంతో కష్టమ్మీద. కొందరైతే కలవడానికి కూడా ఇష్టపడేవారు కాదు. చివరకు ఓ నిర్మాత ఇచ్చిన సలహాతో లఘుచిత్రాలు రూపొందించడంపై దృష్టి పెట్టాడు.
రాసుకున్న కథలకి కొదవ లేదు. వెంటనే రంగంలోకి దిగాడు. తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సైనికులకు గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత సమాజంపై ఉందంటూ.. 2021వ సంవత్సరంలో ‘త్యాగమూర్తులు’ అనే షార్ట్‌ఫిల్మ్‌ తీశాడు. కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అన్నీ తనే. మిత్రుడు నిఖిత్‌రాజ్‌ నిర్మాత. బాగుందని అంతా మెచ్చుకోవడంతో ఇంకా చేయాలనే తపన పెరిగింది. స్వీయ అనుభవాలనే కథగా మలిచి రెండో చిత్రంగా ‘బార్బర్‌’ తీశాడు. క్షురక వృత్తి చేయడం చిన్నతనంగా భావించే అవసరం లేదనీ, మానసికంగా కుంగిపోవద్దనీ.. సందేశం ఇచ్చాడు. ఇందులో తన చిన్ననాటి అనుభవాలు, తాను అనుభవించిన మానసిక సంఘర్షణలనే ఇతివృత్తంగా తీసుకున్నాడు. కథ చెప్పిన విధానం హృద్యంగా, మనసుకి హత్తుకునేలా ఉండటంతో ప్రశంసలు పోటెత్తాయి. ఈ చిత్రం దాదాపు రెండువేల లఘుచిత్రాలు బరిలో నిలిచిన బెంగళూరు ‘ఇండియన్‌ ఫిల్మ్‌ హౌస్‌’ (ఐ.ఎఫ్‌.హెచ్‌.) జాతీయస్థాయి పోటీలకు వెళ్లింది. ఉత్తమ కథ, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ సంభాషణలు, ఉత్తమ దర్శకుడు విభాగాలకు నామినేట్‌ అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ ఎడిటింగ్‌ల విజేతగా నిలిచింది. ఉత్తమ సహాయ నటుడికి ద్వితీయ స్థానం, కథకి తృతీయ స్థానం గెల్చుకొని సత్తా చాటింది.
 బి.ఎస్‌.రామకృష్ణ, కర్నూలు


నాటకం నుంచి నటనకి..

నాట్యం నేర్చుకున్నాడు... నాటకాలు వేశాడు... బాలనటుడిగా రాణించాడు...అన్నిచోట్లా సూపర్‌హిట్‌! పదుల సంఖ్యలో బహుమతులు, గుర్తింపూ వచ్చాయి. ఇప్పుడు నటనలోనూ కాలు మోపుతున్నాడు జయంత్‌సాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటుంది. అందులో ఉగ్రరూపం దాల్చిన నరసింహస్వామిగా.. ఆ స్వామినే మెప్పించి తనవద్దకు రప్పించుకున్న ప్రహ్లాదుడిగా.. బలశాలి హనుమంతుడిగా.. ఇలాంటి పాత్ర ఏదైనా అందులో ఇమిడిపోయి రక్తి కట్టిస్తుంటాడు జయంత్‌. అన్నమయ్య, శ్రీకృష్ణ, గరుడ, మోహిని, భస్మాసుర ఇలా ఏ అవతారం వేసినా చప్పట్లు మార్మోగాల్సిందే! అతడి అభినయానికి విదేశాల్లోనూ అభిమానులున్నారు.

జయంత్‌ది తిరుపతి. చిన్నప్పట్నుంచే అమ్మానాన్నలు భరతనాట్యంలో శిక్షణనిప్పించారు. ఎలాంటి హావభావాలనైనా అలవోకగా పలికిస్తుండటంతో నాటకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టమని సూచించారు గురువు హరినాథ్‌. అలా నాట్యంలో శిక్షణ తీసుకుంటూనే నాటకాలు వేసేవాడు. పలు వేదికలపై తన ప్రతిభ ప్రదర్శించేవాడు. 2005, 2008లలో ఈటీవీ నిర్వహించిన ‘ఆంధ్రావాలా’ షోలో దుర్యోధన ఏకపాత్రాభినయం చేశాడు. ఆపై రాష్ట్రం దాటి మంగళూరు, పాట్నా, దిల్లీల్లోనూ సత్తా చాటాడు. 2012, 2016లలో తిరుపతిలో జరిగిన తెలుగు మహాసభలు, యువజనోత్సవాల్లో భక్తప్రహ్లాద పాత్రతో అలరించాడు. ఆ సమయంలో ప్రహ్లాదుడు అంటే జయంత్‌సాయినే అనేంతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు.

జయంత్‌ నాట్యం, నాటకం సినిమాలకూ దారి చూపించింది. బాలల చిత్రం దానవీరశూరకర్ణలో 700మందితో పోటీ పడి మరీ దుర్యోధనుడి పాత్ర అవకాశం చేజిక్కించుకున్నాడు. తర్వాత ‘సయ్యాట’, ‘ఆ ఐదుగురు’, ‘ఋషి’ సినిమాల్లోనూ బాలనటుడిగా మెప్పించాడు. తాజాగా పి.జయకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కే ఓ సినిమాలో, మరో హిందీ చిత్రంలో కీలక పాత్రలకు ఎంపికయ్యాడు. బహుముఖ పాత్రల్లో రాణిస్తున్నా.. జయంత్‌ చదువులోనూ చురుకే. ఇంటర్లో రాష్ట్ర ర్యాంకు, డిగ్రీలో బంగారు పతకం సాధించాడు. ఎస్వీ యూనివర్సిటీలో ప్రస్తుతం ఎంఏ సోషియాలజీ చదువుతున్నాడు. అతడి ప్రతిభకు జాతీయస్థాయిలో బాలశ్రీ.. ఏపీ యువజనోత్సవాల్లో ఏకపాత్రాభినయానికి రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి.. ఏపీ నాటక అభివృద్ధి సంస్థ అవార్డులు అందాయి.                   

  పిల్లనగోయిన రాజు, ఈజేఎస్‌

 

     


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని