మీరు మిలీనియల్సా? జిలేనియల్సా?

ఉరిమే ఉత్సాహం.. సాధించాలనే కసి.. సవాళ్లకి ‘సై’ అనే ఖలేజా ఉన్న ఎవరైనా యువతే. కాకపోతే వాళ్లు పుట్టిన సంవత్సరాలను బట్టి కొందర్ని ‘మిలీనియల్స్‌’.. కొందర్ని ‘జనరేషన్‌ జడ్‌’ అంటుంటారు. ఈ రెండూ కాకుండా ‘జిలేనియల్స్‌’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. ఏంటీ కథా కమామీషు అంటే...

Published : 19 Feb 2022 01:22 IST

ఉరిమే ఉత్సాహం.. సాధించాలనే కసి.. సవాళ్లకి ‘సై’ అనే ఖలేజా ఉన్న ఎవరైనా యువతే. కాకపోతే వాళ్లు పుట్టిన సంవత్సరాలను బట్టి కొందర్ని ‘మిలీనియల్స్‌’.. కొందర్ని ‘జనరేషన్‌ జడ్‌’ అంటుంటారు. ఈ రెండూ కాకుండా ‘జిలేనియల్స్‌’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. ఏంటీ కథా కమామీషు అంటే...

జిలేనియల్స్‌ అంటే మిలీనియల్స్‌కి ఎక్కువ.. జనరేషన్‌ జడ్‌కి తక్కువ అనుకోవచ్చు. సంవత్సరాల్లో లెక్కేసి చెప్పాలంటే 1993 నుంచి 1998 మధ్యలో పుట్టిన తరం. అంటే 24 నుంచి 29 మధ్య వయస్కులు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రెండు తరాలకూ వారధులు. టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో విహరించడం జనరేషన్‌ జడ్‌ లక్షణం. మరీ అంతకాదుగానీ జిలేనియల్స్‌ కూడా సామాజిక మాధ్యమాల్లో సంచరించేవాళ్లే. ‘డిజిటల్‌ జనరేషన్‌’ సార్థక నామధేయులు కాకపోయినా డెస్క్‌టాప్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌.. ఆవిర్భావాన్ని దగ్గరుండి మరీ చూసినవాళ్లు. ఇప్పటితరంలా బ్రాండ్‌ ఉత్పత్తులకు అంబాసిడర్లు కాకపోయినా.. మరీ బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంనాటి వాళ్లేమీ కాదు. జనరేషన్‌ జడ్‌లు స్మార్ట్‌ఫోన్‌ని మునివేళ్లతో ఆడుకోవడం.. 24/7 ఆన్‌లైన్‌లో ఉండే రకమైతే జిలేనియల్స్‌ 26/11 ముంబయి దాడులు, ఆర్థిక మాంద్యం లాంటి సంఘటనలకు సాక్షులు. ఇంతేనా?ఇదేనా వీళ్ల గొప్పతనం? అంటే చాలానే ఉన్నాయ్‌. అన్నిరంగాల్లో ఉత్పత్తి పెంచుతూ, సంపద సృష్టించే వాళ్లలో అటూఇటూ వీళ్లదే కీలక పాత్ర అంటున్నారు సామాజికవేత్తలు, ఆర్థిక నిపుణులు. మిలీనియల్స్‌, జనరేషన్‌ ఎక్స్‌, జనరేషన్‌ జడ్‌తో పోల్చుకున్నా.. సౌందర్యోపకరణాలు, గ్యాడ్జెట్లు, వ్యాయామ, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల మహారాజ పోషకులూ వీళ్లేనట.

వీళ్లే..

* పాత ఫ్లిప్‌ఫ్లాప్‌ ఫోన్లు చూసిన   చివరి తరం.

* ఫోన్‌కి వింతైన కప్ప అరుపుల రింగ్‌టోన్‌లు ఉండేవి.

* హ్యారీపోటర్‌ చివరి సిరీస్‌లు మాత్రమే చూసినవారు.

* ఆర్కుట్‌ని ఆదరించిన చివరి జనరేషన్‌.

* సెల్‌ఫోన్‌ సామర్థ్యం కేబీల్లోంచి జీబీల్లోకి మారడానికి సాక్షులు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని