Manasulo Maata: తన మైకమే.. నన్ను ముంచేసింది!

‘నీకసలు బుద్ధుందా? నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? నీవల్ల లక్షల నష్టం తెలుసా...’ బాస్‌ తన క్యాబిన్‌కి పిలిచి ఉగ్రనరసింహ అవతారం ఎత్తేసరికి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి.

Updated : 01 Jul 2023 08:07 IST

‘నీకసలు బుద్ధుందా? నేను చెప్పిందేంటి? నువ్వు చేసిందేంటి? నీవల్ల లక్షల నష్టం తెలుసా...’ బాస్‌ తన క్యాబిన్‌కి పిలిచి ఉగ్రనరసింహ అవతారం ఎత్తేసరికి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. గబగబా వెళ్లి మెయిల్‌ చెక్‌ చేశా. ప్చ్‌.. ఆయన చెప్పింది కరెక్టే. నేను మెయిల్‌ ఒకరికి బదులు వేరొకరికి పంపా. ఫలితం.. మాకు రావాల్సిన కాంట్రాక్టు పోటీ కంపెనీకి వెళ్లింది. దీనంతటికీ కారణం.. తనే. తనతో సరసాలాటలో పడే ఈ కొంపముంచే పని చేశా.
దాదాపు నెల కిందట తను మా ఇంట్లో అడుగు పెట్టింది. వద్దువద్దనుకుంటూనే తనని సమీపించా. తనతో ఆ రాత్రి ఓ యుద్ధమే జరిగింది. నేను దుప్పట్లో ఉన్నానో.. తన కౌగిట్లో కరిగిపోయానో గుర్తులేదు. నిగ్రహించుకోలేక దాసోహమయ్యా. తొలిరాత్రి ముగిశాక.. మలిరాత్రి. తొందరగా భోజనం చేసి, కాస్త ఆఫీసు పని చూద్దామని ఫైలు తీశా. మనసు తనపైకే లాగేసింది. కొత్తమోజు కదా.. మంత్రం వేసినట్టు ఒక మాయలా కమ్మేసింది. ఆ ఒక్కరోజే కాదు.. ప్రతిసారీ నా మాటలు, పాటలు, సరదాలు.. అన్నీ తనతోనే.
ఓరోజు అన్నయ్య కొడుకు బయట ఆడుకుంటూ బంతిని బలంగా విసిరాడు. అది సరిగ్గా తనకే తగిలింది. అంతే.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నా కోపం నషాళానికంటింది. ‘చూసుకోవాలి కదరా వెధవ’ అని వాడి వీపు మీద నాలుగు వాయించా. వాడు ఆపకుండా ఏడుస్తుంటే.. అనవసరంగా కొట్టానేమో అనిపించింది. అప్పట్నుంచి నా చెలిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెట్టా.
నేను బీటెక్‌ చదివా కదా.. ఓరోజు ఏదో లెక్క అడిగారు నాన్న. క్షణమైనా ఆలోచించకుండా తనవైపు తిరిగి సమాధానం కనుక్కొని చెప్పా. నాన్న కాల్చేసేలా చూశారు. అయినా సరే ఎవరేం అనుకున్నా.. నేను పూర్తిగా తన మీద ఆధారపడిపోయా. క్షణం విడిచి ఉండలేని స్థితికొచ్చా. రాత్రుళ్లు మా ఇకఇకలు, పకపకలు.. అమ్మకి చిరాకు తెప్పించేవట. ‘మేం నిద్రపోవాలా, వద్దా.. నోర్మూసుకొని పడుకోండి’ అంటూ ఓసారి గట్టిగానే కసిరింది. మేం ‘వాల్యూమ్‌’ తగ్గించాం.
ఆ కొన్నాళ్లకే ఇదిగో ముందు చెప్పిన ఆఫీసు పొరపాటు జరిగింది. అంతకుముందే ‘మధూ.. ఈమధ్య నువ్వు సరిగ్గా పని చేయట్లేదు. అసలేమైంది నీకు?’ అంటూ ఓసారి హెచ్చరించారు కూడా బాస్‌. అప్పుడైనా మేల్కొంటే ఆ తప్పు జరగకపోయేది. అన్నట్టు నేను చాలాసార్లు ‘బెస్ట్‌ ఎంప్లాయి’ అవార్డు అందుకున్నా. అదే నన్ను ఉద్యోగంలోంచి తీసేయకుండా కాపాడింది. ఏదేమైనా నాకు తల కొట్టేసినట్టు అయింది. అంత అవమానం నా జీవితంలో ఎప్పుడూ జరగలేదు. ఆలోచిస్తుంటే.. తన రాకతో నేను పూర్తిగా మారిపోయా అనిపించింది. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని? వందశాతం మనసు పెట్టి పని చేసేవాడిని. క్షణం ఖాళీ దొరికినా పుస్తకం చేతిలో ఉండేది. ఇప్పుడో.. ఆ పుస్తకాలన్నీ ర్యాకుల్లో షోపీసులుగా మారాయి. ప్రతి క్షణం తన ధ్యాసే. ఒక్కోసారి నాలో నేనే నవ్వుకునేవాడిని. ఒక్కోసారి నాకే చిరాకేసేది. ఇదేమైనా మానసిక జబ్బా? అని అప్పుడప్పుడు నాకే అనుమానం వచ్చేది. ఆఫీసు సంఘటన జరిగాక మొత్తానికి నేను చేస్తోంది తప్పు అనిపించింది. నా కుటుంబం దూరం కాకముందే.. ఆఫీసులో  పరువు మరింత దిగజారకముందే తనని దూరం పెట్టాలనుకున్నా.
ఆ నిర్ణయం తీసుకున్నాక తన చెంతకు వెళ్లకుండా చాలానే ప్రయత్నించా. తనని నా చేతుల్లోకి తీసుకోకుండా చాలా గింజుకున్నా. ఏదైతేనేం.. చివరికి నేనే గెలిచా. ఆ రాత్రంతా తనని తాకలేదు. ఆరోజుతో మా బంధానికి ముగింపు పలికా. అప్పట్నుంచి తను లేకుండా కష్టంగానే ఉంది. కానీ ప్రశాంతంగా ఉంది. ఈనెల మళ్లీ నేనే ఉత్తమ ఉద్యోగిగా ఎంపికయ్యా. ఈమధ్యే నాకో పెళ్లి సంబంధం వచ్చింది. ‘అమ్మాయి ఫొటో వాట్సప్‌ చేస్తాం. నచ్చితే వచ్చేవారం చూడటానికి రండి’ అన్నారు. ఆ మాట వినగానే ఒళ్లు జలదరించింది. ‘అక్కర్లేదు.. పోస్టులో ఫొటో పంపండి’ అన్నా వెంటనే.
అన్నట్టు చెప్పలేదు కదూ.. ఆరోజే తనని వదిలించుకోవడంతో ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టా.. అన్నింటికీ బైబై చెప్పేశా! తనతో బంధం తెంచుకొని, కోపంతో కిటికీలోంచి బయటికి విసిరేశా కూడా. మర్నాడు ఆఫీసుకు వెళ్తుంటే.. ముక్కలైన నా సెల్‌ఫోన్‌ కనిపించింది. ముగిసిన మా బంధానికి సాక్షిగా. ఈ వ్యధ నా ఒక్కడిదే కాదు.. ఈ మొబైల్‌ఫోన్‌ చాలామంది జీవితాల్ని ఛిద్రం చేసిన సంఘటనలు చూశా. అందుకే నా స్వానుభవం పంచుకోవాలని మీ ముందుకొచ్చా.                

మధు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని