అంత జరిగినా.. ఇష్టం తగ్గట్లేదు

 ఆన్‌లైన్‌లో నాకో అందమైన అమ్మాయి పరిచయమైంది. ఓసారి బయట కలుసుకున్నాం. అప్పుడు ‘నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. ఆమె కోసమే బతుకుతున్నా’నంది. ఆమెను పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇద్దామనుకున్నా. కానీ తను వ్యభిచారం

Updated : 19 Mar 2022 04:07 IST

 ఆన్‌లైన్‌లో నాకో అందమైన అమ్మాయి పరిచయమైంది. ఓసారి బయట కలుసుకున్నాం. అప్పుడు ‘నాకు అమ్మ తప్ప ఎవరూ లేరు. ఆమె కోసమే బతుకుతున్నా’నంది. ఆమెను పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇద్దామనుకున్నా. కానీ తను వ్యభిచారం చేస్తుందనే షాకింగ్‌ విషయం ఈమధ్యే తెలిసింది. ముందు నమ్మలేదు. తర్వాత కొన్ని సంఘటనలు కళ్లారా చూశాక నమ్మక తప్పలేదు. ఇంత జరిగినా తనపై ఇష్టాన్ని చంపుకోలేకపోతున్నా. ఇప్పుడు తన నుంచి దూరంగా వెళ్లిపోవాలా? తన పద్ధతి మార్చి, తనకో జీవితం ఇవ్వాలా? ఎటూ తేల్చుకోలేకపోతున్నా. దయచేసి నా సమస్యకు తగిన పరిష్కారం తెలపండి.

- కె.ఎస్‌.ఎస్‌., ఈమెయిల్‌

మీ సమస్యని మనో నిబ్బరంతో మా దృష్టికి తీసుకు వచ్చినందుకు అభినందనలు. జీవితంలో తమకెదురైన సమస్యలు, కష్టాలు తీరే దారిలేక కొందరు నిస్సహాయస్థితిలో, ఆత్మగౌరవాన్ని చంపుకొని ఇలా అడ్డదారులు వెతుక్కుంటారు. ఇలా జరగడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో ముందు కనుక్కోండి. ఆమె చేస్తోంది తప్పుడు పని అని తెలిసినా.. తనలో మార్పు రావాలని కోరుకోవడం, మంచి జీవితాన్ని ఇవ్వాలనుకోవడం నిజంగా అభినందించదగిన విషయం. మీ ప్రయత్నం మంచిదే. ముందు ఆమె సమస్య ఏంటి? పరిష్కారమేంటో వివరించి చెప్పండి. ఆమె జీవితాన్ని ఎలా నిలబెట్టాలనుకుంటున్నారో తెలియజేయండి. కొత్త జీవితంలో ఇద్దరూ ఎలా ఉండాలో అర్థమయ్యేలా చెప్పండి. కొంత సమయం ఇచ్చి ఆమెలో మార్పు వచ్చిందో, లేదో గమనించండి. మీరు చెప్పింది విని మీ చేయి అందుకుంటే సంతోషం. లేదంటే తనకి దూరంగా ఉండటమే మంచిది. మంచి మాట చెప్పినప్పుడు విని, ఆచరించేవాళ్లకే ఏదైనా సాయం చేయగలం. పట్టించుకోని వాళ్లను మనం మార్చలేం. ఇలా జరగని పక్షంలో ఆమెను మీ మనసు నుంచి తొలగించుకోవడమే ఉత్తమం. వీలు కాకపోతే కొన్నాళ్లు ఊరు మారే ప్రయత్నమైనా చేయండి. అనవసరంగా ఆలోచించి సమయం వృథా చేసుకోవద్దు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని