Manalo Manam: క్రికెట్‌ ఆటే ముంచేసింది

నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. ఏడాదిన్నర కిందట ఒక స్నేహితుడి ద్వారా బెట్టింగ్‌ అలవాటైంది. చాలా డబ్బులు పోగొట్టుకున్నా. అందినకాడికి అప్పులు చేశా. ఇప్పుడు డబ్బులు కట్టే సమయం దగ్గర పడింది. వాళ్లంతా ఇంటిమీదకొస్తుంటే అమ్మా నాన్నల పరువు పోతోంది. అది చూడలేక నాకు చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నా. నేనేం చేయాలి?

Updated : 17 Jun 2023 07:28 IST

నాకు క్రికెట్‌ అంటే పిచ్చి. ఏడాదిన్నర కిందట ఒక స్నేహితుడి ద్వారా బెట్టింగ్‌ అలవాటైంది. చాలా డబ్బులు పోగొట్టుకున్నా. అందినకాడికి అప్పులు చేశా. ఇప్పుడు డబ్బులు కట్టే సమయం దగ్గర పడింది. వాళ్లంతా ఇంటిమీదకొస్తుంటే అమ్మా నాన్నల పరువు పోతోంది. అది చూడలేక నాకు చనిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయి. బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నా. నేనేం చేయాలి?

ఆర్‌.ఎస్‌.కె., ఈమెయిల్‌

* జూదం, బెట్టింగ్‌ ఒక ఊబి. ఈరోజుల్లో చాలామంది యువత ఈ బెట్టింగ్‌ మైకంలో మునిగి సర్వస్వం కోల్పోయిన సంఘటనలు చాలానే చూస్తున్నాం. బీటెక్‌ చదువుతున్న మీకు ఇలాంటి విషయాలపై అవగాహన ఉండే ఉంటుంది. అవి తెలిసే మీరు ఆ ఊబిలోకి వెళ్లడం బాధాకరం. ‘అతి సర్వత్రా వర్జయేత్‌’ అంటారు. మనం తినే ఆహారమైనా, ఇష్టపడే వస్తువైనా, ప్రేమించే మనిషైనా, ఆఖరికి ఇలాంటి ఆటలైనా.. హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది. లేకపోతే చెడు పరిణామాలకు దారి తీస్తాయి.

ఇంతకీ మీ అమ్మానాన్న ఏం చేస్తారో చెప్పలేదు. అసలు మీకు ఎవరు ఇవ్వడం వల్ల పెద్దఎత్తున డబ్బులు పోగొట్టుకున్నారు? అయినా జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ మళ్లీ దాన్నే తలచుకోవడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ముందు అధైర్యపడకండి. సమస్య వచ్చినప్పుడు తలవంచడం కాదు.. పోరాడటం నేర్చుకోవాలి. సమస్య ఎదుర్కొంటూనే.. దాన్నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. బాధ కాసేపు పక్కనపెట్టి జరిగిన విషయం మీవాళ్లతో చెప్పండి. వాళ్లు తిడతారు అని భయపడొద్దు. ఒకవేళ తిట్టినా, కొట్టినా.. పడటంలో తప్పు లేదు. మన సంతోషాన్ని, బాగుని కోరుకునేది తల్లిదండ్రులు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని సమస్యలోంచి బయటపడేసేది వాళ్లే. ఇక తొందరపడి ఎలాంటి పిచ్చి నిర్ణయమూ  తీసుకోవద్దు. మీ వయసు తక్కువే. ఎంతో భవిష్యత్తు ఉంది. కష్టపడి, నిజాయతీగా సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. మీరు బాగా చదివితే మంచి వేతనంతో ఉద్యోగం దొరుకుతుంది. జరిగినదాని గురించి అతిగా ఆలోచించవద్దు. దీన్ని జీవితంలో నేర్చుకున్న ఒక పాఠంగా మలచుకోండి. మళ్లీ ఇలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఆల్‌ ది బెస్ట్‌.

డా.అర్చన నండూరి, కౌన్సెలింగ్‌ సైకాలజిస్ట్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు