Published : 14 May 2022 00:53 IST

జంటగా.. కాసుల పంట

రీల్‌ లైఫ్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ వాళ్లు చూడముచ్చటైన జంటలు. ‘మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌’ అని పొగడ్తలు అందుకుంటున్న వాళ్లు. ఆ అనుబంధం, పాపులారిటీని తమ ఉత్పత్తుల ప్రచారానికి వాడుకోవాలనుకున్నాయి కొన్ని సంస్థలు. వాళ్లతో వాణిజ్య ప్రకటనలు రూపొందించి టీవీలు, పత్రికలు, అంతర్జాలంలో వదులుతున్నాయి. సెలెబ్రిటీలూ దీన్ని సంపాదనకు మార్గంగా మలచుకుంటున్నారు. ప్రముఖ యాడ్‌ ఏజెన్సీ ఈధ్యే ఇలా జంటగా కాసుల పంట పండించుకుంటున్న కొందరి తారల వివరాలు చెప్పింది. దాని ప్రకారం టాప్‌లో ఉన్నవారు. 

విరాట్‌ కోహ్లి- అనుష్కశర్మ

‘విరుష్క’లు అభిమానుల్ని సంపాదించుకోవడంలోనే కాదు.. కలిసి సంపాదించడంలోనూ ముందున్నారు. నిజానికి ఈ ఇద్దరినీ కలిపింది ఓ వాణిజ్య ప్రకటనే. ఇప్పటికి ఆరు యాడ్స్‌లో నటించారు. వేర్వేరుగా అయితే ఇద్దరి చేతుల్లో 31 ప్రకటనలున్నాయి. 

సంపాదన: రూ. 108 కోట్లు

కలిసి నటించిన ముఖ్యమైన యాడ్స్‌: మాన్యవర్‌మహే కమర్షియల్, మింత్రా, గూగుల్‌ డ్యుయో


అక్షయ్‌ కుమార్‌- ట్వింకిల్‌ ఖన్నా

బాలీవుడ్‌ మిస్టర్‌ ఖిలాడీ అక్షయ్‌కుమార్‌ ప్రకటనల్లో దుమ్ము రేపుతుంటాడు. ఈ ఇద్దరూ నాలుగింట్లో జంటగా ఉంటే.. వేర్వేరుగా 40 కమర్షియల్‌ యాడ్స్‌లో నటించారు.  

ఆదాయం: రూ.105 కోట్లు

ముఖ్య ప్రకటనలు: పీసీ జువెల్లర్స్, రీగల్‌


అభిషేక్‌ బచ్చన్‌- ఐశ్వర్యా రాయ్‌

భారతీయ సెలెబ్రిటీల్లో పవర్‌ కపుల్‌గా చెప్పుకునేవాళ్లలో ఐశ్వర్యరాయ్, అభిషేక్‌ బచ్చన్‌లు ఉంటారు. ఇద్దరూ కలిసి పెద్దగా బయట కనపడకపోయినా వాణిజ్య ప్రకటనల్లో మాత్రం దర్శనమిస్తుంటారు.

ఆదాయం: 88కోట్లు

ప్రకటనలు: ప్రెస్టీజ్‌ కుక్కర్స్, లక్స్‌


ఆలియా భట్‌- రణ్‌బీర్‌ కపూర్‌

ఆలియా-రణ్‌బీర్‌లు పెళ్లికి ముందు నుంచే జంటగా దూసుకెళ్తున్నారు. ఈమధ్యే పెళ్లిపీటలు ఎక్కారు. వేర్వేరుగా అయితే సెంచరీ దాటారు.

సంపాదన: రూ.95 కోట్లు

 ప్రకటనలు: ఫ్లిప్‌కార్ట్, లేస్‌ 


రితేశ్‌ దేశ్‌ముఖ్‌- జెనీలియా డిసౌజా

సామాజిక మాధ్యమాల్లో సరదాగా, నిత్య ప్రేమికుల్లాగే ఉంటుందీ జంట. పెళ్లికి ముందు, తర్వాత కూడా జంటగా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూనే ఉన్నారు.

ఆదాయం: 24 కోట్లు

ప్రకటనలు: స్నాప్‌డీల్, హోమియోపతి


దీపికా పదుకొనే- రణ్‌వీర్‌ సింగ్‌

బాలీవుడ్‌లోనే కాదు.. ప్రకటనల్లో సైతం అత్యధిక పారితోషికం తీసుకుంటున్న జంటల్లో ముందుంటారు     దీపికా పదుకొనే, రణ్‌వీర్‌ సింగ్‌లు. జంటగా ఐదు చేశారు.  

ఆదాయం: రూ.86 కోట్లు  

ప్రకటనలు: లాయిడ్, జియో


 సైఫ్‌ అలీఖాన్‌- కరీనా కపూర్‌

పెళ్లయ్యాక బెబో కరీనా దాదాపు సినిమాలకు దూరంగానే ఉంటోంది.కానీ ఇద్దరూ కలిసి వాణిజ్య ప్రకటనల్లో నటించడం ఆపలేదు. వేర్వేరుగా ఇద్దరూ 21 బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉన్నారు. 

సంపాదన: రూ.58 కోట్లు

ప్రకటనలు: ఎయిర్‌ బీఎన్‌బీ, వీఐపీ సూట్‌కేసులు


కత్రినా కైఫ్‌- విక్కీ కౌశల్‌

పవర్‌ కపుల్‌ జాబితాలోకి కొత్తగా చేరారు. సబ్బుల కంపెనీ ‘లక్స్‌’ ఇద్దరితో కలిపి ప్రకటన రూపొందించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కాకుండా ఒక ఫిట్‌నెస్‌ బ్రాండ్‌తో కూడా ఒప్పందం ఖరారయ్యే దశలో ఉంది. వేర్వేరుగా అయితే బోలెడన్ని చేశారు. ఆదాయం: రూ.52 కోట్లు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు