కళతో సమాజహితమే నా కల!
ఇంటిని అందంగా తీర్చిదిద్దే ఇంటీరియర్ డిజైనర్ తను.. అందరినీ మెప్పించేలా అభినయించే కళాకారుడూ తనే.. యక్షగాన కళలో 500 పైగా ప్రదర్శనలు ఇచ్చిన ప్రతిభ అతడి సొంతం... ఈ సంప్రదాయ కళలోనే సామాజిక అంశాలను ప్రదర్శనాంశాలుగా ఎంచుకొని సమాజంలో మెరుగైన మార్పు కోసమూ ప్రయత్నిస్తున్నాడు. అతగాడే మచిలీపట్నం యువకుడు భట్టిప్రోలు సాయిరాం. అతడి ప్రస్థానమిది.
యక్షగానం .. కర్ణాటకలోని తీరప్రాంతానికి చెందిన ప్రాచీన సంప్రదాయ కళ. డిజిటల్ యుగానికి ప్రతినిధిలా ఉండే 29 ఏళ్ల యువకుడు సాయిరాం ఈ సంక్లిష్టమైన బాటను ఎంచుకొని రాణిస్తున్నాడు. సంప్రదాయానికి సమాజహితం జోడించి చేస్తున్న అతడి ప్రయత్నానికి ప్రంశసలూ, మెచ్చుకోలూ అందుతున్నాయి.
ఆ నేపథ్యంతోనే..
సాయిరాంది ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. చిన్నప్పుడే వాళ్ల కుటుంబం కొన్నాళ్లు చెన్నైలో ఉండి, తర్వాత బెంగుళూరులో స్థిరపడింది. పదో యేడు రాగానే సాయిరాంని శృంగేరిలోని గురుకుల ప్రబోధిని పాఠశాలలో చేర్పించారు నాన్న. అది భిన్నమైన విద్యాలయం. అక్కడ చదువుతోపాటు పంచముఖ శిక్షణ ఉంటుంది. అందులో భాగంగా వేదం, విజ్ఞానం, యోగా, కృషి, కళాకౌశల్‌లలో శిక్షణ ఇస్తారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరంగా సాగిపోయే అక్కడి తరగతులను ఇష్టంగా వినేవాడు సాయిరాం. అన్నట్టు ఈ ప్రాంతం యక్షగాన నృత్య కళకి ప్రసిద్ధి. అక్కడి ప్రముఖ యక్షగాన కళాకారులు విద్యాలయానికి వచ్చి ఆసక్తి ఉన్న విద్యార్థులకు శిక్షణనిస్తుండేవారు. ఆ సమయంలోనే కళపై మమకారంతో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు.
యక్షగానంపై ఎంత ఆసక్తి ఉన్నా.. మెరుగైన ఉపాధి కోసమని ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశాడు సాయిరాం. డిజైనర్‌గా ఐదేళ్లు పని చేశాడు. సంపాదన బాగున్నా, జీవితం సాఫీగా సాగుతున్నా.. మనసంతా తనకిష్టమైన కళపైనే ఉండేది. కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడు ప్రదర్శనలు చేస్తుండేవాడు. ఒకప్పుడు కర్ణాటక తీర ప్రాంతానికే పరిమితమైన యక్షగాన సంస్థలు.. సాయిరాం కోసమా అన్నట్టుగా ఈమధ్యకాలంలో తను పని చేస్తున్న బెంగళూరులోనూ విస్తరించాయి. తను ఎక్కువ ప్రదర్శనలు ఇవ్వడానికి మంచి అవకాశం దొరికింది. దాంతో చేస్తున్న ఉద్యోగం మానేసి సొంతంగా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ప్రారంభించాడు. వీలు చేసుకొని మరీ ఎక్కువ షోలు చేయసాగాడు. ఈ ఆరేడేళ్లలో కర్ణాటకతోపాటు తమిళనాడు, కేరళ, దిల్లీ, ముంబయి, తిరుపతిలలో దాదాపు 500 పైగా షోలలో అభినయించాడు. ఇంత అనుభవం, మంచి పేరు సంపాదించుకున్నా.. కర్ణాటకలోని ప్రముఖ యక్షగాన కళాకారుడు బేగార శివకుమార్ దగ్గర ఇప్పటికీ శిష్యరికం చేస్తూనే ఉన్నాడు.
తనదైన ప్రత్యేకత
సాధారణంగా యక్షగాన కళలో రామాయణం, మహాభారతం, భాగవతంలాంటి పురాణేతిహాసాలే కథాంశాలుగా ఉంటాయి. పార్వతి, మోహినీ, ద్రౌపది, అహల్య, సీత, సుభద్ర, సుధేష్ణ, కనకాంగి, అంబిక, రాధ, రుక్మిణి, జాంబవతి, నాట్యరాణి శాంతల, మాలిని, కాళి, మహిషాసురమర్ధిని తదితర పాత్రలన్నీ పురుషులే వేస్తుంటారు. వీటితోపాటు విష్ణువు, కృష్ణుడు, బ్రహ్మ, శివుడు, అగ్ని, నలమహారాజు తదితర పాత్రల్లో ఆకట్టుకునే అభినయం ప్రదర్శిస్తాడు సాయిరాం. ఈ ఆనవాయితీని పాటించడంతోపాటు.. ప్రకృతి సంరక్షణ, స్వచ్ఛభారత్, కరోనాపై పోరు, సామాజిక అసమానతలు.. తదితర అంశాలు తీసుకొని ప్రదర్శనలు చేయడం అతడి ప్రత్యేకత. దీనికి కర్ణాటక సాహిత్య పరిషత్ సాయమందిస్తోంది. అన్నట్టు సాయిరాం మంచి గాయకుడు, వైణికుడు కూడా.
యక్షగానం అరుదైన కళ. దీని ద్వారా సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవడమే కాదు.. సమాజ సత్ప్రవర్తనకూ ఓ మార్గంగా ఎంచుకోవచ్చు. కర్ణాటక సాహిత్య పరిషత్తు ద్వారా కొన్నిరకాల ప్రయోగాలు చేస్తూ సామాజికాంశాలపైనా జనం చైతన్యమయ్యేలా ప్రదర్శనలు రూపొందిస్తున్నా. సాధారణంగా మాకు కళాశాలలు, దేవాలయాలు, కొన్ని సమూహాల నిర్వాహకుల నుంచి షో చేయమంటూ ఆహ్వానాలు అందుతాయి. ప్రస్తుతం కాలేజీల్లోనూ మా ప్రదర్శనలకు మంచి స్పందన లభిస్తోంది. మా వేషధారణ, పలికించే హావభావాల తీరుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. ప్రదర్శన వాళ్లకి బోర్ కొట్టకుండా సమకాలీన అంశాలు ఎంచుకుంటున్నాం. ప్రదర్శన నిడివి తగ్గిస్తున్నాం. పన్నెండేళ్ల వయసులో నేను తొలి ప్రదర్శన ఇచ్చాను. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కళను ప్రచారం చేస్తూ.. సామాన్యులకి చేరువ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను.
జి.జగదీశ్వరి, బెంగళూరు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు
-
India News
మళ్లీ జాగ్రత్త పడాల్సిందేనా!..140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసుల నమోదు
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
Politics News
శ్రీరాముడు హిందువులకే పరిమితం కాదు: ఫరూక్
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్