కరోనా మరణాలకు పరిహారం ఇవ్వాల్సిందే

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం

Updated : 01 Jul 2021 04:14 IST

 ఎంతివ్వాలో కేంద్రమే నిర్ణయించాలి

ఆరు వారాల్లో మార్గదర్శకాలు ఇవ్వాలి

ఆర్థిక సాయం సరికాదన్న వాదనల తిరస్కరణ

చట్టం అమలులో విఫలమయినట్టు వ్యాఖ్య

సుప్రీంకోర్టు తీర్పు

ఈనాడు - దిల్లీ

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలంటూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ‘కనీస ప్రమాణాలు గల ఆర్థిక సహాయం’ ఇచ్చేందుకు తాజా మార్గదర్శకాలు జారీ చేయాలని బుధవారం జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికారిక సంస్థ (నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ-ఎన్‌డీఎంఏ)ను ఆదేశించింది. పరిహారం ఇవ్వాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నందున దాన్ని అమలు చేసి తీరాలని తేల్చి చెప్పింది. కరోనా నివారణకు ఇతర రూపాల్లో సాయం చేస్తున్నామని, అందువల్ల నగదు కూడా ఇవ్వాలనడం సరికాదన్న కేంద్రం వాదనలను తిరస్కరించింది. నగదు రూపంలో పరిహారం ఇస్తే ఇతర కార్యక్రమాలకు నిధులు ఉండవన్నదాన్నీ అంగీకరించలేదు.

తాత్కాలిక సాయం (ఎక్స్‌గ్రేషియా) కింద ఎంత ఇవ్వాలన్నదానిపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని, కేంద్ర ప్రభుత్వమే కనీస ప్రమాణాలుగల మొత్తాన్ని నిర్ధరించాలని న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సూచించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం రూ.4 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలంటూ ఇద్దరు న్యాయవాదులు...రీపక్‌ కన్సల్‌, గౌరవ్‌ కుమార్‌ బన్సల్‌లు దాఖలు చేసిన రెండు వేరువేరు వ్యాజ్యాలను విచారించిన ధర్మాసనం పై తీర్పు ఇచ్చింది. పరిహారం చెల్లించడంతో పాటు, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో దేశవ్యాప్తంగా ఏకీకృత విధానం రూపొందించాలని తమ వ్యాజ్యాల్లో కోరారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాల తరఫున న్యాయవాది సుమీర్‌ సోధి నాలుగు మధ్యంతర దరఖాస్తులు సమర్పించారు. పరిహారం చెల్లింపులో వివక్ష ఉండకూడదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే తరహా మొత్తం ఉండాలని కోరారు. ఒక రాష్ట్రం హెచ్చుగా, మరో రాష్ట్రం తక్కువగా పరిహారాన్ని నిర్ణయించకూడదని, అందువల్ల కేంద్ర ప్రభుత్వమే ఏకరూప విధానాన్ని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘పరిహారం నిర్ణయించడం వంటి వ్యవహారాల్లో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు. అసాధారణత, ప్రభావం, విస్తృతి దృష్ట్యా రూ.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించలేం’’ అని ధర్మాసనం పేర్కొంది.

‘షల్‌’...‘మే’...పై స్పష్టత
ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమైన వారికి పరిహారం అందించడానికి నేషనల్‌ అథారిటీ కచ్చితంగా మార్గదర్శకాలను సిఫార్సు చేయాలని ప్రకృతి వైపరీత్యాల చట్టం-2005లోని సెక్షన్‌ 12(3) విస్పష్టంగా చెబుతోంది. పరిహారం తప్పనిసరిగా చెల్లించాలన్న అర్థం వచ్చే రీతిలో ‘షల్‌’ అనే పదం ఉండగా, అవకాశం ఉంటే ఇవ్వవచ్చన్న అర్థంలో ‘మే’ అన్న పదాన్ని ఉపయోగించి ఈ సెక్షన్‌పై కేంద్రం వాదన వినిపించింది. ఆ సెక్షన్‌లోని ‘షల్‌’ అనే పదాన్ని ‘మే’గా చదవాలని, ఇక్కడ ‘షల్‌’ను తప్పనిసరి అన్న అర్థంలో పొందుపరచలేదని చెప్పింది. ఇది సరికాదు. ఆ సెక్షన్‌లో ‘షల్‌’ అన్న పదాన్ని రెండుసార్లు ఉపయోగించడాన్ని బట్టి దాని వెనకున్న ఉద్దేశం సుస్పష్టం. ఈ పరిహారం ‘ఉదారంగా’ ఇచ్చేదే తప్ప, ‘ఆదేశాలకు లోబడి ఇచ్చేది కాదు’ అన్న వాదన కూడా ఆమోదయోగ్యం కాదు.

సరళంగా మరణ ధ్రువీకరణ పత్రాలు
మరణానికి స్పష్టమైన కారణలను చెబుతూ మరణ ధ్రువపత్రాలు జారీచేసేందుకు ఎన్‌డీఎంఏ సరళమైన మార్గదర్శకాలు జారీచేయాలి. ఒకవేళ మరణం కొవిడ్‌ ద్వారా సంభవించి ఉంటే ‘కొవిడ్‌-19 మరణం’ అన్న  స్పష్టమైన కారణం చెబుతూ ధ్రువపత్రం జారీచేయాల్సిన బాధ్యత అధికార వ్యవస్థదే. ఒకవేళ ఎవరైనా కొవిడ్‌-19 వల్లకానీ, కొవిడ్‌-19 సోకడంవల్ల తలెత్తిన సమస్యలవల్లకానీ మరణిస్తే ఆ విషయాన్ని ధ్రువపత్రంలో స్పష్టంగా పేర్కొనాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి కొవిడ్‌ సోకిన రెండు, మూడు నెలల తర్వాత ఆసుపత్రిలోకానీ, ఇంట్లోకానీ మరణించినా, అతని మరణానికి కొవిడే కారణమైనప్పుడు కచ్చితంగా కొవిడ్‌-19 వల్లే మరణించారని ధ్రువపత్రంలో పేర్కొనాలి. అధికారులు జారీచేసిన మరణ ధ్రువీకరణ పత్రంపై కుటుంబసభ్యులకు అభ్యంతరాలు ఉంటే, అందులో మరణానికి నిజమైన, స్పష్టమైన కారణాలు చెప్పకపోయి ఉంటే వారి సమస్యకు కచ్చితమైన పరిష్కారం చూపాలి. సంబంధిత అధికారులను సంప్రదించి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సరిచేయించుకొనే వెసులుబాటు ఇవ్వాలి.

పరిహారం అవసరం లేదని సర్కారు వాదన
తొలుత కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ ‘ఆర్థిక స్థోమత’ పెద్ద సమస్యకాకపోయినా, రూ.4లక్షల పరిహారం చెల్లింపు విషయమై ఇతర అంశాలనూ గమనించాల్సి ఉందని తెలిపింది. జాతి సంపద వినియోగంలో ‘హేతుబద్ధత, వివేకం, గరిష్ఠ ప్రయోజనం’ వంటి అంశాలను పరిశీలించాలని పేర్కొంది. అనంతరం అదనపు ప్రమాణ పత్రం సమర్పిస్తూ కరోనా వంటి విపత్తులు జీవితంలో ఒకేసారే వచ్చేవని, ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ ప్రభావితం చూపిందని తెలిపింది. నిపుణుల సూచనల మేరకు వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నామని, అందువల్ల మళ్లీ నగదు రూపంలో చెల్లించడం ఎందుకని పేర్కొంది. ఏ రాష్ట్రమూ, కేంద్ర పాలిత ప్రాంతమూ ఇంతవరకు పరిహారం చెల్లించలేదని తెలిపింది.

విపత్తుల జాబితాలో కరోనా లేదు
విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం 2015-2020 సంవత్సరాల వరకు వర్తించే మార్గదర్శకాలను జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తన వాదనలో తెలిపింది. ఆర్థిక సహాయం అందజేతకు సంబంధించి 12 జాతీయ స్థాయి విపత్తులను గుర్తించిందని పేర్కొంది. దాని ప్రకారం... 1. తుపాన్లు, 2. కరవు, 3. భూకంపాలు, 4. అగ్నిప్రమాదాలు, 5. వరదలు, 6. సునామీ, 7. వడగండ్ల వాన, 8. కొండచరియలు కూలడం, 9. మంచు చరియల ముప్పు. 10. కుంభవృష్టి. 11. కీటక దాడులు, 12. శీతల గాలులు...వీటినే విపత్తులుగా గుర్తించారని, అందులో కరోనా లేదని తెలిపింది. అయినప్పటికీ దీన్ని ‘విపత్తు’గానే ప్రకటించినట్టు పేర్కొంది. కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం విపత్తుల కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి ఇచ్చే సహాయం ‘కనీస ప్రమాణాల పరిహారం’గా ఉండాలని వివరించింది.

తీర్పులోని ప్రధానాంశాలు

* లభ్యమయ్యే వనరులు, నిధులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే హేతుబద్ధమైన మొత్తాన్ని నిర్ణయించాలి.
* ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌ఎండీఏ ఆరు వారాల్లోగా తాజా మార్గదర్శకాలు ఇవ్వాలి.
* కరోనాతో చనిపోయిన వారి పేరున మరణ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే ప్రక్రియను సరళతరం చేస్తూ మార్గదర్శకాలు ఇవ్వాలి.
* ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు సంబంధించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌ 12(3)పై కేంద్ర ప్రభుత్వం చేసిన వాదన సరికాదు. పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదనడం తగదు. ఈ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదు.
* ఈ సెక్షన్‌ ప్రకారం పరిహారం చెల్లింపుపై మార్గదర్శకాలు ఇవ్వడంలో ఎన్‌డీఎంఏ విఫలమయింది. మార్గదర్శకాలు ఇవ్వకపోతే కోర్టే ఆ పని చేస్తుంది.
* విపత్తుల నిర్వహణకు సంబంధించి ఆర్థిక సంఘాలు చేసే సిఫార్సులు ఏవీ సెక్షన్‌ 12లోని ఆదేశాలను తోసిరాజనలేవు.
* ఆర్థిక సంఘం చేసిన ప్రతిపాదన మేరకు శ్మశాన వాటికల కార్మికుల కోసం బీమా పథకాన్ని రూపొందించడాన్ని కేంద్రం పరిశీలించాలి.

తప్పు సరిదిద్దుకోండి

‘తప్పును సరిదిద్దుకోవడానికి మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఓ అవకాశం ఇచ్చింది. కనీసం ఇప్పటికైనా తగిన మొత్తాన్ని పరిహారంగా నిర్ణయించి బాధితులకు ఉపశమనం కలిగించాలి. అలా చేస్తే సరయిన మార్గంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్టవుతుంది.’

-రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ నాయకుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు