Published : 08/12/2021 02:59 IST

గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేల్లో ఏటీఎంలు

ఏర్పాటు చేయాలని ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ సూచన

గ్రామస్థాయిలో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించాలని సలహా

ఈనాడు, అమరావతి: ‘గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించే దిశగా ఆలోచన చేయాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) ఏటీఎంలు ఏర్పాటు చేసేందుకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో ఇంకా 4,240 ఆర్‌బీకేల పరిధిలో బ్యాంకింగ్‌ సేవలను ప్రారంభించాల్సి ఉందని గుర్తు చేశారు. నిరర్ధక ఆస్తులను (ఎన్‌పీఏ) తగ్గించడంలో వాలంటీర్లు తోడుగా నిలుస్తారని చెప్పారు. సీఎం అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘కొవిడ్‌ కారణంగా 2019-20లో రూ.8వేల కోట్లు, 2020-21లో రూ.14వేల కోట్ల మేర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. కొవిడ్‌ నియంత్రణకు అదనంగా రూ.8వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా రూ.30వేల కోట్ల భారం పడింది. బ్యాంకింగ్‌ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని అధిగమించగలిగింది...’ అని పేర్కొన్నారు. ‘నిర్దేశిత రుణ మొత్తంలో వ్యవసాయరంగానికి గతేడాది 42.50% రుణాలివ్వగా.. ఈ ఏడాది 38.48% మాత్రమే ఇచ్చారు. అర్హులైన రైతులకు ఇంకా కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు అందించాల్సి ఉంది. ఆర్‌బీకేల స్థాయిలో వీటిని జారీ చేయాలి. కౌలు రైతులకు రుణాలు అందించాలి. ఈ-క్రాప్‌ ఆధారంగా ఈ ప్రక్రియ చేపడితే రుణ జాబితాల నుంచి అనర్హులు తొలగిపోతారు...’ అని సీఎం పేర్కొన్నారు.

బోధనాసుపత్రులకు నాబార్డు రుణం

రాష్ట్రంలో కొత్తగా నిర్మించే 16 బోధనాసుపత్రులు, 16 నర్సింగ్‌ కళాశాలలకు రూ.12,243 కోట్లు అవసరం. ఇందులో కొంత రుణంగా ఇచ్చేందుకు నాబార్డు ముందుకొచ్చింది. ఇంకా రూ.9వేల కోట్లు కావాలి...’ అని సీఎం చెప్పారు. ‘నిరుపేదలకు  రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లస్థలాలిచ్చింది. ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) పథకం ద్వారా కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. లబ్ధిదారులకు మరో రూ.35వేల చొప్పున బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలి. ఇళ్ల స్థలాలను ప్రభుత్వం మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్న నేపథ్యంలో   అవసరమైతే వాటిని తనఖా పెట్టుకుని రుణాలు పంపిణీ చేయాలి. ఈ రుణాలపై 3% వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది’ అని వివరించారు. ‘ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి 8.3 లక్షల రుణ ఖాతాలుంటే 1.78 లక్షల ఖాతాలే పునర్వ్యవస్థీకరించారు. ఓటీఆర్‌(వన్‌ టైమ్‌ రీ స్ట్రక్చరింగ్‌) వినియోగించుకునే అవకాశం వారికి కల్పించాలి..’ అని సూచించారు.

నాబార్డు సహకరించాలి

రాష్ట్రంలోని 10,778 ఆర్‌బీకేల్లో ప్రత్యేక సామాజిక అద్దె యంత్రాల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. ఇందుకు సహకరించాలని నాబార్డును కోరారు. ‘వ్యవసాయ, ప్రాధాన్య రంగాల్లో బ్యాంకింగ్‌ వ్యవస్థ మంచి పనితీరు కనబర్చింది. ఎంఎస్‌ఎస్‌ఈ రంగానికి మరింత ప్రాధాన్యం కల్పించాలి. విద్య, గృహరుణాల మంజూరు కూడా మందకొడిగా ఉంది...’ అని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఆర్‌బీకేల్లో ఏటిఎం సహా ఇతర బ్యాంకింగ్‌ సేవలను విస్తరించే ప్రయత్నం చేస్తున్నామని యూనియన్‌ బ్యాంక్‌ ఎండీ రాజ్‌కిరణ్‌రాయ్‌ చెప్పారు. సున్నా వడ్డీని ఎప్పటికప్పుడు బ్యాంకులకు చెల్లిస్తున్నందున రైతులకు లబ్ధి కలుగుతోందని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

బిజినెస్

క్రీడలు

పాలిటిక్స్

వెబ్ ప్రత్యేకం

జాతీయం