కొత్త జడ్పీలపై ఉత్కంఠ!

కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నూతన జిల్లా పరిషత్తులు కూడా తెరపైకి వస్తున్నాయి. జడ్పీలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ... నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని

Published : 27 Jan 2022 02:46 IST

తెలంగాణ విధానమే కొనసాగిస్తారా?
కొత్తగా నిర్ణయాలు తీసుకుంటారా?
రాష్ట్రంలో మొదలైన చర్చ

ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో నూతన జిల్లా పరిషత్తులు కూడా తెరపైకి వస్తున్నాయి. జడ్పీలపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ... నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని అధికారవర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అక్కడి ప్రభుత్వం అమలు చేసిన పద్ధతిని ఇక్కడా కొనసాగిస్తారా? కొత్త నిర్ణయాలు తీసుకుంటారా? అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

అక్కడ ఏం చేశారంటే?

తెలంగాణలో కొత్త జిల్లాలు ప్రారంభించాక వెంటనే జిల్లా పరిషత్తులు ఏర్పాటు కాలేదు. అప్పటికే ఉన్న జడ్పీ ఛైర్మన్‌, జడ్పీటీసీ సభ్యులు... తదుపరి పరిషత్‌ ఎన్నికలు నిర్వహించే వరకు యథావిధిగా కొనసాగారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాను విభజించి కొత్తగా వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలను ఏర్పాటు చేశారు. రంగారెడ్డితో కలిపి మొత్తం మూడు జిల్లాల్లోనూ అప్పటికే ఉన్న జడ్పీ పాలకవర్గమే కొన్నాళ్లు కొనసాగింది. మూడు జిల్లాలకూ కలిపే జిల్లా పరిషత్తు ఉమ్మడి సర్వసభ్య సమావేశాలు నిర్వహించారు. పాలకవర్గ పదవీ కాలం ముగిశాక మరో రెండు జిల్లా పరిషత్తులను ఏర్పాటు చేసి మూడింటికీ కలిపి 2019లో ఒకేసారి పరిషత్‌ ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణ అంతటా ఇదే విధానాన్ని అమలు చేశారు.

చట్టాన్ని సవరించి బిల్లు పెట్టాల్సిందే

కొత్తగా జడ్పీలు ఏర్పాటు చేయాలంటే పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో బిల్లు పెట్టాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాల విస్తీర్ణం మారనుంది. అదేవిధంగా జిల్లా పరిషత్తులకు కొత్త విస్తీర్ణంతో మ్యాపింగ్‌ చేయాలి. చట్ట సవరణ అనంతరమే ఈ ప్రక్రియ మొదలవుతుంది. రాష్ట్రంలోని జిల్లా పరిషత్తుల పాలకవర్గాల పదవీ కాలం 2021 సెప్టెంబరులో ప్రారంభమైంది. మరో నాలుగున్నరేళ్లకుపైగా వీరు కొనసాగుతారు. అప్పటివరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? కొత్త జడ్పీల కోసం పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించి అసెంబ్లీలో బిల్లు పెడుతుందా? అనేది చూడాలి. కేవలం కొత్త జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలనుకుంటే సాంకేతికంగా కొన్ని సమస్యలు తలెత్తొచ్చని  నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు ఒక జడ్పీటీసీ స్థానం నుంచి ఎన్నికైన వ్యక్తికి రిజర్వేషన్లు కలిసి రావడంతో జడ్పీ ఛైర్మన్‌ స్థానం కూడా దక్కింది. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్పీటీసీ స్థానం కొత్త జిల్లాలోకి మారి అక్కడ కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే... అప్పటివరకు ఉన్న ఛైర్మన్‌ పదవి కోల్పోయే అవకాశముంది. ఇలాంటి సాంకేతిక అంశాలను అధిగమించి ప్రభుత్వం ఏవిధంగా ముందుకు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రం యూనిట్‌గా వివిధ వర్గాల జనాభా ఆధారంగా జడ్పీ ఛైర్మన్‌ స్థానాలకు ఖరారు చేసే రిజర్వేషన్ల విధానమే మున్ముందూ కొనసాగుతుందని నిపుణులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని