Encounter in Jammu Kashmir: ఉగ్రఘాతుకం

ఎన్‌కౌంటర్లతో సోమవారం జమ్మూ-కశ్మీర్‌ దద్దరిల్లింది. మూడు చోట్ల భద్రత దళాలకు, ఉగ్రమూకలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకే ఘటనలో ఐదుగురు భద్రత దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన చోట్ల ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Updated : 12 Oct 2021 09:54 IST

కశ్మీర్‌లో ఓ అధికారి సహా ఐదుగురు జవాన్లను బలి తీసుకున్న ముష్కరులు
పెద్ద ఎత్తున నక్కిన సాయుధ మూకలు

జమ్మూ: ఎన్‌కౌంటర్లతో సోమవారం జమ్మూ-కశ్మీర్‌ దద్దరిల్లింది. మూడు చోట్ల భద్రత దళాలకు, ఉగ్రమూకలకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒకే ఘటనలో ఐదుగురు భద్రత దళాల సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, మిగిలిన చోట్ల ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో పోలీసు గాయపడ్డారు. మరోవైపు సాయుధులైన ముష్కరులు నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి దాక్కున్నారన్న సమాచారంతో భద్రత దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. పూంఛ్‌ జిల్లా సురన్‌కోట్‌ సమీపంలోని ఓ గ్రామ పరిసరాల్లో సుమారు ఐదుగురు ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న నిఘా సంస్థల సమాచారం మేరకు సోమవారం ఉదయం భద్రత దళాలు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టాయి ఉగ్రవాదులు పెద్దఎత్తున కాల్పులకు తెగబడడంతో ఓ జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి(జేసీవో)తో పాటు మరో నలుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయారని అధికారులు పేర్కొన్నారు. జస్విందర్‌ సింగ్‌(జేసీవో), మణ్‌దీప్‌ సింగ్‌, గజ్జన్‌ సింగ్‌, సరాజ్‌ సింగ్‌, వైశాఖ్‌లు అమరులైనట్లు తెలిపారు. ఇంకా అక్కడ ఎన్‌కౌంటర్‌ కొనసాగుతూనే ఉందని చెప్పారు. అనంత్‌ నాగ్‌, బందిపొరా జిల్లాల్లోనూ ఉగ్రమూకల కోసం జల్లెడ పడుతుండగా ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. అనంత్‌నాగ్‌లో ఒక ముష్కరుడు హతం కాగా మరో పోలీసు గాయపడ్డారు. బందిపొరాలో ఒక ఉగ్రవాదిని మట్టుబెట్టారు. మరోవైపు జమ్మూలోని జగ్తి శరణార్థి శిబిరం పరిసరాల్లో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగున్నట్లు సమాచారం అందడంతో భద్రత దళాలు గాలింపు చేపట్టాయి. ఈ శిబిరంలో కశ్మీరీ పండిట్లు ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల కశ్మీర్‌లో కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా ఉగ్రదాడులు పెరిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని