Pattabhiram: పట్టాభికి 2 వరకు రిమాండు

తెదేపా నేత పట్టాభిరామ్‌కు మేజిస్ట్రేట్‌ వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండు విధించారు. సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించి, గొడవలకు కారకుడయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు

Updated : 22 Oct 2021 05:09 IST

మచిలీపట్నం జిల్లా కారాగారానికి తరలింపు
కొవిడ్‌ ఫలితం అనంతరం రాజమహేంద్రవరం జైలుకు

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, నేరవార్తలు, న్యాయవిభాగం: తెదేపా నేత పట్టాభిరామ్‌కు మేజిస్ట్రేట్‌ వచ్చే నెల 2వ తేదీ వరకు రిమాండు విధించారు. సీఎం జగన్‌ను పరుష పదజాలంతో దూషించి, గొడవలకు కారకుడయ్యారని విజయవాడకు చెందిన వ్యాపారి షేక్‌ మస్తాన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బుధవారం కేసు నమోదుచేసి పట్టాభిని అరెస్టుచేశారు. గురువారం ఉదయం విజయవాడ కొత్త ఆసుపత్రికి తీసుకొచ్చి, కొవిడ్‌ సహా పలు పరీక్షలు చేయించారు. అనంతరం మూడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినిపించారు. పట్టాభిపై ఐదు కేసులున్నాయని, ముఖ్యమంత్రిని దూషించారని, ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని, అందువల్ల రిమాండ్‌ విధించాలని కోరారు. పట్టాభి తరఫు న్యాయవాదులు గూడపాటి లక్ష్మీనారాయణ, చేకూరి శ్రీపతిరావు వాదనలు వినిపిస్తూ.. 41 (ఏ) సీఆర్‌పీసీ ప్రకారం స్టేషన్‌ బెయిలు ఇవ్వాలన్నారు. వాదనలు విన్న మేజిస్ట్రేట్‌ శ్రీసత్యాదేవి... నిందితుడికి వచ్చేనెల 2వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణ కోసం నిందితుడిని ఐదు రోజుల కస్టడీకి అనుమతించాలని పోలీసులు పిటిషన్‌ దాఖలుచేశారు. దీనిపై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. నిబంధనల ప్రకారం కొవిడ్‌ ఫలితం వచ్చేవరకూ మచిలీపట్నంలోని జిల్లాజైలులో ఉంచాలి. దీంతో గురువారం రాత్రి అక్కడికి తరలించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పట్టాభి డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.

ఖాళీలతో 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసు

కోర్టులో వాదనల సందర్భంగా పట్టాభి పలు అంశాలను ప్రస్తావించారు. పోలీసులు తనపట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. సెక్షన్‌ 41ఏ కింద నోటీసు ఇవ్వలేదని చెప్పారు. మధ్యవర్తుల సమక్షంలో రికార్డు చేసినట్లు చెబుతున్న నేర అంగీకార పత్రంలో లోపాలను ఎత్తిచూపారు. తాను నేరాన్ని అంగీకరించలేదని, సంతకాలే తీసుకున్నారని చెప్పారు. 41 (ఏ) సీఆర్‌పీసీ నోటీసులో ఖాళీలు ఎందుకు ఉన్నాయని, దీనిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని గవర్నర్‌పేట సీఐని మేజిస్ట్రేట్‌ ఆదేశించారు.

రిమాండ్‌ రిపోర్ట్‌లోని అంశాలు

ఈ నెల 19న తెదేపా రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులపై పట్టాభి తీవ్ర పదజాలంతో దూషించారు. ఇది వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమైంది. వివిధవర్గాల మధ్య వైషమ్యాలకు దారితీసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. అతడు వాడిన రెచ్చగొట్టే భాష కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారి పట్ల ఇటువంటి ధోరణి సరికాదు. ఆయనను అరెస్టు చేయకుండా వదిలేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుంది. ముఖ్యమంత్రిని దూషిస్తూ.. జన్మనిచ్చిన ఆయన తల్లిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పట్టాభిపై కేసు నమోదు అయింది.

* ఈ కేసు విచారణ నిమిత్తం పట్టాభి ఇంటికి వెళ్లగా.. విచారణకు సహకరించకుండా ఇంట్లో ఉండి తలుపులు వేసుకున్నారు. నాలుగున్నర గంటల పాటు వేచి చూసినా బయటకు రాలేదు. దీంతో ఇంటి తలుపులు తెరిచి లోపలకు వెళ్లి అదుపులోకి తీసుకున్నాం. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో నగరానికి దూరంగా ఉన్న తోట్లవల్లూరు స్టేషనుకు తరలించి, స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం. ఇప్పటికే పట్టాభిపై నగర కమిషనరేట్‌ పరిధిలోని వివిధ స్టేషన్లలో ఐదు కేసులు ఉన్నాయి. ఒకటో పట్టణ పీఎస్‌లో క్రైం నెం.. 6/21, గవర్నర్‌పేట స్టేషనులో క్రైం నెం. 86/19, 87/19, సూర్యారావుపేట స్టేషనులో క్రైం నెం. 224/20, కృష్ణలంక స్టేషనులో క్రైం నెం. 32/21 కింద నమోదై, వివిధ దశలలో ఉన్నాయి.

* పట్టాభితో పాటు మరికొందరు ఉన్నట్లు అనుమానం ఉంది. వీరి గురించి వివరాలు తెలుసుకునేందుకు విచారించాలి. నిందితుడి వ్యాఖ్యల కారణంగా రాష్ట్రంలో పలు అవాంఛనీయ ఘటనలు సంభవించాయి. ఓ పోలీసు అధికారిపై హత్యాయత్నం జరిగింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషనులో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో నిందితుడిని అరెస్టు చేయాల్సి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని