Corruption:అవినీతిలో రెవెన్యూదే అగ్రస్థానం

రాష్ట్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో సగానికి సగం మంది రెవెన్యూశాఖలో పని చేసేవారే ఉన్నారు. ఏడాది వ్యవధిలో 72 ట్రాప్‌ కేసులు నమోదు కాగా... వాటిల్లో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు.

Updated : 31 Dec 2021 16:56 IST
పట్టుబడిన వారిలో సగం మంది ఆ శాఖ ఉద్యోగులే
ఇంధన, పంచాయతీరాజ్‌, హోం, పురపాలక శాఖల్లోనూ లంచగొండులు ఎక్కువే
వార్షిక నేర నివేదిక-2021 విడుదల చేసిన ఏసీబీ
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ప్రభుత్వ ఉద్యోగుల్లో సగానికి సగం మంది రెవెన్యూశాఖలో పని చేసేవారే ఉన్నారు. ఏడాది వ్యవధిలో 72 ట్రాప్‌ కేసులు నమోదు కాగా... వాటిల్లో 36 కేసుల్లో రెవెన్యూ ఉద్యోగులే నిందితులుగా ఉన్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిలో రెవెన్యూతో పాటు ఇంధన, పంచాయతీరాజ్‌, హోం, పురపాలక-పట్టణాభివృద్ధిశాఖల ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తం ట్రాప్‌ కేసుల్లో 86.11 శాతం (62 కేసులు) ఈ 5 శాఖల ఉద్యోగులపైనే నమోదయ్యాయి. 2021 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నేర గణాంక నివేదికను ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు గురువారం విడుదల చేశారు. 


అత్యధిక లంచం రూ.4.50 లక్షలు... అత్యధిక అక్రమాస్తులు రూ.10.79 కోట్లు

* విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం తహసీల్దారుగా పని చేసిన బి.రవికుమార్‌ రూ.4.50 లక్షలు, శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం తహసీల్దారు బి.నాగభూషణరావు రూ.4 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ ఏడాదిలో అత్యధిక మొత్తం లంచం తీసుకుంటూ పట్టుబడిన వారిలో వీరిరువురు ఉన్నారు. భూముల మ్యుటేషన్‌, పొసెషన్‌ సర్టిఫికేట్‌, భూముల వివరాల్ని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రెవెన్యూశాఖ ఉద్యోగులు లంచాలు తీసుకున్నారు.


* ఈ ఏడాదిలో నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో అత్యధికంగా ఎంబీసీడబ్ల్యూడీ కార్పొరేషన్‌ ఎండీ బి.నాగభూషణం వద్ద రూ.10.79 కోట్ల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. ఏపీఈపీడీసీఎల్‌ ఏఈ ఎం.నాగేశ్వరరావు వద్ద రూ.3.82 కోట్ల విలువైన అక్రమాస్తులు గుర్తించారు.


* లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వోద్యోగులకు సంబంధించి 72 కేసులు నమోదు చేశారు. వారు లంచంగా తీసుకుంటున్న రూ.32.40 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.


టోల్‌ ఫ్రీ నంబరుకు 2,851 ఫిర్యాదులు

వినీతిపై ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు 14400కు ఈ ఏడాది 2,851 ఫిర్యాదులందాయి. వాటి ఆధారంగా 8 ట్రాప్‌ కేసులు, 16 రెగ్యులర్‌ విచారణలు చేపట్టారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని