Ap news: గ్రామాల నుంచి రాజధానుల వరకు వికేంద్రీకరణ

పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణలో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. దీనివల్ల పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలవల్ల వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,

Updated : 05 Apr 2022 05:57 IST

పరిపాలనా సౌలభ్యానికే కొత్త జిల్లాలు
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి
సర్వీస్‌ రికార్డుల్లో అధికారుల పని తీరు నమోదు
కొత్త జిల్లాల ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
జిల్లాల సమాచార పుస్తకావిష్కరణ
ఈనాడు - అమరావతి

పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణలో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడించారు. దీనివల్ల పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందన్నారు. ప్రతి జిల్లాలో ఏర్పాటయ్యే కార్యాలయాలవల్ల వ్యాపార, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మంచి చేకూరుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం ఉదయం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘‘ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగానే 26 జిల్లాలను ఏర్పాటు చేశాం.  
గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు వికేంద్రీకరణ చేయడం మా ప్రభుత్వ ఉద్దేశం. జిల్లాల్లో ముఖ్య పట్టణానికి... చివర్లో ఉన్న ప్రాంతం ఎంత దూరంలో ఉందో, ఏమేమి సమస్యలున్నాయో పాదయాత్ర ద్వారా గమనించాను. ఆ సమస్యలు లేకుండా, ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసే చర్యల్లో భాగంగానే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. గ్రామ/వార్డు స్థాయిలో మాదిరిగానే జిల్లా పరిపాలనకు సంబంధించి రెవెన్యూ డివిజన్ల వరకు మార్పులు అవసరమని ఈ సందర్భంగా చెప్పారు.

సగటున 19.7 లక్షల మంది జనాభాతో ఒక్కో జిల్లా..!
‘‘దేశంలో యూపీలో అత్యధికంగా 75, తక్కువగా గోవాలో రెండు జిల్లాలు ఉన్నాయి. అతి పెద్ద రాష్ట్రాల్లో ఏడో స్థానంలో ఉన్న ఏపీలో 13 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. చిన్న రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్‌ప్రదేశ్‌లో 1.35 కోట్ల మంది జనాభాకు ఏకంగా 25 జిల్లాలు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున మహారాష్ట్రలో 31 లక్షలు మంది, కర్ణాటకలో 20 లక్షలు, యూపీలో 26.64 లక్షల మంది చొప్పున ఉన్నారు. ఉత్తరాఖండ్‌లో కేవలం ఆరు లక్షలు, మిజోరంలో లక్ష మందికి , అరుణాచల్‌ప్రదేశ్‌లో 53 వేల మందికి ఒక్కో జిల్లా ఉంది. తెలంగాణలో 10.60 లక్షల మంది చొప్పున ఉన్నారు. ఆ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో కలిపి 4.90 కోట్ల మంది ఉన్నారు. దీని ప్రకారం ప్రతి జిల్లాలో సగటున 38.15 లక్షల మంది ఉన్నారు. ఇంత ఎక్కువ జనాభా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. కొత్తగా వచ్చిన జిల్లాల ద్వారా 19.07 లక్షల మంది సగటున ఒక్కో జిల్లాలో ఉన్నారు. ప్రతి జిల్లా పరిధిలో 18 లక్షల నుంచి 23 లక్షల మంది జనాభా ఉండేలా చర్యలు తీసుకున్నాం. 1970లో ప్రకాశం, 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఆ తర్వాత ఇప్పుడే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి.ఇప్పుడు కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉన్నాయి. గ్రామ స్థాయి నుంచి పౌర సేవల్లో వేగం, పారదర్శకత పెరిగింది. అవినీతి, వివక్ష తగ్గింది. సంతృప్తి స్థాయిలో పథకాలు అమలవుతున్నాయి.  

కుప్పం ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు రెవెన్యూ డివిజన్‌
రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ప్రజల విజ్ఞప్తుల మేరకు జిల్లాల ఏర్పాటులో మార్పులు, చేర్పులు చేశాం. తొలుత నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జిల్లాలు ఏర్పాటు చేశాం. ఇందులో కూడా 12 నియోజకవర్గాల్లో మండలాలను కొద్దిగా విభజించి, కొన్ని మండలాలను ఒక జిల్లాలోనూ, మరికొన్ని మండలాలను పక్క జిల్లాలో ప్రజల ఆకాంక్షల మేరకు చేయాల్సి వచ్చింది. కుప్పం స్థానిక ఎమ్మెల్యేగా, 14 ఏళ్లపాటు సీఎంగా ఉన్నా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు గురించి పట్టించుకోలేదు. ఆయనే స్వయంగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా చర్యలు తీసుకున్నాం. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కలెక్టరేట్‌, జిల్లా ఎస్పీ కార్యాలయాలు, మిగిలిన కేంద్రాలు అన్ని ఒకే చోటుకు వస్తాయి. కనీసం 15 ఎకరాల విస్తీర్ణంలో అన్నీ  ఏర్పాటవుతున్నాయి. వీటిని ఇంటిగ్రేటెడ్‌గా ఏర్పాటు చేస్తే అన్ని కార్యాలయాలు ఒకే చోట కనిపిస్తాయి...’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా కలెక్టర్ల పనితీరు ఉండాలని సీఎం జగన్‌ పునరుద్ఘాటించారు. వీటికి తగ్గట్లు సర్వీస్‌ రికార్డుల్లో నమోదు చేస్తామని వెల్లడించారు.

ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తాం
కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, బాపట్ల జిల్లా కలెక్టర్‌ కె.విజయ, తిరుపతి జిల్లా కలెక్టర్‌ కె.వెంకటరమణారెడ్డి, తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంతో మాట్లాడుతూ కొత్త జిల్లాలో పనిచేసేందుకు అవకాశం రావడంపై తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
* ‘జిల్లాకు తొలి కలెక్టర్‌గా అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. గిరిజనులతో మమేకమై...వారి జీవన విధానాన్ని మరింతగా మెరుగుపరిచేలా కృషి చేస్తాం. మేం కష్టపడి పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేస్తాం..’ అని సుమిత్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారంలో రెండు రోజులు రంపచోడవరంలో ఉండాలని ఆయనకు సీఎం జగన్‌ సూచించారు.
* మీ ఆలోచనలకు ప్రతిరూపంగా జిల్లా అభివృద్ధిలో భాగస్వాములవుతామని బాపట్ల కలెక్టర్‌ విజయ పేర్కొన్నారు.
* గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ప్రజల సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమవుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతో మరింతగా ప్రభుత్వ సేవలు అందుతున్నాయి. ప్రజా సమస్యలు పరిష్కరించేలా ప్రతి ప్రభుత్వ అధికారి నిబద్ధతతో పనిచేస్తున్నారు.’ అని తిరుపతి కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి వెల్లడించారు.
తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి మాట్లాడుతూ...‘ మీ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రభుత్వానికి, పోలీస్‌ శాఖకు మంచి పేరు తీసుకువస్తాం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు...’అని పేర్కొన్నారు.

జిల్లాల సమాచార పుస్తకావిష్కరణ

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రణాళిక శాఖ రూపొందించిన ‘డిస్ట్రిక్ట్‌ హ్యాండ్‌ బుక్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌’ను సీఎం ఆవిష్కరించారు. మంత్రి పేర్నినాని, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, అజయ్‌కల్లం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు, ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘ఇది చారిత్రాత్మక ఘట్టం. కొత్త జిల్లాల ఏర్పాటుతో మీరు చరిత్రలో నిలిచిపోతారు. 1808లో కడప జిల్లా తొలిసారిగా ఏర్పడింది. అదే శతాబ్దంలో కృష్ణా, అనంతపురం జిల్లాలు వచ్చాయి. 1909లో గుంటూరు, 1911లో చిత్తూరు, 1925లో ఉభయగోదావరి జిల్లాలు ఏర్పడ్డాయి. 1953లో కర్నూలు, నెల్లూరు జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తరువాత ప్రకాశం, విజయనగరం జిల్లాలు ఏర్పడ్డాయి. పరిపాలనాపరంగా తెచ్చిన సంస్కరణలో రాజుల బాటలోనే ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన మీరూ రాజు అయ్యారు. తొలిగా ఏర్పడిన కడప జిల్లాకు చెందిన మీ నాయకత్వంలోనే ఒకేసారి, ఒకే స్ట్రోక్‌తో 13 జిల్లాలు ఏర్పడ్డాయి...’ అని రాష్ట్ర ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయకుమార్‌ పేర్కొన్నారు.


11న కొత్త మంత్రుల ప్రమాణం!

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ వివిధ శాఖల ఉన్నతాధికారులకు సోమవారం సమాచారమిచ్చారు. 7న ఉదయం 11 గంటలకు కేబినెట్‌ భేటీ నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనలో కొన్ని మార్పులు చోటు చేసుకోవడంతో మధ్యాహ్నానికి మారిందని తెలిసింది. నరసరావుపేటలో ఈ నెల 6న వాలంటీర్లకు సత్కార కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. అయితే ఆయన రెండురోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దిల్లీ వెళ్లనున్నారు. దీంతో వాలంటీర్లతో కార్యక్రమాన్ని 6న కాకుండా 7న ఉదయం ఏర్పాటు చేశారు. అందువల్ల మంత్రిమండలి సమావేశాన్ని ఆరోజు ఉదయం కాకుండా మధ్యాహ్నానికి మార్చారని తెలిసింది.
మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎవరెవరిని తప్పిస్తున్నారో ముఖ్యమంత్రి జగన్‌ 7న కేబినెట్‌ సమావేశంలో వెల్లడించనున్నారని తెలిసింది. దీంతో ఆయా మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుంది. వారి రాజీనామా విషయాన్ని ముఖ్యమంత్రి 8న గవర్నర్‌ను కలిసి వివరించి, వారి స్థానంలో కొత్తవారిని తీసుకునేందుకు అనుమతించాలని కోరతారని సమాచారం. గవర్నర్‌ ఆమోదం తెలపగానే అదేరోజు కొత్తగా మంత్రిమండలిలోకి వచ్చే వారికి సమాచారమిస్తారని అంటున్నారు. 11న ఉదయం 11:31 గంటలకు వెలగపూడిలోని సచివాలయ భవన సముదాయం పక్కనున్న స్థలంలో ఏర్పాటు చేయనున్న వేదికపై కొత్త మంత్రులతో గవర్నర్‌ ప్రమాణం చేయించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని