అల్లూరి జయంతి నేపథ్యంలో నేటి నుంచి ప్రత్యేక వేడుకలు

స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి వారం పాటు పశ్చిమగోదావరి జిల్లా

Updated : 27 Jun 2022 06:06 IST

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వారంపాటు నిర్వహణ

4న విగ్రహం ఆవిష్కరించనున్న ప్రధాని

భీమవరం పట్టణం, గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి వారం పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తోంది. తొలి రోజు విద్యార్థులు దేశనాయకుల వేషధారణల్లో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నారు. అల్లూరి జయంతి రోజైన జులై 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ భీమవరం రానున్నారు. స్థానిక ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ఉన్న పురపాలక పార్కు ప్రాంగణంలో ఏర్పాటుచేయనున్న 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని  ఆవిష్కరిస్తారు. జులై 4నుంచి ఏడాది పాటు అల్లూరి 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. 

విజయవాడ మీదుగా ప్రధాని పర్యటన 

ప్రధాని నరేంద్రమోదీ జులై 4న విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి భీమవరం వెళతారని అధికార వర్గాలు తెలిపాయి. రాజమహేంద్రవరం విమానాశ్రయం మీదుగా భీమవరానికి సాగనున్నట్లు భావించినప్పటికీ ఇందులో మార్పు జరిగింది. జులై 4న ఉదయం 9.20 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరనున్న ప్రధాని మోదీ.. 10.10 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో 10.50 గంటలకు భీమవరం వెళతారు. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ, బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 1.10 గంటలకు దిల్లీ బయలుదేరి వెళ్తారని అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు