CM Jagan: సాగు రంగానికి ప్రాధాన్యం

విభజిత ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో సాగు రంగానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో

Updated : 08 Aug 2022 04:32 IST

నాడు-నేడుతో పాఠశాలల్లో మౌలిక వసతులు

ఇంటి వద్దకే పౌర సేవలు

ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: విభజిత ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం కావడంతో సాగు రంగానికి తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. దిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 62% సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని, రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35% పైమాటేనని వివరించారు. ‘‘సాగు సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9గంటలు ఉచిత విద్యుత్తు సరఫరాతో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాకు 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. పంటల కొనుగోలు ప్రక్రియను సీఎం యాప్‌తో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీలేని పంట రుణాలు, పంటల కొనుగోలును సమర్ధంగా అమలు చేసేందుకు ఈ-క్రాప్‌ బుకింగ్‌ దోహదపడుతోంది. రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నాం. బడి మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతో పాటు జీఈఆర్‌ నిష్పత్తిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతం కాగా ఏపీలో అది 84.48 కావడం విచారకరం. 2018 కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం విద్యారంగంలో రాష్ట్ర పనితీరు దారుణంగా ఉన్నందున విద్యారంగంలో కీలకాంశాలపై దృష్టి పెడుతూ సమర్థ విధానాలను తీసుకొచ్చాం. పిల్లలను బడికి పంపిస్తే ఏటా రూ.15 వేల చొప్పున తల్లులకు అమ్మఒడి కింద అందిస్తున్నాం. మధ్యాహ్న భోజన పథకంలోనూ సమూల మార్పులు తెచ్చాం. నాణ్యమైన విద్య అందించేందుకు బైజూస్‌ యాప్‌ ద్వారా బోధన అందిస్తున్నాం, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇవ్వనున్నాం. మన బడి నాడు-నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో వసతులు కల్పిస్తున్నాం. అన్ని స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి, మూడో తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యాదీవెన కింద గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ముందుకొచ్చింది. 2018-19లో క్యాంపస్‌ ఎంపికల్లో 37వేల మందికి ఉద్యోగాలు వస్తే, 2020-21లో 69 వేల ఉద్యోగాలు వచ్చాయి. పౌరుల ఇళ్ల వద్దే సేవలు అందించేందుకు 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. ప్రతి 50-100 ఇళ్లకు ఒక వాలంటీరును నియమించాం. అర్హులకు పథకాలు అందేందుకు అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టాం’’ అని ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. ఆయా అంశాలకు సంబంధించి ఒక నివేదికను సమర్పించారు.

రాష్ట్రానికి చేరుకున్న సీఎం జగన్‌
గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన సీఎం జగన్‌.. ఆదివారం రాత్రి 7 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు  పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అక్కడినుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎస్పీ జాషువా, సీపీ క్రాంతిరాణా టాటా నేతృత్వంలో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts