‘పంచ’ప్రాణ ప్రతిష్ఠ

స్వాతంత్య్ర అమృతోత్సవాలతో భారతావని పులకిస్తున్నవేళ ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా సంకల్పాన్ని తలపోశారు. దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే కొనసాగుతున్న భారత్‌ను.. పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరింపజేద్దామంటూ పిలుపునిచ్చారు. అందుకోసం పంచ ప్రాణమంత్రాన్ని ఉపదేశించారు.

Updated : 16 Aug 2022 06:35 IST

భారతావని ప్రగతికి ప్రధాని మోదీ మహాసంకల్పం
అయిదు సూత్రాలతో పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరిద్దాం
అవినీతి చెదను అంతమొందిద్దాం
వారసత్వ రాజకీయాల నుంచి దేశానికి విముక్తి కల్పిద్దాం
ఎర్రకోట పైనుంచి మోదీ పిలుపు

అమృత కాలంలో అడుగుపెట్టిన మనం.. వచ్చే 25 ఏళ్లు ఒక్క క్షణం కూడా వృథా చేయకూడదు. ప్రతి నిమిషం, ప్రతిరోజు మాతృభూమి కోసం జీవించాలి. దేశాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలి. అప్పుడే స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది .

- మోదీ

ఈనాడు, దిల్లీ: స్వాతంత్య్ర అమృతోత్సవాలతో భారతావని పులకిస్తున్నవేళ ఎర్రకోట బురుజుల పైనుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహా సంకల్పాన్ని తలపోశారు. దశాబ్దాలుగా ‘అభివృద్ధి చెందుతున్న దేశం’గానే కొనసాగుతున్న భారత్‌ను.. పాతికేళ్లలో ‘అభివృద్ధి చెందిన దేశం’గా అవతరింపజేద్దామంటూ పిలుపునిచ్చారు. అందుకోసం పంచ ప్రాణమంత్రాన్ని ఉపదేశించారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి భూతాన్ని తరిమేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. పరిశోధనలు, నవకల్పనలను ప్రోత్సహించేలా.. ఆధునిక ప్రపంచంలో ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని చాటిచెప్పేలా ‘జై అనుసంధాన్‌’ అంటూ కొత్త నినాదమిచ్చారు. అవినీతిపై మరింత విస్తృత పోరాటానికి శంఖారావం పూరించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మేరకు సోమవారం ఆయన ఎర్రకోట పైనుంచి జాతినుద్దేశించి (వరుసగా తొమ్మిదోసారి) దాదాపు 82 నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రధాని ప్రసంగంలోని కీలక వివరాలు ఆయన మాటల్లోనే..

రూ.2 లక్షల కోట్లు కాపాడగలిగాం

నేను ప్రధానంగా రెండు విషయాల గురించి చర్చించాలనుకుంటున్నాను. ఒకటి- అవినీతి, రెండు- బంధుప్రీతి. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటి మన దేశంలో ఒకపైపు.. తలదాచుకోవడానికి కూడా చోటు లేని ప్రజలు కనిపిస్తారు. మరోవైపు.. దోచుకున్న సొత్తు ఎక్కడ దాచుకోవాలో తెలియక తికమకపడేవారు కనిపిస్తారు. ఇది ఎంతమాత్రమూ మంచిది కాదు. అవినీతిపై చేస్తున్న పోరాటంలో మనం నిర్ణాయక సమయంలోకి అడుగుపెడుతున్నాం. ఇక పెద్దపెద్ద తిమింగలాలు కూడా తప్పించుకోలేవు. ఆధార్‌, మొబైల్‌ను ఉపయోగించి ప్రత్యక్ష నగదు బదిలీ విధానాన్ని అనుసరిస్తుండటంతో గత ఎనిమిదేళ్లలో రూ.2 లక్షల కోట్లు అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడగలిగాం. అలా ఆదా అయిన డబ్బును దేశాభివృద్ధి కోసం ఉపయోగించాం. గత ప్రభుత్వాల హయాంలో కొందరు బ్యాంకులను లూటీ చేసి పారిపోయారు. వారి సంపదను జప్తు చేస్తున్నాం. కాజేసిన సొమ్మును, వారిని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. ఎందరో అవినీతిపరులను జైళ్లలో మగ్గేలా చేశాం.

అవినీతిపరులను చీదరించుకోవాలి

కొంతమంది ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుంటారంటే.. కోర్టులో అవినీతి నిరూపితమై శిక్ష పడినప్పటికీ, జైలుకు వెళ్లడం ఖాయమైనప్పటికీ తమను తాము మహిమాన్వితులుగా చెప్పుకొనే ప్రయత్నం చేస్తుంటారు. గొప్పలు చెప్పుకొనే పనిలో ఉంటారు. ఎప్పటివరకు సమాజంలో మురికిని చీదరించుకోరో.. అప్పటివరకు స్వచ్ఛతా చైతన్యం రాదు. ఎప్పటివరకు అవినీతిని, అవినీతిపరులను చీదరించుకొనే పరిస్థితి రాదో.. సామాజికంగా అలాంటి వారిని నీచంగా చూసే పరిస్థితి తలెత్తదో అప్పటివరకు అవినీతి పోదు.

వారసత్వ రాజకీయాలొద్దు

బంధుప్రీతి మరో ప్రధాన రుగ్మత. రాజకీయాల్లోని ఆ దుష్ట సంస్కృతి క్రమంగా అన్ని రంగాలకూ విస్తరించింది. దేశవ్యాప్తంగా అనేక సంస్థలను అది పీడిస్తోంది. దానివల్ల దేశంలో ప్రతిభావంతులకు, సమర్థులకు నష్టం జరుగుతోంది. అవినీతికి బంధుప్రీతి కూడా ఒక కారణం. దాన్ని ప్రతిచోటా వ్యతిరేకించాలి. ఆ దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలి. అప్పుడే మన సంస్థలను కాపాడుకోగలుగుతాం. వ్యవస్థల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇది అత్యవసరం. రాజకీయాల్లోనూ బంధుప్రీతి అత్యంత హానికరం. వారసత్వ రాజకీయాలు ఆయా కుటుంబాల కోసం పనిచేస్తాయి తప్ప.. దేశం కోసం కాదు. ‘నాకు యోగ్యత ఉన్నా వెనకుండి ప్రోత్సహించే తల్లిదండ్రులు, అవ్వాతాతలు లేరు’ అని కొంతమందికి అనిపిస్తుండొచ్చు. అలాంటి మనఃస్థితి ఏ దేశానికీ మంచిది కాదు. ఈ దేశ యువత కోసం కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించా. దీన్ని నేను రాజ్యాంగ, ప్రజాస్వామ్యపరమైన బాధ్యతగా భావిస్తున్నా. ఈ దేశం ముందు కోట్లకొద్దీ సవాళ్లు ఉంటే.. కోట్లకొద్దీ సమాధానాలు కూడా ఉన్నాయి. మనమంతా నిర్దిష్ట లక్ష్యంతో, సత్సంకల్పంతో ఒక్క అడుగు ముందుకేస్తే భారతదేశం 135 కోట్లకు పైగా అడుగులు ముందుకెళ్తుంది.

ప్రజలు సత్వర మార్పు కోరుకుంటున్నారు

పంక్తిలో కూర్చున్న చివరి మనిషి గురించి ఆలోచించాలన్న మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని సాకారం చేయడానికి నేను అంకితమయ్యాను. దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరిలో ఆకాంక్షలు పెల్లుబుకుతున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తమ కళ్ల ముందే.. వేగంగా ఆ మార్పు జరగాలని అనుకుంటున్నారు. తమ కలలను సాకారం చేసుకునేందుకు.. వచ్చే తరాల వరకు వేచి చూడాలనుకోవట్లేదు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి. అందుకు ఇదే సరైన తరుణం. ప్రపంచం ఇప్పుడు భారత్‌ వైపు గర్వంతో, ఆపేక్షతో, సమస్యకు పరిష్కారం కోసం చూస్తోంది.

ప్రతి కొలమానంలో భారత్‌ ముందుండాలి

కలలు, సంకల్పం భారీగా ఉన్నప్పుడు ప్రయత్నం పెద్దగా ఉండాలి. మనం ధారపోసే శక్తి కూడా ఎక్కువగా ఉండాలి. 1940వ దశకంలో స్వాతంత్య్ర సంకల్పంతో వీధుల్లోకి రావడం వల్లే ‘స్వాతంత్య్రం’ సిద్ధించింది. సంకల్పం చిన్నదై ఉంటే ఈరోజు కూడా మన స్వాతంత్య్ర పోరాటం కొనసాగుతూనే ఉండేది. రాబోయే 25 ఏళ్లలో భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తయారుచేయాలి. ఇప్పుడు 20-25 ఏళ్ల వయసున్న యువత స్వాతంత్య్ర శత వసంతోత్సవం జరుపుకొనేప్పటికి 45-50 ఏళ్లలో ఉంటారు. మీ జీవితంలో ఈ సువర్ణకాలం.. దేశ కలలను నెరవేర్చే కాలం. అందువల్ల ప్రతిఒక్కరూ భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న సంకల్పంతో ముందడుగు వేయాలి. ప్రతి కొలమానంలో దేశం ముందంజలో ఉండేలా చూడాలి.

వ్యాక్సినేషన్‌లో రికార్డుల్ని తుడిచిపెట్టేశాం

భారత్‌ ఎప్పుడు గొప్ప సంకల్పాన్ని తీసుకున్నా.. దాన్ని సాధించి తీరుతుంది. స్వచ్ఛభారతే అందుకు ఉదాహరణ. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విషయంలోనూ ప్రపంచమంతటా అనుమానాలు నెలకొనగా మన దేశం మాత్రం 200 కోట్ల డోసుల లక్ష్యాన్ని దాటేసింది. పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టింది. పెట్రోలులో 10% ఇథనాల్‌ను కలిపే లక్ష్యాన్ని గడువు కంటే ముందే అందుకుంది. కోట్లమందికి అతితక్కువ సమయంలో విద్యుత్తును అందించి.. శక్తిసామర్థ్యాలను చాటుకొంది. లక్షల కుటుంబాలకు కొళాయి నీరు అందించే పనిని దేశం వేగంగా పూర్తిచేస్తోంది. ఒకసారి మనం సంకల్పం తీసుకొని బయలుదేరితే దాన్ని చేరుకుంటామని అనుభవాలే చెబుతున్నాయి.

మనవి మనం తయారుచేసుకోలేమా?

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి, కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు.. ఇలా ప్రతి విషయంలో గతం కంటే వేగం పెరిగింది. వచ్చే పాతికేళ్లు ఇలాగే దూసుకెళ్లాలి. ప్రపంచమిచ్చే ధ్రువీకరణ పత్రం కోసం మనం ఇంకెంతకాలం ఎదురుచూస్తూ ఉందాం? మనకు కావాల్సింది మనం తయారుచేసుకోలేమా? అందుకు సిద్ధం కాలేమా? మనం ఇంకెవరిలాగో కనిపించడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. పూర్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తే మనం సాధించలేనిదంటూ ఏమీ ఉండదు. ఎంతో లోతుగా మథనం చేసి, ఎంతోమంది ఆలోచనలను తీసుకొని నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చాం. నైపుణ్యానికి అందులో ప్రాధాన్యమిచ్చాం. అది బానిసత్వం నుంచి విముక్తి కల్పిస్తుంది. ప్రస్తుతం డిజిటల్‌ ఇండియా, అంకుర పరిశ్రమలను చూస్తున్నాం. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఉంటున్నవారు ఎంతో ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. భారతీయ భాషలను, వారసత్వాన్ని చూసి మనం గర్వపడాలి. నేలపై నిలబడినప్పుడే మనం పైకి ఎగరగలుగుతాం. పైకి ఎగిరితే ప్రపంచానికీ సమాధానం చెప్పగలుగుతాం. ప్రపంచం ఇప్పుడు సమగ్ర ఆరోగ్య సేవల గురించి చర్చిస్తోంది. యోగా, ఆయుర్వేదంతోపాటు మన జీవనశైలిపై దృష్టిసారిస్తోంది. ప్రకృతితో మమేకమై జీవించేవాళ్లం మనం. ప్రపంచం ఎదుర్కొనే వాతావరణ సమస్యలకు పరిష్కారం చూపే సత్తా మనకుంది. అది మనకు పూర్వీకులే ఇచ్చారు. మన ధాన్యం, తృణధాన్యాలు.. మన వారసత్వ సంపద. ఇప్పుడు ప్రపంచం అంతర్జాతీయంగా తృణధాన్య సంవత్సరం జరుపుకొనేందుకు ప్రయత్నిస్తోంది. కానీ మనకు అవి వారసత్వంగా ఎప్పటినుంచో వచ్చాయి. వాటిని చూసి గర్వించాలి.

కంకరలో శంకరుణ్ని చూసేవాళ్లం మనం

ప్రపంచంలో సామాజిక, వ్యక్తిగత ద్వేషం గురించి చర్చ జరిగినప్పుడు భారత కుటుంబ వ్యవస్థ గుర్తుకొస్తుంది. మన పూర్వీకుల త్యాగాల ఫలితంగా మన వద్ద ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అభివృద్ధి చెందింది. అది మనకు గర్వకారణం. జీవిలో శివుణ్ని, నరుడిలో నారాయణుడిని, నారిలో నారాయణిని, గ్రహంలో పరమాత్మను, నదిలో అమ్మను, కంకరలో శంకరుణ్ని చూసేవాళ్లం మనం. ప్రపంచానికి వసుధైక కుటుంబ మంత్రాన్ని ఉపదేశించాం. ఇంత పెద్ద దేశంలో ఉన్న భిన్నత్వాన్ని మనం గౌరవించుకోవాలి.

మహిళలకు ఇచ్చే గౌరవమే మన పెట్టుబడి

మహిళలను అవమానించే కుసంస్కారం కొంతమందిని అప్పుడప్పుడు ఆవహిస్తోంది. ఇకపై దాన్ని పూర్తిగా వదిలేయాలి. స్త్రీలకు అవమానకరంగా ఉండే ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. వారికి ఇచ్చే గౌరవం జాతీయ కలలను సాకారం చేసేందుకు పెట్టే పెద్ద పెట్టుబడి అవుతుంది. కుమార్తె, కుమారుడు ఒక్కటేనని మనమంతా భావించాలి. లేదంటే సమానత్వానికి అర్థమే ఉండదు.

బాధ్యతలను విస్మరించొద్దు

అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే.. కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో మొదటిది క్రమశిక్షణతో కూడిన జీవనం. రెండోది కర్తవ్య పాలన. జీవితంలో విజయం సాధించడానికి ఇవి అత్యావశ్యకం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, పోలీసులు.. ఎవరైనా సరే తమ బాధ్యతలను విస్మరించకూడదు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కేవలం ప్రభుత్వ ఎజెండా కాదు. ప్రతిఒక్కరి బాధ్యత. ప్రస్తుతం మనం సైన్యానికి అవసరమైన 300 వస్తువులను దిగుమతి చేసుకోవడం మానేసి స్వదేశంలోనే తయారుచేసుకోవాలని సంకల్పించాం. స్వావలంబన భారత్‌ ఉజ్వల భవిష్యత్తుకు నాటిన విత్తనాన్ని అందులో నేను చూస్తున్నా. ఇది మన కలల వటవృక్షంగా మారుతుంది. సేంద్రియ వ్యవసాయం ఆత్మనిర్భరతకు ఒక మార్గం. ఎరువుల నుంచి మనం విముక్తి పొందాలి. ఆత్మనిర్భర్‌ భారత్‌ ద్వారా ప్రపంచ అవసరాలను తీర్చాలని ప్రైవేటు రంగానికి పిలుపునిస్తున్నా. లాల్‌బహదూర్‌ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్‌, జై కిసాన్‌’ నినాదం ఇప్పటికీ దేశానికి ప్రేరణనిస్తోంది. తర్వాత వాజ్‌పేయీ దానికి ‘జై విజ్ఞాన్‌’ను జోడించారు. దేశం దాన్నీ అందిపుచ్చుకుంది. అమృత కాలం కోసం ఇప్పుడు ‘జై జవాన్‌, జై కిసాన్‌, జై విజ్ఞాన్‌’తో పాటు ‘జై అనుసంధాన్‌’ అన్న నినాదాన్ని అందిపుచ్చుకోవాలి.

5జి వచ్చేస్తోంది

దేశంలో త్వరలో 5జి సేవలు ప్రారంభం కాబోతున్నాయ్‌. దానికోసం ఇంకా ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. మేం ఆప్టికల్‌ ఫైబర్‌ను ప్రతి గ్రామానికి విస్తరిస్తున్నాం. గ్రామాల్లోనూ ‘డిజిటల్‌ ఇండియా’ కాంతులీనబోతోంది.

విదేశీ బొమ్మలు వద్దన్న పిల్లలకు శాల్యూట్‌

తాము విదేశీ ఆటబొమ్మలతో ఆడుకోవాలనుకోవడం లేదని 5-7 ఏళ్ల వయసున్న పిల్లలు తమ తల్లిదండ్రులతో చెప్పిన అనేక ఉదంతాలు ఇటీవల నా దృష్టికి వచ్చాయి. అంత చిన్న పిల్లలు అలాంటి తీర్మానం చేసుకోవడం.. స్వావలంబన భారత్‌ స్ఫూర్తికి అద్దం పడుతోంది. వారి నరనరాల్లో ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ ఉందని స్పష్టమయ్యేలా చేస్తోంది. ఆ పిల్లలకు నేను శాల్యూట్‌ చేస్తున్నా.

రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉండాలి

దేశంలో సహకార సమాఖ్య స్ఫూర్తి పరిఢవిల్లడం తక్షణావసరం. ప్రగతి పథంలో దూసుకెళ్లే విషయంలో రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఉండాలి. పథకాలు వేరు కావచ్చు.. పనితీరు భిన్నంగా ఉండొచ్చు.. కానీ దేశం కోసం మనం కనే కలలు వేరుగా ఉండకూడదు. నేను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కానీ ‘దేశాభివృద్ధి కోసం గుజరాత్‌ అభివృద్ధి’ అనే మంత్రాన్ని పాటిస్తూనే నేను ముందుకెళ్లా.

ప్రధాని తన ప్రసంగ ప్రారంభంలో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, వీడీ సావర్కర్‌, రామ్‌మనోహర్‌ లోహియా, నేతాజా సుభాష్‌ చంద్రబోస్‌, అంబేడ్కర్‌, మంగళ్‌పాండే సహా పలువురు స్వాతంత్య్ర సమరయోధులు, నేతలకు నివాళులర్పించారు. బిర్సా ముండా, తిరోత్‌ సింగ్‌, అల్లూరి సీతారామరాజు వంటి గిరిజన వీరులు దేశం నలుమూలల్లో స్వాతంత్య్ర సమరం కొనసాగడంలో కీలక పాత్ర పోషించారంటూ కొనియాడారు.


పంచప్రాణ మంత్రమిదీ..

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2047 నాటికి వందేళ్లు పూర్తవుతాయి. సమరయోధుల కలలను అప్పటివరకైనా సాకారం చేయాలి. అందుకోసం- మనం ప్రధానంగా పంచ ప్రాణాలపై శక్తిని కేంద్రీకరించాలి. అవేంటంటే..

1. దేశాభివృద్ధి: అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను అవతరింపజేయాలి. ఇది చాలా పెద్ద సంకల్పం. దీని విషయంలో వీసమెత్తు కూడా తగ్గకూడదు.

2. బానిసత్వ మూలాలు వదిలించుకోవాలి: వందల ఏళ్ల నాటి బానిసత్వం మన ఆలోచనల్లో వికృతిని పెంచి పోషించింది. మన మనసులో, అలవాట్లలో ఏ మూలనైనా దాని ఆనవాళ్లు ఉంటే.. వెంటనే తుడిచిపెట్టేయాలి.

3. వారసత్వ వైభవం: వారసత్వమే దేశానికి సువర్ణకాలాన్నిచ్చింది. సమయానుకూలంగా మార్పు చెందే అలవాటునిచ్చింది. వారసత్వ వైభవాన్ని చూసి మనం గర్వపడాలి.

4. ఐక్యత: మనమంతా ఐకమత్యంతో ఉందాం. తరతమ భేదాలు వదిలేద్దాం. ‘ఏక్‌ భారత్‌ - శ్రేష్ఠ్‌ భారత్‌’గా అవతరించేందుకు ఐక్యత అత్యవసరం.

5. బాధ్యతలు: పౌరులు తమ బాధ్యతలను ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. ఇందుకు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అతీతం కాదు.


ఎర్రకోట ప్రాకారంపై.. త్రివర్ణ పతాకం నీడన.. రాజ్యాంగాన్ని గుర్తుచేసుకుంటూ దేశ ప్రజలకు ఒక్కటే పిలుపునిస్తున్నా. భారత రాజకీయ వ్యవస్థతో పాటు ఇతర వ్యవస్థల ప్రక్షాళన కోసం మనం దేశానికి వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి కల్పిద్దాం.


అవినీతి మన దేశాన్ని చెదపురుగులా గుల్లచేస్తోంది. దానికి వ్యతిరేకంగా పూర్తి శక్తిసామర్థ్యాలతో పోరాడాలి. ఇందుకోసం దేశ ప్రజలంతా నన్ను ఆశీర్వదించాలి. మీరు సహకరిస్తేనే నేను పోరాడగలను.


రోజులో 24 గంటలూ విద్యుత్తు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే.. వీలైనంత కరెంటును ఆదా చేయడం ప్రజల కర్తవ్యం. ప్రతి పొలానికీ నీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అయితే.. నీటిని బాగా ఆదా చేస్తూ ఎక్కువ దిగుబడి సాధించడం రైతుల బాధ్యత. ఎరువులు వాడకుండా సేంద్రియ వ్యవసాయం చేయడం అన్నదాతల కర్తవ్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని