బస్సులు వేసి.. స్థానికేతరులను పోగేసి

ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం రావడంతో వైకాపా శ్రేణులు తమ బలాన్ని చాటుకునేందుకు నాలుగు

Published : 24 Sep 2022 03:57 IST

చిత్తూరు జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు అనధికారిక సెలవులు

దుకాణాలు మూయించిన వాలంటీర్లు, సిబ్బంది

తిండి, నీరు లేక ఎండలో అల్లాడిన లబ్ధిదారులు

ప్రసంగం మధ్యలోనే వెనుదిరిగిన ప్రజలు

సీఎం పర్యటన సందర్భంగా కుప్పంలో ఇదీ పరిస్థితి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, కుప్పం గ్రామీణ, పట్టణం: ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ తొలిసారి చిత్తూరు జిల్లా కుప్పం రావడంతో వైకాపా శ్రేణులు తమ బలాన్ని చాటుకునేందుకు నాలుగు కిలోమీటర్ల మేర అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశాయి. కుప్పం కార్యక్రమాన్ని కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని ఆ పార్టీ నాయకులు ఘనంగా ప్రకటించారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది రంగప్రవేశం చేసి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ చేయూత అందుకునే మహిళలందరినీ కుప్పం పట్టణంలోని అనిమిగానిపల్లె వద్దకు రావాలని ఆదేశించారు. లేకుంటే సంక్షేమ పథకాలు రద్దవుతాయని హెచ్చరించారు. ఆర్టీసీ, పాఠశాల, కళాశాల, ప్రైవేటు బస్సులు భారీగా ఏర్పాటుచేశారు. తిరుపతి, మదనపల్లె, పీలేరు, పుత్తూరు, చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, కుప్పం డిపోల్లోని సుమారు 400 ఆర్టీసీ బస్సులు, పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన మరో 600 వరకు బస్సులు, వాహనాల్లో జనసమీకరణ చేశారు. ఆర్టీసీ బస్సులకూ వైకాపా జెండాలు కట్టి మరీ తరలించారు. బైరెడ్డిపల్లె మండలం కంభంపల్లి పంచాయతీ దాసార్లపల్లిలో జగన్‌ సభకు రాకుంటే రూ.500 జరిమానా విధిస్తామని గురువారం రాత్రి దండోరా వేయడంతో రెండు బస్సుల్లో లబ్ధిదారులు వచ్చారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సుల్లో జనాలను తరలించడంతో ఆయా జిల్లాల్లోని పలు విద్యాసంస్థలకు అనధికారికంగా సెలవు ప్రకటించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని బస్సులను జగన్‌ పర్యటనకు తీసుకోవడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రయాణికుల రాకపోకలు ఇబ్బందిపడ్డారు.

దుకాణాల వద్ద వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తిష్ఠ
సీఎం జగన్‌ కాన్వాయ్‌ కుప్పం చెరువు కట్ట మీదుగా అనిమిగానిపల్లెకు వస్తున్నందున శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ పట్టణంలోని చాలా దుకాణాలు మూసేశారు. అక్కడ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, మునిసిపల్‌, పంచాయతీరాజ్‌ సిబ్బంది మకాం వేశారు. బస్సుల్లో వచ్చిన మహిళలు, విద్యార్థులను రోడ్డు పొడవునా ఉంచారు. సీఎం వారికి అభివాదం చేసుకుంటూ ముందుకెళ్లారు. ముఖ్యమంత్రి రాకకు 3 గంటల ముందే హెలిప్యాడ్‌ నుంచి గంగమ్మ గుడి వరకూ ఉన్న మార్గంలో వాహనాలను అనుమతించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోనూ ఇదే తరహా ఆంక్షలు విధించారు. కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి వెళ్లిన తర్వాత పలమనేరు- కృష్ణగిరి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. మరోవైపు శుక్రవారం ఉదయం నుంచే తెదేపా కార్యాలయం దగ్గర పోలీసులు మోహరించారు. ముఖ్యమైన నాయకులను గృహనిర్బంధంలో ఉంచారు.

పొరుగు జిల్లాల నుంచి తీసుకొచ్చి...
కుప్పం నియోజకవర్గం నుంచి మహిళలు ఆశించినంత స్థాయిలో రాలేదు. దీన్ని ఊహించిన వైకాపా శ్రేణులు, అధికార యంత్రాంగం ముందుగానే చిత్తూరు జిల్లా పలమనేరు, పుంగనూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని మహిళలూ కార్యక్రమానికి రావాలని చెప్పారు. దీంతో సీఎం నిర్వహించిన కార్యక్రమంలో స్థానికేతరులే అధికంగా కనిపించారు. వచ్చినవారికి ఆహారం, నీళ్లు దొరక్క ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరు వెళ్లిపోవాలని భావించినా పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. జగన్‌ గంట ఆలస్యంగా రావడంతో పలువురు సభాస్థలికి రాకుండా సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాల ఆవరణలో, చెట్ల కింద, బస్సుల్లో సేదతీరారు.

ఆహారం లభించక ఇక్కట్లు
జగన్‌ సభకు తీసుకొచ్చిన ప్రజలకు భోజన ప్యాకెట్లు ఇచ్చేందుకు నియోజకవర్గాల వారీగా కౌంటర్లు ఏర్పాటుచేశారు. మొదట చిత్తూరు, పూతలపట్టు మినహా మిగిలిన కౌంటర్లలో భోజనాలు అయిపోవడంతో ఆగ్రహించిన జనం ఆ రెండుచోట్ల ఉన్న భోజనాలను ఆకలితో ఉన్నవారికి ఇవ్వాలని కోరారు. అక్కడున్న సిబ్బంది నిరాకరించడంతో వారిని పక్కకు తోసేసి ప్యాకెట్లు తీసుకెళ్లారు. జేసీ వెంకటేశ్వర్‌ అక్కడకు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఓ వాహనంలో భోజన ప్యాకెట్లు రాగా అక్కడున్నవారు ఒక్కసారిగా అటువైపు దూసుకెళ్లారు. ఎంత ప్రయత్నం చేసినా కొందరికి ఆహారం లభించకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. కొందరికి ఇచ్చిన ప్యాకెట్లలోని భోజనం పాడైపోవడంతో అక్కడే పారేశారు.


పొద్దున్నుంచీ తిండీ, నీళ్లు లేవు
పొద్దుటనుంచి భోజనాలు రాక ఎండకు ఎండుతున్నాం. 200 మంది నీళ్లు లేక అరుస్తా ఉన్నారు. రెండు మండలాలకు ఇదే పరిస్థితి అంటే ఎలా? రమ్మని జెండాలు మోయించి భోజనాలు పెట్టకపోవడమేంటి?

-రామచంద్ర, ఎంపీటీసీ సభ్యుడు, నూలుకుంట


దివ్యాంగురాలిని పట్టించుకోని వైనం

సీఎం సభ ముగించుకుని తిరిగి హెలిప్యాడ్‌ వద్దకు వెళ్తున్నప్పుడు సభావేదిక బయట భర్తతో కలిసి కుప్పం అర్బన్‌ కాలనీకి చెందిన ఓ దివ్యాంగురాలు చంటిబిడ్డను తీసుకొచ్చి తన సమస్యను ముఖ్యమంత్రికి చెప్పాలని ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు ఆమెను బారికేడ్ల బయటకు తోసేశారు. పోలీసులను ఎంత బతిమిలాడినా సీఎంను కలిసేందుకు అంగీకరించకపోవడంతో ఆమె అక్కడే బైఠాయించి కన్నీటి పర్యంతమయ్యారు.


బస్సులు రాక.. రోగి పడిగాపులు

సీఎం పర్యటన సందర్భంగా శుక్రవారం తిరుపతి ఆర్టీసీ బస్సులను కుప్పానికి తరలించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. తగనన్ని బస్సులు లేక వెళ్లిన బస్సే తిరిగి వచ్చేవరకూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. చిత్తూరు జిల్లా పళ్లిపట్టు అన్నూరుకు చెందిన యాకోబు శుక్రవారం పల్లెవెలుగు బస్సు కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. వేకువజామున 4 గంటలకు తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వెళ్లి, 11 గంటలకు డయాలసిస్‌ చేయించుకుని భార్యతో కలిసి ఆర్టీసీ బస్టాండుకు వచ్చారు. పళ్లిపట్టు వెళ్లే బస్సులు లేక మధ్యాహ్నం 2గంటల వరకూ బస్టాండులో వేచి ఉన్నారు.

- ఈనాడు, తిరుపతి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని