ఈఎస్‌ఐలో పోస్టింగ్‌కు రూ. 10లక్షల డిమాండ్‌!

కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాల్సిన ఈఎస్‌ఐలో అవినీతి రాజ్యమేలుతోంది. కీలక పదవిలో ఉన్న వ్యక్తి.. వైద్యుల పదోన్నతులు, పోస్టింగ్‌లలో

Updated : 28 Sep 2022 05:33 IST

ఈఎస్‌ఐలో వైద్యులకు పదోన్నతులు కల్పించినా ఓ అధికారి అక్రమాలు

ఈనాడు, అమరావతి: కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించాల్సిన ఈఎస్‌ఐలో అవినీతి రాజ్యమేలుతోంది. కీలక పదవిలో ఉన్న వ్యక్తి.. వైద్యుల పదోన్నతులు, పోస్టింగ్‌లలో మామూళ్లు డిమాండు చేయడం చర్చనీయాంశమవుతోంది. ఒక్కో పోస్టుకు ధర నిర్ణయించి తన అనుచరుడి ద్వారా సమాచారం పంపిస్తూ బేరసారాలు సాగిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆయన అడిగినంత ఇచ్చుకోలేక పదోన్నతులవైపే వైద్యులు దృష్టి సారించడం మానేశారు. దీంతో ఆయన తన మామూళ్ల డిమాండ్‌ను కొంతవరకు తగ్గించుకున్నారే తప్ప పదోన్నతులు కల్పించడం లేదు. ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌, డిప్యూటీ సివిల్‌ సర్జన్లుగా పని చేస్తున్న పీజీ అర్హత ఉన్నవారికి సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టు (సీఎస్‌ఎస్‌)గా పదోన్నతులు లభిస్తాయి. ఇందులో భాగంగా 30 ఖాళీలను భర్తీ చేసేందుకు ఇటీవల డీపీసీ నిర్వహించారు. ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున 90 మంది వైద్యుల జాబితాను పరిశీలించి 30 మందికి పదోన్నతులు కల్పించారు. ఈ ఉత్తర్వులు ఆగస్టులో విడుదలయ్యాయి. పదోన్నతులు పొందిన వారికి పోస్టింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే ఆ నాయకుడు చక్రం తిప్పారు. పోస్టింగ్‌ల కోసం ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలివ్వాలని డిమాండ్‌ చేశారు. పదోన్నతులు పొందిన కొందరు వైద్యులు ఇటీవల ఆయనను కలవటంతో బహిరంగంగానే ఈ విషయం వెల్లడైనట్లు ఆరోపణలున్నాయి. వైద్యులకు సీఎస్‌ఎస్‌గా పదోన్నతి లభిస్తే రెండు ఇంక్రిమెంట్లు వస్తాయి. ఒక్కొక్కరికి రూ.ఐదారు వేల వేతనం పెరుగుతుంది. సదరు నాయకుడు డిమాండ్‌ చేస్తున్నట్లు రూ.10లక్షలు ఇచ్చుకోలేక వైద్యులు పదోన్నతి పోస్టింగ్‌లను అడగడమే మానేశారు. దీంతో ఇటీవల తన అనుచరుడి ద్వారా సదరు నాయకుడు మరో సందేశం పంపారు. పోస్టుకు రూ.7లక్షలు ఇచ్చినా ఫర్వాలేదంటూ సమాచారమిచ్చారు. పదోన్నతితో వచ్చే రూ.ఐదారు వేల కోసం రూ.లక్షల్లో లంచాలు ఎలా ఇవ్వగలమని వైద్యులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని