ఉచిత విద్యుత్తు ‘ఉఫ్’
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అమలుచేస్తున్న ఉచిత విద్యుత్తు భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు చూస్తోంది.
ఆరు దశల పరిశీలన పేరుతో లబ్ధిదారుల ఏరివేత
అల్లూరి జిల్లాలో 20 వేల మందికి పైగా అనర్హులుగా గుర్తింపు
ఈనాడు డిజిటల్, పాడేరు, న్యూస్‌టుడే పాడేరు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అమలుచేస్తున్న ఉచిత విద్యుత్తు భారాన్ని తగ్గించుకోవాలని సర్కారు చూస్తోంది. సంక్షేమ పథకాలకు కొలమానంగా తీసుకుంటున్న ఆరుదశల (సిక్స్ స్టెప్) పరిశీలనను 200 యూనిట్లలోపు వినియోగించే ఉచిత విద్యుత్తు లబ్ధిదారులపైనా ప్రయోగిస్తోంది. ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వాలంటీర్లతో ప్రత్యేకంగా సర్వేచేయించి పరిమితికి మించి భూములున్నాయని, నాలుగు చక్రాల వాహనాలున్నాయని, కుటుంబంలో ఉద్యోగస్థులున్నారని వేల మందిని అనర్హులుగా గుర్తించింది. వారంతా తక్షణం విద్యుత్తు బిల్లులతో పాటు పాత బకాయిలు కూడా చెల్లించాలంటూ నోటీసులు జారీచేస్తోంది. అల్లూరి జిల్లాలో సుమారు 20 వేలకు పైగా ఎస్టీ కుటుంబాలను ఉచిత విద్యుత్తు పథకం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. వీరంతా అర్హులని నిరూపించుకోవాలని, లేకుంటే బిల్లులైనా చెల్లించాలని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
అల్లివరంలో సరఫరా నిలిపివేత
పాడేరు మండలం అల్లివరం గ్రామానికి చెందిన వారంతా ఆదివాసీయులు. రోజు వారీ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంటారు. ప్రభుత్వం తాజాగా చేపట్టిన సర్వేలో వీరంతా దారిద్య్రరేఖకు ఎగువన ఉన్నారని తేలిందట. దీంతో వారంతా ఉచిత విద్యుత్తుకు అనర్హులుగా పేర్కొంటూ అధికారులు బిల్లులు జారీచేశారు. పాత బకాయిలు కూడా ఉన్నాయంటూ రూ.వేలల్లో బిల్లులు చేతిలో పెట్టారు. ఇప్పటి వరకు కరెంటు బిల్లు ఎరగని వారంతా ఒకేసారి రూ.వేలల్లో చెల్లించాల్సి రావడంతో ఆందోళనకు గురయ్యారు. ఈలోగా ఆకస్మిక తనిఖీల పేరుతో వెళ్లిన విద్యుత్తు సిబ్బంది..గ్రామంలోని 63 కుటుంబాలకుగాను బిల్లులు చెల్లించని 30 ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపేశారు. మూడు రోజుల పాటు వారంతా అంధకారంలో మగ్గారు. దీనిపై ‘ఈటీవీ’లో వార్త ప్రసారం కావడంతో ఆ ఇళ్లకు శుక్రవారం విద్యుత్తు సరఫరాను పునురుద్ధరించారు. తామంతా నిరుపేదలమని, బకాయిలను తాము చెల్లించలేమని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి రూ.11 వేలు బిల్లు రావడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు.
నోటీసు లేకుండా తొలగించారు
మాది నిరుపేద కుటుంబం. చాలా ఏళ్లుగా రాయితీ విద్యుత్తు పొందుతున్నాం. ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా, నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి మా ఇళ్లకు వచ్చి కరెంటు నిలిపేశారు.
పాంగి సూరిబాబు, అల్లివరం
రాయితీ ఎత్తేశామని చెబుతున్నారు..
గత ఐదేళ్ల నుంచి రాయితీ విద్యుత్తును ఇచ్చేవారు. ఇప్పుడు ఉన్నట్టుండి పాత బకాయిలన్నీ కలిపి ఒకేసారి పెద్ద మొత్తంలో బిల్లులు ఇచ్చి కట్టమంటున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు బిల్లు వచ్చింది. రాయితీ మీకు ఎత్తేశారని, ఈ డబ్బులు చెల్లించడం లేదు కనుక, విద్యుత్తు సరఫరాను ఆపేస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.
సోమేష్, అల్లివరం గ్రామం
కరెంటు సరఫరా పునరుద్ధరించాం..
సచివాలయ సర్వే ప్రకారం అర్హులకు మాత్రమే రాయితీ విద్యుత్తు అందుతుంది. ఒకవేళ అర్హులను అనర్హులుగా గుర్తిస్తే వారు ఆధార్, కులధ్రువీకరణ పత్రం సచివాలయంలో ఇస్తే వారికి రాయితీ పునరుద్ధరిస్తారు. అల్లివరంలో కొన్ని ఇళ్లకు విద్యుత్తు నిలిపివేసినట్లు తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో మాట్లాడి సరఫరా పునరుద్ధరించాం. రాయితీ విద్యుత్తు వినియోగదారుల్లో అనర్హులను మాత్రమే తొలగిస్తాం.
మహేంద్రనాథ్, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!
-
Sports News
Rishabh Pant: వేగంగా కోలుకుంటున్న రిషభ్ పంత్.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి ఎప్పుడంటే?
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Shanthi Bhushan: కేంద్ర మాజీ మంత్రి, లెజెండరీ న్యాయవాది శాంతి భూషణ్ కన్నుమూత
-
World News
Flight: 13 గంటలు ప్రయాణించి.. టేకాఫ్ అయిన చోటే దిగిన విమానం..!