Nidadavole: వారణాసిలో నిడదవోలువాసులకు తప్పిన పెను ప్రమాదం

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. వీరిలో 40 మంది కాశీలోని గంగానదిలో పడవలో వెళ్తుండగా అది మునిగిపోయింది.

Updated : 27 Nov 2022 08:51 IST

బోటు మునక.. సురక్షితంగా బయటపడ్డ యాత్రికులు

నిడదవోలు, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 120 మంది తీర్థయాత్రలకు వెళ్లారు. వీరిలో 40 మంది కాశీలోని గంగానదిలో పడవలో వెళ్తుండగా అది మునిగిపోయింది. అందరూ ప్రాణాలతో బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడదవోలు, పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 120 మంది ఈనెల 20న బయల్దేరి అలహాబాద్‌, గయ, అయోధ్య మీదుగా శుక్రవారం వారణాసి చేరుకున్నారు. శనివారం ఉదయం పిండప్రదానాలు చేసేందుకు వీరిలో 40 మంది బోటు మాట్లాడుకుని గంగానది దాటుతున్నారు. కొంచెం దూరం వెళ్లేసరికి బోటుకు చిల్లు పడి నీరు రావడంతో కేకలు వేశారు. బోటు డ్రైవర్‌ వెనక్కి తిప్పబోతుండగా అందరూ కంగారుపడి అటూ, ఇటూ కదలడంతో బోటు మునిగిపోయింది. వారంతా ఆర్తనాదాలు చేయడంతో చుట్టుపక్కల బోట్లవారు వెంటనే చేరుకుని, మునిగిపోతున్న 38 మందిని బయటకు లాగారు. మరో ఇద్దరినీ కష్టమ్మీద బయటకు తీయడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలియగానే వారణాసి కలెక్టర్‌, పోలీసులు స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరాతీశారు. సాయంత్రం వీరంతా తిరుగు ప్రయాణమయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని