ఆ డిమాండు సరికాదు

రాజధానికి భూములిచ్చిన రైతులకు మొదట అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన తరవాతే ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పిటిషనర్ల వాదన సరికాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు.

Published : 01 Dec 2022 04:29 IST

రాజధాని భూములపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్‌డీఏ వాదనలు

ఈనాడు, అమరావతి: రాజధానికి భూములిచ్చిన రైతులకు మొదట అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇచ్చిన తరవాతే ఇతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే పిటిషనర్ల వాదన సరికాదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. అలాంటి నిబంధన సీఆర్‌డీఏ చట్టంలో లేదన్నారు. రాజధాని కోసం సమీకరించిన భూమిలో 5 శాతం ఇళ్ల నిర్మాణం, ఇళ్ల స్థలాల కేటాయింపునకు వినియోగించుకోవచ్చని తెలిపారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. రాజధాని ప్రాంతంలో పలు గ్రామాలు పీఎంఏవై పథకం కిందకు వస్తాయని, ఆ పథకం కింద వచ్చే నిధులను గరిష్ఠంగా పొందేందుకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించామని వివరించారు. ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారంపై సీజే నేతృత్వంలోని బెంచ్‌ ముందు అనుబంధ పిటిషన్‌ దాఖలైందని, ప్రస్తుత వ్యాజ్యాలను అక్కడికే పంపడం ఉత్తమమని వాదనల ప్రారంభానికి ముందు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రైతుల తరఫున సీనియరు న్యాయవాది బి.ఆదినారాయణరావు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుత వ్యాజ్యాలకు సీజే బెంచ్‌ ముందున్న వ్యాజ్యాలకు సంబంధం లేదని తెలిపారు. మరోవైపు సీఆర్‌డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూములు కేటాయించారని.. అప్పుడు పిటిషనర్లు అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలిస్తుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. రాజధాని బృహత్తర ప్రణాళికను ఏ దశలోనైనా సవరించుకోవచ్చని చెప్పారు. తదుపరి విచారణ డిసెంబరు 5కు వాయిదా పడింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యూ.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ టి.మల్లికార్జునరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. రాజధానికి రైతులిచ్చిన భూముల్లో.. రాజధానేతర ప్రాంత వాసులకు ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు వీలుగా సీఆర్‌డీఏ చట్టానికి సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు, అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం పానకాల రెడ్డి, రైతు ఎ.నందకిశోర్‌ వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని