‘పెద్దాయన’ ఇలాకాలో అరాచక స్వామ్యం

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ను అంతా ‘పెద్దాయన’గా పిలుస్తారు. వైకాపా ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా, పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆయన మౌనంగా, శాంత స్వభావిగా ఉన్నట్లు కనిపిస్తారు.

Updated : 06 Dec 2022 07:22 IST

ప్రశ్నించే వారిపై వేధింపులు, దాడులు  

ఇప్పటికే 300 మంది తెదేపా కార్యకర్తలపై కేసులు

ఆయన కుటుంబీకుల డెయిరీకే పాలు పోయాలి

ప్రతిపక్ష నాయకుల ఆర్థిక మూలాలపై దెబ్బ

పనేదైనా ఆయన సంస్థే చేయాలి

ఈనాడు-అమరావతి, ఈనాడు డిజిటల్‌- చిత్తూరు, కడప: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయన్ను అంతా ‘పెద్దాయన’గా పిలుస్తారు. వైకాపా ప్రభుత్వంలో సీనియర్‌ మంత్రిగా, పార్టీలో అత్యంత కీలక నేతగా వ్యవహరిస్తున్న ఆయన మౌనంగా, శాంత స్వభావిగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ... కాగల కార్యం మాత్రం ఆయన అనుచరులు, సంబంధీకులు నెరవేరుస్తుంటారు. ఫలితంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో అడుగడుగునా అరాచకస్వామ్యం వర్ధిల్లుతోంది. వారికి అణిగిమణిగి ఉండకపోతే దాడులు, అక్రమాల్ని ప్రశ్నిస్తే దౌర్జన్యాలు, తప్పుల్ని నిలదీస్తే హత్యాయత్నాలు, ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా నిలిస్తే అక్రమ కేసులు, ఆర్థికమూలాలను దెబ్బతీయడాలు, ఆస్తులను ధ్వంసం చేయడాలు నిత్యకృత్యంగా మారాయి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించుకోకూడదు. పార్టీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకోకూడదు. కాదు కూడదంటే పోలీసు, రెవెన్యూ, మున్సిపల్‌ సహా సకల ప్రభుత్వ శాఖల అధికార యంత్రాంగాన్ని ప్రయోగిస్తారు. పుంగనూరులో ఎవర్ని కదిపినా... పెద్దాయన సంబంధీకుల దారుణాలను కథలు కథలుగా చెబుతారు. కానీ... వారెవ్వరూ బహిరంగంగా నోరు విప్పే సాహసం చేయరు. ప్రజల్ని ఇంతలా భయం గుప్పిట్లో పెట్టి మరీ ఏలుతున్నారు. తమ మాటే చట్టం... తమకు నచ్చినదే రాజ్యాంగం.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ ఇంటిపై దాడి నేపథ్యంలో అరాచకాలు చర్చనీయాంశమయ్యాయి.

60 మంది తెదేపా కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు

పుంగనూరులో పెద్దిరెడ్డి సంబంధీకులు... మూడున్నరేళ్లలో 300 మందికి పైగా తెదేపా నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టించారు. వారిలో 60 మందిపై హత్యాయత్నం, 40 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదయ్యాయి. ఇవన్నీ అక్రమ కేసులేనని, తమ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకే ఇలా ఇరికించారని పుంగనూరు తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి (చల్లా బాబు) ఆరోపించారు. పోలీసులూ వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారని విమర్శించారు.

ప్రశ్నించినందుకు రెండు కాళ్లు విరిచేసి..

పెద్దిరెడ్డి సంబంధీకుల అరాచకాలను ప్రశ్నిస్తే చాలు... వారిపై ప్రైవేటు సైన్యం దాడులకు తెగబడుతోంది. సదుం మండలం బూరగమంద పంచాయతీ పచ్చార్లమాకులపల్లెకు చెందిన తెదేపా నాయకుడు రాజారెడ్డిని ఏప్రిల్‌లో కల్లూరులోని పెట్రోల్‌ బంకు సమీపంలో కిడ్నాప్‌ చేశారు. ఓ తోటలో బంధించి రెండు కాళ్లు విరిచేశారు. వేలూరు ఆసుపత్రిలో ఆరు నెలలపాటు చికిత్స తీసుకున్న ఆయన ఇప్పటికీ నడవలేకపోతున్నారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు ఇద్దరు అనామకులను అరెస్టు చేశారు. దీనికి నిరసనగా తెదేపా నాయకులు చేపట్టిన ర్యాలీనీ అడ్డుకున్నారు. పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త శివకుమార్‌పై జులైలో వైకాపా నాయకులు దాడికి దిగారు. పెద్దిరెడ్డి కుటుంబీకులకు చెందిన శివశక్తి డెయిరీలోకి తీసుకెళ్లి మరీ ఆయన చేతులు విరగ్గొట్టారు.

తెదేపా కార్యాలయానికి అద్దెకు  ఇచ్చినందుకు కూల్చివేత నోటీసులు

తెదేపా నియోజకవర్గ కార్యాలయం కోసం ఇంటిని అద్దెకు ఇచ్చినందుకు దాని యజమానికి మున్సిపల్‌ అధికారులతో నోటీసులిప్పించారు. ఆయన వెనక్కి తగ్గలేదు. కార్యాలయంలో నిర్వహించిన తెదేపా గ్రామ, బూత్‌ కమిటీల ఎంపిక సమావేశానికి తెదేపా కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావడంతో... అప్పటికప్పుడు మరోసారి నోటీసులిచ్చి భవనాన్ని కూల్చేందుకు సిద్ధయ్యారు. యంత్రాలను రప్పించి, పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. భవన యజమానికి బైపాస్‌ రోడ్డులో ఉన్న ఒక స్థలం విషయమై బెదిరింపులకు తెగబడ్డారు. దీంతో భయపడిన బాధితుడు తెదేపా కార్యాలయంలోని సామగ్రిని బయట పడేశారు. తర్వాత మున్సిపల్‌ అధికారులు ఆ భవనం జోలికే వెళ్లలేదు.

చీరల పంపిణీ తలపెడితే అక్రమ మద్యం కేసు

పుంగనూరుకు చెందిన పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి ఏ పార్టీతో సంబంధం లేకుండా స్వతంత్రంగానే కార్యకలాపాలు నిర్వహిస్తూ... పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. ఎన్నికలు లేని సమయంలో 2020లో కొత్త సంవత్సరం సందర్భంగా మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు కర్ణాటక నుంచి చీరలను తీసుకొస్తుండగా వాహనాలను సీజ్‌ చేశారు. మద్యం అక్రమ రవాణా, పంపిణీ ఆరోపణలతో కేసు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేయగా అనుమతులు లేవంటూ రాత్రికిరాత్రే వేదిక తొలగించారు. ఆ స్థలం వివాదంలో ఉందని, పోలీసు చట్టం సెక్షన్‌ 30, సీఆర్‌పీసీ 144 సెక్షన్‌ అమలులో ఉన్నాయన్నారు. మూడున్నరేళ్లలో రామచంద్రయాదవ్‌పై 12కు పైగా కేసులు పెట్టారు.

పెద్దిరెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నందుకు బీభత్సం

పెద్దిరెడ్డి కుటుంబీకుల యాజమాన్యంలోని శివశక్తి డెయిరీ... పాడి రైతులను దోచుకుంటోందని ఆరోపిస్తూ రామచంద్రయాదవ్‌ ఈ నెల 4న రైతుభేరి సభ తలపెట్టగా... ముందు రోజు రాత్రి నుంచే గృహనిర్బంధం చేశారు. ‘పుంగనూరులో అంబేద్కర్‌ రాజ్యాంగం కాకుండా.. పెద్దిరెడ్డి రాజ్యాంగం అమలవుతోంది’ అంటూ రామచంద్రయాదవ్‌ వ్యాఖ్యానించటంతో దాదాపు 300 మంది వైకాపా కార్యకర్తలు రామచంద్రయాదవ్‌ ఇంటిపై కర్రలు, రాళ్లు, ఇనపరాడ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. అంతకుముందు ఇదే సభను నవంబరు 28న నిర్వహించుకుంటానంటూ నవంబరు 17న అనుమతి కోరగా పోలీసులు నిరాకరించారు.

శివశక్తి డెయిరీకి మాత్రమే పాలుపోయాలి

పుంగనూరు నియోజకవర్గంలో పాడిరైతులు ఎవరైనా సరే పెద్దిరెడ్డి కుటుంబీకుల యాజమాన్యంలోని శివశక్తి డెయిరీకి, వారు ఖరారు చేసిన ధరకు మాత్రమే పాలుపోయాలన్న అలిఖిత శాసనం అమలవుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అంతకంటే ఎక్కువ ధర చెల్లించేందుకు ఇతర డెయిరీలు ముందుకొచ్చినా సరే వాటి వాహనాలను పుంగనూరు నియోజకవర్గంలోకి అడుగే పెట్టనివ్వరని విమర్శిస్తున్నారు. ‘కొన్ని నెలల కిందటి వరకు శివశక్తి డెయిరీ లీటరు పాలకు రూ.18 మాత్రమే రైతులకు చెల్లించేది. ఇటీవలి నుంచి మాత్రమే లీటరుకు రూ.30 చొప్పున ఇస్తోంది. అయినా ఇతర డెయిరీ చెల్లిస్తున్న దాంతో పోలిస్తే ఇది తక్కువే’ అని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా బాబు ఆరోపించారు. సుదుం మండలంలో పెద్దిరెడ్డి కుటుంబీకులకు పల్ప్‌ పరిశ్రమ ఉంది. మామిడి రైతులు వారికి నచ్చినా, నచ్చకపోయినా తమ పంటనంతా ఈ పరిశ్రమకు వారు చెప్పిన ధరకు అమ్మాల్సిందేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

గుంత పూడ్చాలన్న.. రోడ్డు వేయాలన్నా..

పుంగనూరులో రోడ్డు వేయాలన్నా, రహదారిని విస్తరించాలన్నా, గుంతలు పూడ్చాలన్నా, కొత్తగా సాగునీటి ప్రాజెక్టు కట్టాలన్నా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్‌ సంస్థ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భాగస్వామ్యం వహించాల్సిందే. వారిని కాదని అక్కడెవరూ పనులు చేపట్టలేదు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో బెదిరింపులు

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపాల తరఫున నామినేషన్లు వేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేశారు. కార్యాలయాల లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను లాక్కున్నారు. పోటీదారులకు అవసరమైన ధ్రువపత్రాలను జారీ చేయకుండా ఆటంకాలు సృష్టించారు. నియోజకవర్గం మొత్తంలో ఒకట్రెండు స్థానాలు మినహా అన్నింటినీ బలవంతంగా, భయపెట్టి మరీ ఏకగ్రీవం చేయించుకున్నారు. పుంగనూరు 16వ వార్డులో తెదేపా అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకొచ్చిన శ్రీకాంత్‌ను ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి దౌర్జన్యంగా బయటకు తీసుకొచ్చి, పోలీసుల సమక్షంలోనే నామినేషన్‌ పత్రాలను లాగేశారు. సదుం ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్‌ వేయటానికి వచ్చిన భాజపా నాయకులను రాళ్లతో కొట్టి తరిమేశారు. పుంగనూరు మండలం మార్లపల్లెకు చెందిన 80 ఏళ్ల వృద్ధుడు అంజిరెడ్డి తెదేపా తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు వెళ్లగా దాడికి ప్రయత్నించారు.


నా కుమారుడిని ఇరికించాలని చూశారు

నివాసులు నాయుడు, ఇరికిపెంట, సోమల మండలం

మా పంచాయతీలో ఎన్నికలు ఏవైనా తెదేపాకే మెజార్టీ వస్తుంది. అది తట్టుకోలేక నాపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంలోని సెక్షన్ల కింద మూడు కేసులు పెట్టారు. వీటిలో రెండింటిని కోర్టులు కొట్టేశాయి. సివిల్‌ వివాదాలకు సంబంధించి నాపై మరో మూడు కేసులు బనాయించారు. నా కుమారుడు, నేను కారులో ప్రయాణిస్తుండగా ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో కారు నేనే నడుపుతున్నా. కానీ... నా కుమారుడు నడుపుతున్నట్లు ఫిర్యాదు చేయించి, అతను కెనడాలో చదువుకోవడానికి వెళ్లనివ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నించారు. మా భూముల వివరాలు ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేశారు. ఇప్పుడు వన్‌బీ కూడా కనిపించట్లేదు.


 

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని