ఎమ్మెల్సీ అనంతబాబుపై వేసిన అభియోగపత్రాన్ని మా ముందు ఉంచండి

దళిత యువకుడు సబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై దిగువ కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాన్ని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది.

Updated : 06 Dec 2022 06:32 IST

పోలీసులకు హైకోర్టు ఆదేశం

ళిత యువకుడు సబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై దిగువ కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రాన్ని తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయంలో నిందితుల వాదనలను వినాల్సిన అవసరం లేదనేందుకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని సమర్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌కు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు సోమవారం ఈమేరకు ఆదేశాలిచ్చారు. తన కుమారుడి హత్య వ్యవహారంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మృతుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వీధి నూకరత్నం, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

పోలీసులు దర్యాప్తు సక్రమంగా చేయడం లేదు

సోమవారం జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది శ్రావణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ‘అధికారపార్టీ ఎమ్మెల్సీ నిందితుడుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తును రాష్ట్ర పోలీసులు సక్రమంగా నిర్వహించడం లేదు. దర్యాప్తు పూర్తి చేయకుండానే హడావుడిగా దిగువ కోర్టులో అభియోగపత్రం వేశారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక, సీసీటీవీ ఫుటేజ్‌లు అభియోగపత్రంతో జతచేయలేదు. నిందితుడికి సహకరించాలన్న ఉద్దేశంతో రిమాండ్‌ విధించిన 14 రోజుల్లో కస్టడీ కోసం పోలీసులు పిటిషన్‌ వేయకుండా ఆ గడువు దాటాక దాఖలు చేశారు. దీంతో మెజిస్ట్రేట్‌ కోర్టు.. కస్టడీ పిటిషన్ను తిరస్కరించింది. రాష్ట్రప్రభుత్వం, పోలీసులు దర్యాప్తును ఉద్దేశపూర్వకండా తప్పుదోవపట్టిస్తున్నారు’ అని తెలిపారు. నిందితుడిని వ్యాజ్యంలో ప్రతివాదిగా ఎందుకు చేర్చలేదని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. సీఐడీ, సీబీఐ లేదా ఏదైనా సంస్థ దర్యాప్తు చేసినా చట్ట ప్రకారమే చేస్తాయికాబటి.. ఈ విషయంలో నిందితుడి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు. పోలీసుల తరఫున హోంశాఖ జీపీ మహేశ్వరెడ్డి వాదనలు వినిపిస్తూ.. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రాథమిక అభియోగపత్రం వేశామన్నారు.

Read latest Ap top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని