పునర్విభజన చట్టాన్ని సవరించి ప్రత్యేక హోదాను చేర్చాలి

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని సవరించి అందులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని వైకాపా లోక్‌సభ పక్ష చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ కోరారు.

Published : 07 Dec 2022 05:15 IST

వైకాపా లోక్‌సభ పక్ష చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని సవరించి అందులో ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చాలని వైకాపా లోక్‌సభ పక్ష చీఫ్‌ విప్‌ మార్గాని భరత్‌ కోరారు. పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పోలవరం సవరించిన అంచనాల మొత్తాన్ని పునర్విభజన సవరణ బిల్లులో పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ధరల పెరుగుదల, పంటలకు మద్దతు ధర తదితర అంశాలను ప్రస్తావించారు. అనంతరం ఏపీ భవన్‌లో భరత్‌ విలేకరులతో మాట్లాడుతూ ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై బిల్లు తీసుకురావాలని వైకాపా ఇప్పటికే ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ‘రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్ల ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలి.  తెలంగాణ నుంచి రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్తు బకాయిలు వచ్చేలా కేంద్రం చూడాలి...’ అని కోరారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు నాయుడు రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడంతో రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని ఆరోపించారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్‌ కావాలని కోరుతున్నందుకే ఆలస్యం అవుతోందని చెప్పారు. రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత అవసరమన్నారు. చంద్రబాబు నాయుడు ఆఖరి అవకాశం అంటుంటే... ఆయన దత్తపుత్రుడు ఒక్క అవకాశం అంటున్నారని భరత్‌ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఆఖరి అవకాశం ఇస్తే తదుపరి మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేశ్‌ చేతిలో అధికారం పెడతానంటే ప్రజలు అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. స్థిరత్వం లేని దత్తపుత్రుడు చేతిలో రాష్ట్రాన్ని ఉంచగలమా అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని