‘నగరవనం..’ నిర్వహణ అధ్వానం

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నగరవనాలు.. ఇప్పుడు సరైన నిర్వహణ లేక అధ్వానంగా కనిపిస్తున్నాయి.

Updated : 27 Jan 2023 04:56 IST

రూపుకోల్పోయి కళావిహీనం
అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన వైనం
‘ఈనాడు’ ప్రతినిధుల పరిశీలన

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన నగరవనాలు.. ఇప్పుడు సరైన నిర్వహణ లేక అధ్వానంగా కనిపిస్తున్నాయి. నగరవాసులు సేదతీరేందుకు వీలుగా రూపొందించిన ఈ వనాలు చాలా చోట్ల రూపుకోల్పోయాయి. కుటీరాలు, చిన్న పిల్లల పార్కులు, బోటు విహారాలు వంటివన్నీ ధ్వంసమయ్యాయి. కొన్ని నగరవనాలైతే మందుబాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నగరవనాల్ని ‘‘ఈనాడు’’ ప్రతినిధులు పరిశీలించారు. వాటి దుస్థితికి నిదర్శనమే ఈ చిత్రాలు.


నాడు ఆహ్లాదంగా...

పచ్చని కొండల నడుమ పేరేచెర్ల నగరవనంలో ఏర్పాటు చేసిన ఈ కుటీరం గుంటూరు నగర వాసులు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఒకప్పుడు ఆహ్లాదం పంచేది. సందర్శకులు భారీగా తరలివచ్చి స్వచ్ఛమైన గాలి పీల్చుకుని సేదతీరేవారు. ఇదంతా ఒకప్పటి సంగతి.


నేడు శిథిలమై ఇలా..

మూడున్నరేళ్లుగా ఈ నగరవనం నిర్వహణను సరిగ్గా పట్టించుకోకపోవటంతో అక్కడంతా అస్తవ్యస్తంగా మారింది. ఆ కుటీరం చుట్టూ పిచ్చిమొక్కలు అంత ఎత్తున పెరిగిపోయాయి. ఆ కుటీరం కూడా బల్లలు పాడైపోయి.. పైకప్పు  విరిగిపోయి శిథిలావస్థకు చేరింది.


బార్‌లో సిట్టింగ్‌ ఏర్పాటు కాదు... నగరవనంలో వీక్షణ ప్రదేశం

ఈ చిత్రం చూసి ఇదేదో బార్‌లో మందుబాబుల సిట్టింగ్‌ కోసం చేసిన ఏర్పాటు అనుకుంటున్నారా? కానే కాదు.. విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి అటవీ ప్రాంతంలోని నగరవనంలో ఓ భాగమిది. ఇక్కడ కూర్చొని ప్రకృతిని ఆస్వాదించేందుకు, సేదతీరేందుకు వీలుగా పడవ ఆకారంలో ఈ వీక్షణ ప్రదేశాన్ని గతంలో ఏర్పాటు చేశారు. నిర్వహణను గాలికొదిలేయటంతో ఇప్పుడిది మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయింది. అటువైపు అడుగుపెట్టాలంటేనే సందర్శకులు ఆందోళన చెందుతున్న పరిస్థితి.


నమ్మండి.. ఇది పిల్లల పార్క్‌ అండి

కర్నూలు సమీపంలోని గార్గేయపురం నగరవనం  పిచ్చిమొక్కలు, ముల్లచెట్లు పెరిగి.. అటవీ శాఖ నిర్లక్ష్యానికి నిలువటద్దంగా నిలుస్తుంది. పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ పార్కు పొదలతో నిండిపోయింది. క్రీడా పరికరాలు విరిగిపోయాయి. 


పుష్కరవనం...ఆ ఘనత కనం

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్‌చెరువు అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నగరవనం ఇది. ఈ నగరవనంలో భాగంగా ఏర్పాటు చేసిన అడ్వెంచర్‌ జోన్‌ సందర్శకులను విపరీతంగా ఆకర్షించేది. ఆ పరికరాలన్నీ ఇప్పుడు పాడైపోయి ఇలా కనిపిస్తున్నాయి.


చుట్టూ ఎండిన మోడులే

నగరవనం అంటే ఆహ్లాదపరిచేలా.. సేదతీర్చేలా ఉండాలి. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద ఏర్పాటు చేసిన నగరవనం గతంలో ఇలాగే ఉండేది. నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో ఈ వనంలో కొంత భాగం ఇలా ఎండిపోయిన చెట్లతో కళావిహీనంగా కనిపిస్తోంది. పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాటు చేసిన పరికరాలు కూడా విరిగిపోయాయి. కనీసం వాటి మరమ్మతులపైనైనా అధికారులు దృష్టిసారించట్లేదు.


‘‘బోటు’’ విహారం దూరం..దూరం

తిరుపతి దివ్యారామంలో ఏర్పాటు చేసిన నగరవనంలో బోట్ల దుస్థితి ఇది. ఈ నగరవనంలోని కొలనులో విహారం కోసం గతంలో బోట్లు అందుబాటులో ఉంచారు. వాటి నిర్వహణ పట్టించుకోకపోవటంతో అవి ఇలా మూలకు చేరాయి. ఫలితంగా సందర్శకులకు బోటు విహారం దూరమైంది.

 ఈనాడు యంత్రాంగం, అమరావతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని