ఆంగ్లంరాని గురువులు బోధిస్తే ఉపయోగమేంటి?

ప్రభుత్వాల మూర్ఖపు చర్యలతోనే విద్యా రంగం దెబ్బతింటోందని, ఆంగ్లం తెలియని పిల్లలకు ఆంగ్లం రాని ఉపాధ్యాయులతో బోధిస్తే ప్రయోజనం ఉండదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ స్పష్టం చేశారు.

Published : 29 Jan 2023 03:21 IST

లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జేపీ

విజయవాడ సిటీ, న్యూస్‌టుడే: ప్రభుత్వాల మూర్ఖపు చర్యలతోనే విద్యా రంగం దెబ్బతింటోందని, ఆంగ్లం తెలియని పిల్లలకు ఆంగ్లం రాని ఉపాధ్యాయులతో బోధిస్తే ప్రయోజనం ఉండదని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ స్పష్టం చేశారు. సిద్ధార్థ అకాడమీ, వికాస విద్యావనం సంస్థలు సంయుక్తంగా... ‘నాణ్యతకు నోచుకోని చదువులెందుకు’ పేరిట శనివారం విజయవాడలో సదస్సు నిర్వహించాయి. ముఖ్య వక్తగా పాల్గొన్న జేపీ మాట్లాడుతూ.... ‘ప్రస్తుతం మనం సంక్లిష్టమైన సమాజంలో ఉన్నాం. ఏం మాట్లాడినా వివాదం చేస్తారు. నేను ఆంగ్లానికి వ్యతిరేకిని కాను. కానీ ఆంగ్లమే రాని గురువులతో పాఠాలు చెప్పించడం మనల్ని మనం మోసం చేసుకోవడమే. ఆంగ్ల బోధన మంచిదే. అయితే విద్యార్థులు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారనేది చూడాలి. ఇంట్లో ఏ భాష మాట్లాడతారో అందులోనే పిల్లలను చదివిస్తే వారికి బాగా అర్థమవుతుంది. ఎందుకూ పనికిరాని పరీక్షల్లో వచ్చే మార్కులను విద్యార్థుల ప్రతిభకు కొలమానంగా భావించడం సరికాదు. ఈ విషయంలో తల్లిదండ్రుల ధోరణి మారాల్సిన అవసరముంది. పిల్లలకు ఎలాంటి ఒత్తిడి లేకుండా జ్ఞానం ఉపయోగించి పరీక్షలు రాసే పరిస్థితులు కల్పించాలి. పాఠశాల విద్య కోసం కేంద్రం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.90 వేలు వెచ్చిస్తోంది. ఇలా ఎంత ఖర్చు పెడుతున్నప్పటికీ విద్య మాత్రం అధ్వానంగానే ఉంది’ అని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు చదలవాడ నాగేశ్వరరావు, వికాస విద్యావనం సంస్థ అధ్యక్షుడు ఎస్‌.ఆర్‌.పరిమి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని