‘గడప గడపకు’ కార్యక్రమానికి వాళ్లను రానివ్వకండి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చిందులు తొక్కారు.

Updated : 03 Feb 2023 11:49 IST

సీఐకి ఎమ్మెల్యే వెలంపల్లి ఆదేశం

విజయవాడ (చిట్టినగర్‌), న్యూస్‌టుడే: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ‘న్యూస్‌టుడే’ ప్రతినిధిపై ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు చిందులు తొక్కారు. ప్రైజర్‌పేటలో గురువారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ‘సమస్యలు చెబుతుంటే పట్టించుకోరా?’ అనే శీర్షికన గురువారం ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తపై వెలంపల్లి.. ‘ఏమయ్యా మమ్మల్ని నిలదీశారని రాశావు. ఎక్కడ నిలదీశారు? కుక్కల సమస్యపై అడిగితే నిలదీయడమా’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి స్పందిస్తూ కుక్కలు, కాలువలు, చెత్త, విద్యుత్తు దీపాలు, రిటైనింగ్‌ గోడ గురించి మహిళ అడిగారని, ఆ విషయాలే రాశామని చెప్పారు. దీంతో వెలంపల్లి ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్లను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రానివ్వకండి’ అని కొత్తపేట సీఐ సుబ్రహ్మణ్యాన్ని ఆదేశించారు. ‘మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఇది మా ప్రభుత్వ  కార్యక్రమం. మేం చేసుకుంటున్నాం. మీకేం పని’ అంటూ విలేకర్లపై సీరియస్‌ అయ్యారు. మీడియా తన వెంట రాకూడదని, వాళ్లను కట్టడి చేయాలని సీఐకి ఆదేశాలు జారీచేశారు.

పోలీసు వలయంలో కార్యక్రమం...

రోజువారీ కార్యక్రమానికి భిన్నంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు గురువారం అదనపు పోలీసు సిబ్బందిని రప్పించారు. కొత్తపేట సీఐతో పాటుగా భవానీపురం సీఐ కూడా వచ్చారు. పోలీసుల వలయం మధ్య కార్యక్రమం కొనసాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని