EPFO: త్వరలో అధిక పింఛను వెబ్‌లింకు

అధిక వేతనంపై భవిష్యనిధి (ఈపీఎఫ్‌) చందా చెల్లిస్తున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను పొందేందుకు ఉమ్మడి ఐచ్ఛికాన్ని (ఆప్షన్‌) ఆన్‌లైన్‌ ద్వారా నమోదుకు ప్రత్యేక వెబ్‌లింకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది.

Updated : 24 Feb 2023 07:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: అధిక వేతనంపై భవిష్యనిధి (ఈపీఎఫ్‌) చందా చెల్లిస్తున్న ఉద్యోగులు, కార్మికులు అధిక పింఛను పొందేందుకు ఉమ్మడి ఐచ్ఛికాన్ని (ఆప్షన్‌) ఆన్‌లైన్‌ ద్వారా నమోదుకు ప్రత్యేక వెబ్‌లింకును అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఈపీఎఫ్‌వో వెల్లడించింది. 2014 సెప్టెంబరు 1కి ముందు సర్వీసులో చేరి, 2014 సెప్టెంబరు 1 తరువాత సర్వీసులో కొనసాగుతూ ఉద్యోగుల పింఛనునిధి చట్టం-1995 పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇవ్వలేకపోయిన వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్లో సమాచారాన్ని పొందుపరిచింది. ఈ ప్రత్యేక ఆన్‌లైన్‌ దరఖాస్తు సదుపాయం రెండు, మూడు రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.

* 2014 సెప్టెంబరు 1కి ముందు పదవీ విరమణ చేసి, సర్వీసులో ఉన్నప్పుడు యజమానితో కలిసి పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్‌ ఇచ్చిన పలువురి అభ్యర్థనను ఈపీఎఫ్‌వో తిరస్కరించింది. తాజా తీర్పుతో వీరికి వెసులుబాటు లభించింది. ఇలాంటి పింఛనుదారులు అధిక పింఛను పొందేందుకు మరోసారి ఐచ్ఛికం నమోదుకు ఈపీఎఫ్‌వో మెంబర్‌ పోర్టల్‌లో ప్రత్యేక లింకును పొందుపరిచింది. ఈ ఆన్‌లైన్‌ లింకు వారం రోజులుగా సరిగా పనిచేయకపోవడంపై అర్హులైన ఈపీఎఫ్‌వో పింఛనుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో దరఖాస్తు గడువు ముగియనున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలి

అధిక పింఛను ఐచ్ఛికం ఎంపికతో కలిగే ప్రయోజనాలపై ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సమగ్ర మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య కోరింది. ఈ మేరకు సమాఖ్య ఛైర్మన్‌ బాలకిషన్‌, ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్‌ తదితరులు గురువారం హైదరాబాద్‌లోని ప్రాంతీయ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘‘లక్షల మందికి సంబంధించిన కీలకమైన అంశమైనప్పటికీ అధికారికంగా విధివిధానాలు వెల్లడికాలేదు. ఉద్యోగులు, పింఛనుదారులు అయోమయానికి గురై ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వపరంగా, శాఖలు, సంస్థల పరంగా కూడా దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీకాలేదు. దీంతో అమలుపై అనుమానాలు నెలకొన్నాయి. అధిక పింఛను దరఖాస్తుకు ఉద్దేశించిన జాయింట్‌ ఆప్షన్‌ ఫాంను, మార్గదర్శకాలను వెంటనే వెబ్‌సైట్‌లో పెట్టాలి. దరఖాస్తుకు పది రోజుల కంటే తక్కువ గడువు ఇచ్చారు. ఈ గడువును రెండు నెలల పాటు పొడిగించాలి’’ అని వినతిపత్రంలో కోరారు.


ఈపీఎఫ్‌వో సమస్యల పరిష్కారానికి 27న ‘నిధి ఆప్‌కే నికత్‌’ కార్యక్రమం

ఉద్యోగుల భవిష్యనిధి (ఈపీఎఫ్‌) సమస్యల పరిష్కారానికి హైదరాబాద్‌ బర్కత్‌పుర ప్రాంతీయ కార్యాలయం పరిధిలో నాలుగు చోట్ల ఈ నెల 27న ‘నిధి ఆప్‌కే నికత్‌-2.0’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పీఎఫ్‌ కమిషనర్‌-2 అర్జున్‌ తుక్రాల్‌ తెలిపారు. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా చర్లపల్లిలోని జెనారా ఫార్మా లిమిటెడ్‌లో, సూర్యాపేట జిల్లా.. సూర్యాపేట అమరవాడినగర్‌లోని శ్రీవెంకటేశ్వర ఇంజినీరింగ్‌ కళాశాలలో, యాదాద్రి-భువనగిరి జిల్లా.. భువనగిరి పురపాలక కార్యాలయంలో, నల్గొండలోని సహకార బ్యాంకు ఆవరణలో నిధి ఆప్‌కే నికత్‌ కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని