ఎస్సీలుగా దళిత క్రైస్తవులు.. ఎస్టీల్లోకి బోయలు, వాల్మీకులు

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని.. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని శాసనసభ చేసిన రెండు వేర్వేరు తీర్మానాల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు.

Published : 25 Mar 2023 06:25 IST

ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని.. బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని శాసనసభ చేసిన రెండు వేర్వేరు తీర్మానాల్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ రెండు అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగిందేమీ లేదని తనకూ తెలుసని అన్నారు. అన్యాయానికి గురైన వారికి చేతనైనంత మంచిచేసే అవకాశం ఉన్నప్పుడు ఆ బాధ్యత తీసుకోవాలనే ఈ రెండు తీర్మానాలు చేశామని వివరించారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ సాంఘిక సంక్షేమ శాఖామంత్రి మేరుగు నాగార్జున, బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల జాబితాలో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ బీసీ సంక్షేమ శాఖామంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు... శుక్రవారం శాసనసభలో రెండు వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. వాటిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దేందుకు ఈ రెండు తీర్మానాలు చేస్తున్నామని అన్నారు.  సీఎం ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే!

మతం మారటం వల్ల హక్కులు దక్కట్లేదు

దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మా నాన్న రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక తీర్మానం చేసి పంపించారు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై కేసు నడుస్తోంది. అందులో ఇంప్లీడై వాదన వినిపిస్తున్నాం. దళితులు ఒక మతం నుంచి మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక, జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రాదు. మతం మారటం వల్ల వారికి ఎస్సీలుగా రావాల్సిన హక్కులు దక్కకుండా పోవడం అన్యాయమని నమ్ముతున్నాం. అందుకే  దళిత క్రైస్తవులను ఎస్సీలుగా పరిగణించాలంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం.

ఏకసభ్య కమిషన్‌ సిఫార్సు మేరకు

తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ 75 ఏళ్లుగా పోరాడుతున్నామంటూ బోయ, వాల్మీకి కులాల వారు నా పాదయాత్ర సమయంలో నన్ను కలిసి విన్నవించారు. పక్కనే ఉన్న కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారని, రాయలసీమ జిల్లాల్లో మాత్రం ఎస్టీలుగా గుర్తింపు లేదని వారు వివరించారు. ఎస్టీ జాబితాలో చేర్చే అంశం.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనప్పటికీ.. సాధ్యమైనంత వరకూ వారికి మంచి చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నాం. అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించాం. బోయ, వాల్మీకి సహా అనుబంధ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఆ కమిషన్‌ సిఫార్సు చేసింది. దాన్ని పరిగణనలోకి తీసుకుని బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశాం.

దీని వల్ల షెడ్యూల్‌, ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు నష్టం జరగదు. మన రాష్ట్రంలో ఆరు పాయింట్ల ఫార్ములా, జోనల్‌ వ్యవస్థ అమల్లో ఉంది. ఏజెన్సీ ప్రాంతాలు ఒక జోన్‌లో, రాయలసీమ ప్రాంతం మరో జోన్‌లో ఉంటుంది. ఉద్యోగాలు, చదువుల విషయాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలపై ప్రభావమూ పడదు. నాన్‌ జోనల్‌కు సంబంధించిన గ్రూపు-1 ఉద్యోగాల విషయంలో మాత్రమే కొద్దిగా ప్రభావం ఉంటుంది. గత పదేళ్లలో గ్రూపు-1లో 386 ఉద్యోగాలకే.. నోటిఫికేషన్‌ ఇచ్చారు. దానిలో 6 శాతం రిజర్వేషన్‌ అంటే 20-22 ఉద్యోగాల్లోనే పోటీ ఉంటుంది. మిగతావన్నీ జిల్లాలు, జోనల్‌ఉద్యోగాలే. ఏజెన్సీలోని ఎస్టీలు అందరికీ ఈ విషయం తెలియాల్సిన అవసరముంది.

షెడ్యూల్‌ ఏరియాలో ఉంటున్న గిరిజనులు, ఆదివాసీలు ఎవరికీ ఎలాంటి నష్టమూ ఉండదని హామీ ఇస్తున్నా. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే ఇంకొకరికి అన్యాయం చేస్తున్నట్లు కాదు. అన్యాయం చేయాలన్న అభిప్రాయం, ఉద్దేశం మా పార్టీకీ.. నాకు లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని