ఫెర్రో పరిశ్రమలపై రూ.300 కోట్ల భారం
ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలపై విద్యుత్తు డిమాండ్ ఛార్జీల పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకులతో నష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కిలోవాట్‌కు రూ.475 చొప్పున డిమాండ్ ఛార్జీల భారం మోపనుంది.
ఇతర వర్గాల టారిఫ్‌లో పెంపు లేదు
2023-24 విద్యుత్తు ఛార్జీలను వెల్లడించిన ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం: ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలపై విద్యుత్తు డిమాండ్ ఛార్జీల పిడుగు పడింది. అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకులతో నష్టాల్లో ఉన్న ఈ పరిశ్రమలపై రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కిలోవాట్‌కు రూ.475 చొప్పున డిమాండ్ ఛార్జీల భారం మోపనుంది. విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)లు పెట్టిన ఈ అదనపు ఛార్జీల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదముద్ర వేసింది. దీనివల్ల డిస్కంలకు సుమారు రూ.300 కోట్ల మేర రెవెన్యూ లోటు తీరనుండగా ఆ మేరకు ఫెర్రో పరిశ్రమలపై అదనపు భారం పడనుంది. శనివారం విశాఖలోని ఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో 2023-24 రిటైల్ సప్లయ్ టారిఫ్ ఉత్తర్వులను ఏపీఈఆర్సీ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ డిస్కంలు వార్షిక ఆదాయ అవసరాలను గత నవంబర్‌లో సమర్పించగా ఈ ఏడాది జనవరిలో వర్చువల్‌గా ప్రజాభిప్రాయసేకరణ జరిపి పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఫెర్రో పరిశ్రమలు మినహా ఇతర వర్గాలపై ఏ భారమూ లేకుండా డిస్కంల ప్రతిపాదనలను సమ్మతించినట్లు చెప్పారు. ఫెర్రో పరిశ్రమల నుంచి అదనపు వసూళ్లకు డిస్కంలు మూడు ప్రతిపాదనలు పెట్టగా అందులో డిమాండ్ ఛార్జీలకు మాత్రమే అనుమతించామన్నారు. అయినా మిగతా రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో ఈ పరిశ్రమల ఛార్జీలు తక్కువేనని సమర్ధించుకున్నారు.
డిస్కంల ఆదాయ అవసరం రూ.49,267 కోట్లు
‘ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్.. ఈ మూడు డిస్కంలు కలిపి రూ.52,591 కోట్ల ఆదాయ అవసరాలను ప్రతిపాదించాయి. వీటిని ఏపీఈఆర్సీ తరఫున క్షుణ్ణంగా పరిశీలించాం. విద్యుత్తు అమ్మకాలు, సరఫరా నష్టాలు, కొనుగోళ్లకు సంబంధించి డిస్కంలు అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు కొరత, టైమ్ ఆఫ్ డే (టీవోడీ) ఆధారంగా డిమాండ్, లభ్యతను అంచనా వేశాం. డిస్కంల స్వల్పకాలిక కొనుగోళ్లను నియంత్రించడంలో నిబంధనల అమలును దృష్టిలో పెట్టుకుని వాస్తవిక ఆదాయ అవసరాన్ని రూ.49,267.36 కోట్లుగా నిర్ణయించాం’ అని ఈఆర్సీ ఛైర్మన్ పేర్కొన్నారు.
లోటు మొత్తం ప్రభుత్వమే ఇస్తుంది
‘మూడు డిస్కంలు తమ రెవెన్యూ లోటును రూ.14,028.76 కోట్లు పేర్కొన్నాయి. మా పరిశీలన అనంతరం వాస్తవిక లోటు రూ.10,135 కోట్లుగానే నిర్ణయించాం. ఈ మొత్తమంతా ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నగదు బదిలీ రూపంలో ఇస్తున్నదే. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లగా రెవెన్యూ లోటును సబ్సిడీగా చెల్లించేందుకు సమ్మతించింది. దీనివల్ల వినియోగదారులపై అదనపు భారం వేసే అవసరం లేకుండా పోయింది’ అని వివరించారు.
మరమగ్గాలు, పిండిమిల్లుల వారికి ఉపశమనం
ప్రజాభిప్రాయ సేకరణలో వచ్చిన వినతులను పరిశీలించి మరమగ్గాలు (పవర్‌లూమ్స్), పిండి మిల్లులకు 10 హెచ్‌పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. దీనివల్ల ఆయా రంగాలపై విద్యుత్తు బిల్లులు కొంత తగ్గే అవకాశం ఉందన్నారు. అలాగే ఆఫ్ సీజన్ ఐచ్ఛికాన్ని సంవత్సరానికి రెండుసార్లుగా మార్చినట్లు తెలిపారు. సౌరవిద్యుత్తులో ఏదైనా సమస్య ఉంటే సోలార్ పంప్‌సెట్లు వాడుతున్న అర్హులైన రైతులకు డిస్కంలు ఉచిత విద్యుత్తును ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్ల మంజూరులో సీనియార్టీ పాటించకుంటే సంబంధిత వ్యక్తులపై చర్యలకు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చన్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల సరఫరాను నిర్ధారించడానికి జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్‌ను డిస్కంలు వారి వెబ్‌సైట్లలో ఉంచాలని ఆదేశించినట్లు ఈఆర్సీ ఛైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో ˆఈఆర్సీ సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, పి.రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్తు టారిఫ్ పుస్తకానికీ ఆ రంగే!
రానున్న ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే విద్యుత్తు టారిఫ్ ఛార్జీలకు సంబంధించిన నివేదికను ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి శనివారం విడుదల చేశారు. పుస్తక రూపంలో ఉన్న ఈ నివేదిక కవర్ పేజీ వైకాపా పార్టీ రంగులను పోలినట్లు తీర్చిదిద్దారు. ఆ పుస్తకాలను ఆవిష్కరించిన సమయంలో ఇవి ప్రభుత్వ నివేదికలా.. పార్టీ కరపత్రాలా? అని సమావేశంలో పాల్గొన్న వారిలో కొంతమంది చర్చించుకున్నారు. ఈపీడీసీఎల్‌లో కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఈ విధంగా నివేదిక ముఖచిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
IAF: కుప్పకూలిన వాయుసేన శిక్షణ విమానం..!
-
Movies News
Sarath Babu: శరత్ బాబు ఒంటరితనాన్ని, మౌనాన్ని ప్రేమించాడు : పరుచూరి గోపాలకృష్ణ
-
Politics News
Sujana chowdary: భాజపా అధిష్ఠానంతో పవన్ చర్చలు జరిపారు: సుజనా చౌదరి
-
Crime News
Hyderabad: ఈతకు దిగి వ్యక్తి మృతి.. మునిగిపోతున్న దృశ్యాలు వైరల్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
Sarath chandra reddy: దిల్లీ మద్యం కేసు.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి