సంక్షిప్త వార్తలు (5)

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ దంపతులు గురువారం రాత్రి సందర్శించారు.

Updated : 31 Mar 2023 06:15 IST

ద్రాక్షారామ ఆలయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పూజలు

ద్రాక్షారామ, పిఠాపురం, న్యూస్‌టుడే: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ద్రాక్షారామ భీమేశ్వరస్వామి వారి ఆలయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ దంపతులు గురువారం రాత్రి సందర్శించారు. వీరికి పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా మంత్రి వేణుగోపాలకృష్ణ సాదరంగా ఆహ్వానించారు. స్వామి వారిని, మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని న్యాయమూర్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీర్వచనాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రామసుబ్రమణియన్‌ కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరిదేవి, పురుహూతికా అమ్మవారిని దర్శించుకున్నారు.


పోక్సో కేసుల్లోని ఉపాధ్యాయుల వివరాలు కోరిన విద్యాశాఖ

ఈనాడు, అమరావతి: విద్యార్థులపై లైంగిక వేధింపుల కేసు (పోక్సో)ల్లో సస్పెండైన ఉపాధ్యాయుల వివరాలను సమర్పించాలని జిల్లా విద్యాధికారులు, ఆర్జేడీలను పాఠశాల విద్యాశాఖ కోరింది. పోక్సో సహా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులతో పాటు క్రమశిక్షణ చర్యల గడువు పూర్తయిన వారి వివరాలనూ ఇవ్వాలని పేర్కొంది.


డాల్ఫిన్‌ వదనం.. మామిడి అందం

తూర్పు గోదావరి జిల్లా కడియపు లంకలోని పచ్చని విరివనాల్లో డాల్ఫిన్‌ ఆకారంలో మామిడికాయ ఇలా కనువిందు చేస్తోంది. దీన్ని చిలకముక్కు మామిడి అని పిలుస్తారని స్థానిక రైతు కుప్పాల దుర్గారావు చెప్పారు. దీనికి సంబంధించిన తల్లి చెట్టు నుంచి అంటు మొక్కలను ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకువచ్చినట్లు తెలిపారు. 

న్యూస్‌టుడే, కడియం


చిత్తూరు జిల్లాలో మూడు కొవిడ్‌ కేసులు

తిరుపతి(వైద్యవిభాగం), న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా రామకుప్పానికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులకు కొవిడ్‌ నిర్ధారణ అయింది. ఆ కుటుంబానికి చెందిన యువకుడు (24) దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులకు గురికావడంతో బుధవారం ర్యాపిడ్‌ పరీక్ష చేయించుకున్నారు. కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధరణ కావడంతో వెంటనే అతడిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులనూ పరీక్షించగా గురువారం రాత్రికి వచ్చిన ఆర్‌టీపీసీఆర్‌ ఫలితాల్లో అతని తల్లి (43), అత్త (61)కు కొవిడ్‌ నిర్ధారణ అయింది.


అనుమతుల పేరిట అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటును అడ్డుకోవద్దు
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ ఆదేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ]్కర్‌ విగ్రహాల ఏర్పాటు, ఆవిష్కరణలను అనుమతుల పేరిట అడ్డుకోవద్దని రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు రాసిన లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ‘అంబేడ్కర్‌ విగ్రహాల ఏర్పాటు, ఆవిష్కరణలపై స్థానిక అధికారులు కుల వివక్ష ప్రదర్శిస్తున్నారని కమిషన్‌ దృష్టికి వచ్చింది. ఆ కార్యక్రమాలను అనుమతుల పేరిట అడ్డుకోవద్దు. తమ ప్రాంతాల్లో అంబేడ్కర్‌ విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటామని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కోరితే అనుమతివ్వాలి. రక్షణ కల్పించాలి. విధిగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ ఆదేశాలు పాటించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని