వారు విచారణను ప్రభావితం చేయగలరు

వివేకా హత్య కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారని, అన్ని రకాలుగా విచారణను అడ్డుకునే సామర్థ్యం ఉందని, అందువల్ల విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు తనను అనుమతించాలంటూ మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 01 Apr 2023 06:48 IST

ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు నాకు అనుమతించండి
సీబీఐ కోర్టులో సునీతారెడ్డి పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: వివేకా హత్య కేసులో నిందితులు పలుకుబడి ఉన్నవారని, అన్ని రకాలుగా విచారణను అడ్డుకునే సామర్థ్యం ఉందని, అందువల్ల విచారణ ప్రక్రియలో ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు తనను అనుమతించాలంటూ మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సాక్షుల్లో ఒకరి అనుమానాస్పద మృతి, సీఐ శంకరయ్యతో సహా ఇతర సాక్షులు ప్రాసిక్యూషన్‌కు సహకరించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సరైన విచారణ జరిపి న్యాయం పొందేందుకుగాను కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. కె.గంగాధర్‌రెడ్డి సీబీఐని ఆశ్రయించి వివేకా హత్య కేసు బాధ్యతను తీసుకుంటే రూ.10 కోట్లు వై.ఎస్‌.అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిలు ఇస్తారని శివశంకర్‌రెడ్డి చెప్పినట్లు వాంగ్మూలం ఇచ్చారన్నారు. మేజిస్ట్రేట్‌ ముందు ఇదే విషయాన్ని చెప్పాల్సి ఉండగా మాట మార్చి మీడియా ముందుకు వచ్చి సీబీఐ ఒత్తిడి తీసుకువస్తోందని పేర్కొన్నారన్నారు. అనంతరం అనుమానాస్పద స్థితిలో గంగాధర్‌రెడ్డి మృతి చెందారని తెలిపారు. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని చెప్పడం, తరవాత సంఘటన స్థలానికి చేరుకోగా బెదిరించినట్లు పులివెందుల సీఐ శంకరయ్య సీబీఐకి వాంగ్మూలం ఇచ్చి, మేజిస్ట్రేట్‌ ముందు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించడంతో సీఐపై సస్పెన్షన్‌ ఎత్తివేసి పోస్టింగ్‌ ఇచ్చారన్నారు. ఫిర్యాదుదారు ఎం.వి.కృష్ణారెడ్డి సీబీఐ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. శివశంకర్‌రెడ్డి సన్నిహితుడు ఉదయ్‌రెడ్డి సీబీఐకి అన్ని అంశాలను తెలిపారని, చివరికి దర్యాప్తు అధికారి రాంసింగ్‌ వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అప్రూవర్‌గా మారిన దస్తగిరి సోదరుడు మస్తాన్‌పై సర్పంచి దాడి చేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టుకు సహకరించడానికి రాకతప్పలేదన్నారు. అందువల్ల తన తరఫున న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించడానికి, సాక్షులను క్రాస్‌ ఎగ్జామ్‌ చేయడానికి ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు తన తరఫు న్యాయవాదులు టి.స్వేచ్ఛ, ఎస్‌.గౌతమ్‌, పి.రాజేందర్‌లను అనుమతించాలని కోరారు. సీఆర్‌పీసీ సవరించిన సెక్షన్‌లతోపాటు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుల మేరకు తన తరఫున న్యాయవాదులను అనుమతించాలన్నారు. ఈ పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్‌.రమేశ్‌బాబు ఏప్రిల్‌ 28వ తేదీకి వాయిదా వేశారు. వివేకా హత్య కేసు విచారణ సందర్భంగా శుక్రవారం నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డి, యాదాటి సునీల్‌యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డిలు హాజరుకాగా, దస్తగిరి గైర్హాజరయ్యారు.

గంగిరెడ్డికి మరోసారి నోటీసులు

వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడైన గంగిరెడ్డికి బెయిలు రద్దు పిటిషన్‌లో శుక్రవారం తెలంగాణ హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. గంగిరెడ్డికి నోటీసులను వ్యక్తిగతంగా అందజేయాలని ఆదేశిస్తూ విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. గంగిరెడ్డి బెయిలును రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్‌ సుప్రీం కోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయిన విషయం విదితమే. దీనిపై గత వారం నోటీసులు జారీ అయ్యాయి. శుక్రవారం మరోసారి న్యాయమూర్తి చిల్లకూరు సుమలత విచారణ చేపట్టగా గంగిరెడ్డికి నోటీసులు అందకపోవడంతో ఆయన తరఫు న్యాయవాది ఎవరూ హాజరుకాలేదు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేస్తూ వ్యక్తిగతంగా గంగిరెడ్డికి అందజేయాలంటూ సీబీఐకి న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని