అప్పులతోనే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి

రాష్ట్రం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ప్రారంభిస్తోంది. విశ్వ ప్రయత్నాలతో రూ.3,000 కోట్ల రుణం స్వీకరించేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందింది.

Published : 01 Apr 2023 05:16 IST

ఏప్రిల్‌ 5న రూ.3,000 కోట్ల రుణానికి అనుమతులు
చివర్లో ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తం
వచ్చే నిధులూ తెచ్చుకోలేకపోయిన వైనం

ఈనాడు, అమరావతి: రాష్ట్రం కొత్త ఆర్థిక సంవత్సరాన్ని అప్పులతోనే ప్రారంభిస్తోంది. విశ్వ ప్రయత్నాలతో రూ.3,000 కోట్ల రుణం స్వీకరించేందుకు కేంద్రం నుంచి అనుమతులు పొందింది. సాధారణంగా కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అప్పులకు కేంద్రం నుంచి ఇంత త్వరగా అనుమతులు రావడం అరుదు. రాష్ట్ర పెద్దలు, అధికారులు దిల్లీ స్థాయిలో సాగించిన ప్రయత్నాలతోనే ఈ అనుమతులు దక్కినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే బుధవారం రిజర్వు బ్యాంకు నిర్వహించే సెక్యూరిటీల వేలంలో రూ.3,000 కోట్ల రుణం తీసుకోనున్నారు. ఒక్క రాష్ట్రం మాత్రమే ఆ రోజు సెక్యూరిటీల వేలంలో పాల్గొంటుండటం విశేషం. ఆరేళ్ల కాలపరిమితితో తిరిగి తీర్చేలా రూ.వేయి కోట్లు, తొమ్మిదేళ్ల కాలపరిమితితో తీర్చేలా రూ.వేయి కోట్లు, పదేళ్ల కాలపరిమితితో చెల్లించేలా మరో వెయ్యి కోట్ల రుణం సమీకరిస్తోంది. కేంద్రం నుంచి తాజాగా అనుమతులు వచ్చినందున ఇందుకు అవకాశమేర్పడింది. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసిన విషయం తెలిసిందే.

ప్రాయోజిత పథకాల నిధులేవీ?

2022-23 ఆర్థిక సంవత్సరం చివరలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాబట్టుకోవడంలో అధికారులు సరిగా వ్యవహరించలేదనే చర్చ సాగుతోంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి దాదాపు రూ.6,000 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఆ నిధులకు రాష్ట్రం తన వాటా నిధులు జమ చేయాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తాలు జమ చేస్తామని చెప్పి ప్రయత్నించినా కేంద్రం సానుకూలంగా స్పందించకపోవడంతో నిధులు రాబట్టుకోలేకపోయారని విశ్వసనీయ సమాచారం. మరో వైపు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు చెల్లింపులు జరిపి ఆ వివరాలు కేంద్రానికి సమర్పించి ఉంటే ప్రత్యేక సాయం కింద రూ.1,500 కోట్ల వరకు నిధులొచ్చే అవకాశమున్నా తగిన సమయంలో ప్రక్రియ పూర్తి చేయనందున అవీ అందుకోలేకపోయారని సమాచారం. ఇలా వివిధ రూపాల్లో కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.పది వేల కోట్లు రాబట్టుకోవడంలో ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోయిందని సమాచారం. అత్యంత పెద్దస్థాయి సిఫార్సులతో వివిధ శాఖలకు చెందిన దాదాపు రూ.2,400 కోట్ల బిల్లుల సొమ్ము చివరి రోజుల్లో చెల్లింపులు సాగాయని చెబుతున్నారు. అనేకమంది బిల్లుల కోసం నిరీక్షించినా చెల్లింపులు సాగలేదు.

కరెంట్‌ ఖాతాకు జమ చేయండి

వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎక్కడైనా డబ్బులుంటే వాటిని తక్షణమే వెనక్కు చెల్లించాలని ఖజానా అధికారులు సంబంధిత అధికారులకు వర్తమానం పంపారు. ఖజానా బ్యాంకులను అప్రమత్తం చేసి యూజర్‌ ఛార్జీలు, ఇతరత్రా వసూళ్లకు సంబంధించిన ఏ సొమ్ములున్నా తక్షణమే వాటిని ప్రభుత్వానికి జమ చేయాలని ఖజానాశాఖ సంచాలకులు తెలిపారు. సంబంధిత హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌ నెంబరును తెలిపారు. కరెంటు ఖాతాలో సొమ్ములన్నీ జమ చేయాలని సూచించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు