అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి దిల్లీలోనే మకాం వేశారు.

Updated : 29 May 2023 06:04 IST

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగిందని సీఎంఓ ప్రకటన

ఈనాడు, దిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన ముఖ్యమంత్రి దిల్లీలోనే మకాం వేశారు. శనివారం జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశంలో, ఆదివారం మధ్యాహ్నం జరిగిన నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో ఆయన హోంమంత్రిని కలిసినా వ్యక్తిగతంగా ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం రాలేదు. దాంతో రాత్రి 10 గంటల సమయంలో ఇక్కడి హోంమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉండటం, వివేకా హత్య వార్త జగన్‌కు ముందే తెలుసు అని సీబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్న తరుణంలో ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకొంది. వీరిద్దరి భేటీ 40 నిమిషాలు జరిగినట్లు, మొత్తం చర్చ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సాగినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలిపేలా చూడాలని, వీలైనంత త్వరగా కేంద్ర కేబినెట్‌ దానికి ఆమోదం పొందేలా చూడాలని కోరినట్లు పేర్కొంది. దిల్లీలోని ఏపీ భవన్‌ సహా, విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10లోని ఆస్తుల విభజనపైనా ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అమిత్‌షాతో చర్చించినట్లు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే విద్యుత్తు బకాయిలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని