సింగిల్‌ సబ్జెక్టు అమలు చేస్తే 500 మంది అధ్యాపకులు అవసరం

ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం అమలు చేస్తే రాబోయే మూడేళ్లలో 500 మంది వరకు అధ్యాపకులు అవసరమవుతారని మంత్రి బొత్స సత్యనారాయణతో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించినట్లు తెలిసింది.

Updated : 31 May 2023 06:05 IST

మంత్రి బొత్సకు తెలిపిన కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ 

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం అమలు చేస్తే రాబోయే మూడేళ్లలో 500 మంది వరకు అధ్యాపకులు అవసరమవుతారని మంత్రి బొత్స సత్యనారాయణతో కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ పోలా భాస్కర్‌ వెల్లడించినట్లు తెలిసింది. మూడో ఏడాదిలో ఒక్కో సబ్జెక్టుకు ముగ్గురు అధ్యాపకులు అవసరం అవుతారని, ఈ మేరకు పోస్టులు ఇస్తే అన్ని కోర్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచేందుకు తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సింగిల్‌ సబ్జెక్టు అమలుపై కళాశాల విద్యా కమిషనరేట్‌లో మంగళవారం ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కమిషనర్‌ పోలా భాస్కర్‌ ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి హాజరయ్యారు.

ఉత్తరాంధ్రలోని కళాశాలల్లో సింగిల్‌ సబ్జెక్టులను తగ్గించడం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. అధ్యాపకుల కొరత ఏర్పడుతుందనే పరిమితంగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టులను కేటాయించినట్లు కమిషనర్‌ వెల్లడించినట్లు తెలిసింది. పోస్టులు ఎన్ని అవసరమవుతాయో ప్రతిపాదనలు సిద్ధం చేస్తే సీఎం వద్దకు తీసుకువెళ్దామని మంత్రి సమాధానమిచ్చారు. ప్రిన్సిపాళ్లు తమ కళాశాలల్లో మౌలిక సదుపాయాల ప్రకారం అన్ని సబ్జెక్టులను పెట్టుకోవచ్చంటూ కమిషనర్‌ తాజాగా వెసులుబాటు కల్పించారు. ఈ ఏడాదికి సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానాన్ని వాయిదా వేయాలని కొందరు ప్రిన్సిపాళ్లు కోరగా.. దీనిపై వెనక్కి వెళ్లడం కుదరదని మంత్రి బొత్స సూచించారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రిన్సిపాళ్లు కోరారు. ఆలస్యంగా ప్రవేశాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ కళాశాలలు నష్టపోతున్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని