సామాన్య ప్రయాణికులపై రైల్వే శాఖ నిర్లక్ష్యం

పేదలు, సామాన్యులు, వలస కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు రైళ్లలో ప్రయాణించే జనరల్‌, స్లీపర్‌ క్లాస్‌ బోగీలపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపిస్తోంది.

Updated : 07 Jun 2023 05:18 IST

స్లీపర్‌ బోగీల తగ్గింపు, ఏసీలు పెంపు
రాబడి పెంచుకోవడంపైనే దృష్టి

ఈనాడు, అమరావతి: పేదలు, సామాన్యులు, వలస కూలీలు, దిగువ మధ్య తరగతి ప్రజలు రైళ్లలో ప్రయాణించే జనరల్‌, స్లీపర్‌ క్లాస్‌ బోగీలపై రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపిస్తోంది. ప్రయాణికుల రద్దీ ఉండే అనేక రైళ్లలో ఏసీ బోగీలను పెంచాలని లక్ష్యాన్ని పెట్టుకుంది. జనరల్‌ బోగీలను మొక్కుబడిగా ఒకటి, రెండుకి పరిమితం చేయడం, స్లీపర్‌ బోగీలను తగ్గించేయడం కొంతకాలంగా ఎక్కువైంది. దీంతో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వారు నరకం చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే అనేక రైళ్లలో ఇదే దుస్థితి నెలకొంది. ఇదేమని రైల్వే అధికారులను అడిగితే.. ఉన్నతస్థాయి నుంచి వచ్చే ఆదేశాలు అమలు చేయడమే తప్ప, తాము చేయగలిగేది ఏమీ లేదని బదులిస్తున్నారు.

జనరల్‌ బోగీ ప్రయాణం.. ప్రత్యక్ష నరకం

అన్ని మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని జనరల్‌ బోగీల్లో ప్రయాణం అంటే అదో ప్రత్యక్ష నరకంలా మారింది. దాదాపు అన్ని రైళ్లలో జనరల్‌ బోగీలు రెండే ఉంటున్నాయి. కొన్నింటికి ఒక్కటి మాత్రమే ఉంచారు. దీంతో రిజర్వేషన్‌ లేకుండా సాధారణ టిక్కెట్‌ తీసుకొని ప్రయాణించాలనుకునే వారంతా ఈ రెండు బోగీల్లోనే ఇరుక్కొని ప్రయాణించాల్సి వస్తోంది. వీటిలో కాలు కదిపేందుకు కూడా అవకాశం ఉండటం లేదు. స్థలంలేక కొందరు బాత్రూమ్‌లలో సైతం కూర్చొని ప్రయాణిస్తున్నారు.

స్లీపర్‌ బెర్తు దొరకడం అదృష్టమే

అనేక రైళ్లలో గతం కంటే స్లీపర్‌ బోగీలను తగ్గించి, వాటి స్థానంలో ఏసీ బోగీలను క్రమంగా పెంచుతూ వెళ్తున్నారు. దీంతో స్లీపర్‌ బెర్త్‌ దొరకడమే గగనంగా మారింది. పలు ఎక్స్‌ప్రెస్‌లలో స్లీపర్‌లలో నిరీక్షణ జాబితా 100-150 మధ్య ఉంటోంది. బోగీలు తగ్గించడంతో వాటిలో రిజర్వేషన్‌ ఖరారుకాక, నిరీక్షణ జాబితాలో ఉన్నవారు సైతం పెద్దసంఖ్యలో ప్రయాణిస్తున్నారు. దీంతో అవి కూడా జనరల్‌ బోగీలను తలపిస్తున్నాయి.

అధిక మొత్తం వెచ్చించలేక

స్లీపర్‌ బెర్తులు లభించక థర్డ్‌ ఏసీకి ఎక్కువ మొత్తం వెచ్చించే స్తోమత లేక చాలామంది  ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ బెర్త్‌కు రూ.415 ఛార్జి ఉంటే, అదే థర్డ్‌ ఏసీకి రూ.1,090, సెకండ్‌ ఏసీకి రూ.1,535, ఫస్ట్‌ ఏసీకి రూ.2,565గా ఉంది. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడ నుంచి తిరుపతికి స్లీపర్‌ బెర్త్‌కు రూ.245 ఉంటే, థర్డ్‌ ఏసీలో రూ.660 ఉంది.

ఇలా తగ్గించారు..

* భువనేశ్వర్‌ నుంచి బెంగళూరు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఒకప్పుడు థర్డ్‌ఏసీ బోగీలు 3 ఉండేవి. వాటిని 6కి పెంచారు. గతంలో 9-10 ఉండే స్లీపర్‌ బోగీలను 6కి కుదించారు.

* హావ్‌డా-చెన్నై మెయిల్‌లో స్లీపర్‌ బోగీలు 12 ఉండగా, వాటిని 5కి తగ్గించారు. థర్డ్‌ ఏసీ 9కి పెంచారు.

* ధన్‌బాద్‌-అలప్పుజ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ బోగీలు 5కి తగ్గితే.. థర్డ్‌ ఏసీ 6, సెకండ్‌ క్లాస్‌ ఏసీ 4 పెంచారు.

* విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య నడిచే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో గతంలో స్లీపర్‌ బోగీలు 12 వరకు ఉండేవి. ప్రయాణికుల రద్దీని బట్టి అదనంగా ఒకటి, రెండు జత చేసేవారు. ఇప్పుడు వాటిని 7కి తగ్గించారు. థర్డ్‌ ఏసీ బోగీలు నాలుగు నుంచి ఏడుకి పెంచారు.

* విశాఖపట్నం-తిరుపతి.. మధ్య తిరిగే తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్‌ బోగీలు 10 నుంచి 7కి తగ్గిపోతే.. థర్డ్‌ఏసీ 3 నుంచి 6కి పెరిగాయి.

* షాలిమార్‌-చెన్నై మధ్య రాకపోకలు సాగించే కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్‌ ఏసీ బోగీలు 9 ఉండగా, స్లీపర్‌ 5 మాత్రమే ఉన్నాయి.


భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో గతంలో 12 స్లీపర్‌ బోగీలు ఉండేవి. ఇపుడు వాటి సంఖ్య 3కి తగ్గింది. థర్డ్‌ ఏసీ బోగీలు గతంలో 3-4 ఉండగా, ఇప్పుడవి 10కి పెరిగాయి. ఇదే రైలులో ఉండే జనరల్‌ బోగీలు రెండు మాత్రమే.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని