ఇక తొమ్మిది నెలలే..

‘ఇక 9 నెలల సమయమే ఉంది.. గడప గడపకు కార్యక్రమం ఒక్కటే కాదు.. ఎన్నికల మోడ్‌లో వేగంగా పనిచేయండి. అన్ని విధాలుగా సిద్ధం కండి’ అని ముఖ్యమంత్రి జగన్‌ మంత్రులకు స్పష్టం చేశారు.

Updated : 08 Jun 2023 06:55 IST

ఎన్నికల మోడ్‌లో సన్నద్ధమవండి
మీ నియోజకవర్గంతోపాటు జిల్లా బాధ్యతా మీదే
జీపీఎస్‌కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణతో  మేనిఫెస్టో 99.5 శాతం అమలు చేసినట్లయింది  
కేబినెట్‌ భేటీలో మంత్రివర్గ సహచరులతో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘ఇక 9 నెలల సమయమే ఉంది.. గడప గడపకు కార్యక్రమం ఒక్కటే కాదు.. ఎన్నికల మోడ్‌లో వేగంగా పనిచేయండి. అన్ని విధాలుగా సిద్ధం కండి’ అని ముఖ్యమంత్రి జగన్‌ మంత్రులకు స్పష్టం చేశారు. ‘మీరు కష్టపడి పనిచేయండి. నియోజకవర్గాలను పూర్తిగా చక్కదిద్దుకోండి. మీ జిల్లాల బాధ్యతా మీదే. నియోజకవర్గాల్లో, జిల్లాలో ఏవైనా గ్యాప్‌లు ఉంటే ఇప్పటి నుంచి సరిదిద్దుకోండి’ అని వారికి చెప్పారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులకు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలివీ..

ముందస్తు ఎన్నికలంటూ బయట బాగా చర్చ జరుగుతోంది.. అని కొందరు మంత్రులు సమావేశంలో ప్రస్తావించారు. సీఎం స్పందిస్తూ ‘2019లో మార్చి 10న ఎన్నికల షెడ్యూల్‌ వచ్చింది. ఏప్రిల్‌లో ఎన్నికలు జరిగాయి. కాబట్టి వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాతే ఎన్నికల షెడ్యూల్‌ వస్తుంది. గట్టిగా 9 నెలల సమయమే ఉంది. ఇది మనకు చాలా కీలకమైన సమయం. మిగతా చర్చలన్నీ పక్కన పెట్టి ఎన్నికలపై ఫోకస్‌ పెట్టండి. మీరు కష్టపడి పనిచేయండి. మిగతాది నేను చూసుకుంటా. ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మంచిని మంత్రులు, ఎమ్మెల్యేలూ జనంలోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. ఇకపైన నిరంతర ప్రజల్లోనే ఉండాలి. పథకాలను అమలుచేసే పనిని నేను చూసుకుంటున్నా, మీ పని మీరు చేయండి’ అని సీఎం మంత్రులకు స్పష్టతనిచ్చారని సమచారం.

తెదేపా మేనిఫెస్టోను పట్టించుకోవద్దు

తెదేపా ఇటీవల విడుదల చేసిన తొలి మేనిఫెస్టో గురించి ఒకరిద్దరు మంత్రులు లేవనెత్తగా, మరికొందరు మంత్రులు అదేముంది కాపీ మేనిఫెస్టో అంటూ కొట్టి పారేశారు. సీఎం కూడా వారితో మాట కలిపారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్‌ హామీల్లో విజయవంతమైనవాటిని, ఇక్కడ మన వద్ద అమ్మ ఒడిలాంటి సక్సెస్‌ఫుల్‌ పథకాలను కాపీ పేస్ట్‌ చేసుకుని తీసుకువచ్చిన మేనిఫెస్టో అది’ అని అభిప్రాయాలను వారంతా వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు మేనిఫెస్టోను పట్టించుకోనవసరం లేదు. మీ పని మీరు చేయండి. నా పని నేను చేస్తా. మీరంతా కష్టపడి పనిచేస్తే మళ్లీ విజయం మనదే’ అని సీఎం మంత్రులతో అన్నట్లు తెలిసింది.

జీపీఎస్‌తో ఎవరికీ నష్టం జరగదు

ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ను తీసుకువచ్చే అంశం చర్చకు వచ్చినప్పుడు సీఎం మాట్లాడుతూ.. ‘దీంతో ఎవరికీ నష్టమైతే జరగదు. ఏమీ లేని చోట మనం ఈ జీపీఎస్‌ చేస్తున్నాం. రెండేళ్లుగా ఆలోచించి, కసరత్తు చేసి జీపీఎస్‌పై ఈ నిర్ణయం తీసుకున్నాం. మంచిగా ఆలోచిస్తే ఇది మంచిగా ఉంటుంది, ఇంకో రకంగా ఆలోచించేవారికి వారి ఆలోచనలను బట్టి ఉంటుంది’ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌కు ఆమోదం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపాక పలువురు మంత్రులు బల్లలు చరిచారు. ‘ఈ నిర్ణయంతో మన మేనిఫెస్టోలోని హామీలను 99.5 శాతం అమలు చేసినట్లవుతుంది’ అని కొందరు మంత్రులు అనగా.. అవునంటూ సీఎం నవ్వులు చిందించారు.


సజ్జల ఇంటికి విజయమ్మ

వైకాపా మాజీ గౌరవాధ్యక్షురాలు, ముఖ్యమంత్రి జగన్‌ తల్లి వైఎస్‌ విజయమ్మ బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. సజ్జల భార్యతో కాసేపు మాట్లాడి వెనుదిరిగారు. ఆ సమయంలో సజ్జల ఇంట్లో లేరు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని