Andhra News: ఈ-ఆటోల తరలింపు ఎలా?.. తల పట్టుకున్న అధికారులు

సీఎం జగన్‌ ఈ-ఆటోలను ప్రారంభించిన వెంటనే ఆయా పట్టణాలకు తీసుకెళ్లిపోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు తొలుతే ఆదేశాలు జారీ చేయడంతో పురపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లు, సిబ్బంది సుమారు వెయ్యి మందికి పైగా గురువారం ఉదయమే తాడేపల్లికి చేరుకున్నారు.

Updated : 09 Jun 2023 07:27 IST

ఈనాడు, అమరావతి: సీఎం జగన్‌ ఈ-ఆటోలను ప్రారంభించిన వెంటనే ఆయా పట్టణాలకు తీసుకెళ్లిపోవాలని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ అధికారులు తొలుతే ఆదేశాలు జారీ చేయడంతో పురపాలక సంస్థలు, నగర పంచాయతీల కమిషనర్లు, సిబ్బంది సుమారు వెయ్యి మందికి పైగా గురువారం ఉదయమే తాడేపల్లికి చేరుకున్నారు. తాడేపల్లి నుంచి 60-80 కి.మీ.కంటే ఎక్కువ దూరం వెళ్లాల్సిన వాహనాలను శుక్రవారం ట్రాలీల్లో పంపుతామని అధికారులు మొదట చెప్పడంతో ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన సిబ్బంది తిరుగు ప్రయాణమయ్యారు. వారు కొంత దూరం వెళ్లేసరికి...అధికారులు ఫోన్‌ చేసి వాహనాల్ని వెంటనే తీసుకెళ్లిపోవాలని సూచించారు. దాంతో మళ్లీ వారంతా ఉసూరుమంటూ వెనక్కి వచ్చారు. వాహనాల్ని ట్రాలీల్లో తీసుకెళ్లే క్రమంలో ఆటోలకు ఏమైనా నష్టం జరిగితే దానికి మీరే బాధ్యత వహించాలని స్వచ్ఛాంద్ర కార్పొరేషన్‌ అధికారులు చెప్పడంతో.. రోడ్డు మార్గంలోనే ఆటోలను నడిపించుకుని వెళ్లాలని అధికారులు నిర్ణయించుకున్నారు. అయితే సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలకు ప్రతి 60 కి.మీ.లకు ఛార్జింగ్‌ పెట్టుకుంటే తప్ప... ప్రయాణం సాగదు. శ్రీకాకుళం జిల్లాకు తీసుకెళ్లా లంటే 8-10 సార్లయినా ఛార్జింగ్‌ పెట్టుకోవాలి. దీంతో కమిషనర్లు తలలు పట్టుకున్నారు. అర్ధరాత్రి సమయానికి కూడా వందకిపైగా వాహనాలు తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలోనే ఉన్నాయి. రోడ్డు మార్గంలో ఆటోలను తీసుకెళ్లేటపుడు పెట్రోల్‌ బంకుల్లో ఛార్జింగ్‌ పెట్టేలా ఏర్పాట్లు చేశామని స్వచ్ఛాంధ్ర అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని