CM Jagan: నమ్మించు.. వంచించు!

నమ్మించు..వంచించు..సొంత జిల్లా వాసులను మాయ చేసి ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్‌ ఎంచుకున్న పథకమిది.. నా జిల్లా, మన జిల్లా అంటూ జనాన్ని మాటలతో నమ్మిస్తున్నారు..ఇదిగో ఇన్ని రూ.కోట్ల పనులు చేపట్టబోతున్నాం.

Updated : 11 Nov 2023 08:26 IST

సొంత జిల్లా ప్రజల ప్రసన్నానికి సీఎం జగన్‌ పథకమిది..
బద్వేలు ఉప ఎన్నిక సందర్భంలో రూ.500 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ప్రకటన
హడావుడిగా కొన్నింటికి శంకుస్థాపనలూ చేసిన ముఖ్యమంత్రి
రెండేళ్లయినా ముందుకు సాగని పలు పనులు

నమ్మించు..వంచించు..సొంత జిల్లా వాసులను మాయ చేసి ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి జగన్‌ ఎంచుకున్న పథకమిది.. నా జిల్లా, మన జిల్లా అంటూ జనాన్ని మాటలతో నమ్మిస్తున్నారు..ఇదిగో ఇన్ని రూ.కోట్ల పనులు చేపట్టబోతున్నాం. ఈ ప్రాంతాన్ని భూతల స్వర్గం చేయబోతున్నామంటూ ఆయన చెబుతున్న మాటలకు..ఆ హామీల అమలుకు ఆకాశం, భూమికి ఉన్నంత తేడా ఉంటోంది. 2021లో బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గం పరిధిలో సుమారు  రూ.500 కోట్ల విలువైన పనులు చేపడతామంటూ ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. ఆయన స్వయంగా వెళ్లి అనేక పనులకు హడావుడిగా శంకుస్థాపనలు చేశారు. ఆ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిచారు. అంతకంటే ఎక్కువగా సొంత జిల్లా జనం అనే విశ్వాసాన్నీ ముఖ్యమంత్రి చూపించలేకపోయారు. ఉప ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన శంకుస్థాపనలకు రెండేళ్లు పూర్తయినా 25 శాతం పనులు కూడా పూర్తి కాలేదంటే సొంత జిల్లా వాసులపై సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో వెల్లడవుతోంది.

ఉత్తుత్తి శంకుస్థాపనలు..

ముఖ్యమంత్రి స్వయంగా అనేక పనులకు శంకుస్థాపనలు చేశారు. పదుల సంఖ్యలో మంత్రులు ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు బద్వేలులోనే మకాం వేసి ఆ పనులు చూపిస్తూ జనాన్ని ఊరించారు. నమ్మిన జనం ఓట్లేశారు.మాటిచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీలను మరిచారు. సీఎం స్వయంగా శంకుస్థాపనలు చేసిన పనుల్లోనూ కొన్నింటిని రెండేళ్ల తర్వాత ఇప్పటికీ ప్రభుత్వం ఆమోదించలేదంటే హామీల వెనుక ఎంత మోసముందో అవగతమవుతోంది. ఈ పనులకు సీఎం చేసిన శంకుస్థాపనలు ఉత్తుత్తివేనా..?

ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌

పనుల జాప్యం కోసమో..? అమలు చేసే చిత్తశుద్ధి లేకపోవడం.. అనుశీలన చేయక పోవడం వల్లనో కానీ పలు పనులను ఆర్థిక శాఖ పెండింగ్‌లో పెట్టింది.  మాధవరాయునిపల్లె నుంచి రామసముద్రం వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు, బి.కోడూరు మండలంలో రూ.4 కోట్లతో తంగేడుపల్లి నుంచి తుమ్మలపల్లె ‘లో లెవెల్‌ బ్రిడ్జి’, పోరుమామిళ్ల పంచాయతీలో రూ.4.44 కోట్లతో కమ్యూనిటీహాలు నిర్మాణం, రూ.2 కోట్లతో పోరుమామిళ్ల ఎంపీడీవో కార్యాలయం, పోరుమామిళ్ల పరిధిలోని శిద్దవరం నుంచి శివాలయం వరకు రూ.2 కోట్లతో బీటీ రోడ్డు వంటి పనులకు అనుమతివ్వకుండా ఆర్థిక శాఖ నాన్చుతోంది.

సిమెంటు రోడ్లు రాలేదు..

బద్వేలు నియోజకవర్గంలో రూ.500 కోట్ల పనుల్లో భాగంగా బద్వేలు మున్సిపాలిటీలో ఆరు శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తామంటూ అప్పట్లో ముఖ్యమంత్రి ఈ పనులకు శంకుస్థాపనలు చేశారు. రెండేళ్లయినా వాటిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. బద్వేలు పట్టణంలో సుమారు రూ.96 కోట్ల అంచనాతో 140 కి.మీ.ల మేర కొత్తగా సిమెంటు రోడ్లతో పాటు మూడు పార్కులు, కూరగాయలు, చేపల మార్కెట్‌ పార్కింగ్‌తో సహా అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. రోడ్లకు సంబంధించి వివిధ వార్డుల్లో 11 పనులకు అప్పట్లో శ్రీకారం చుట్టగా రెండేళ్ల తర్వాత కూడా ఇప్పటికీ రూ.50 కోట్ల పనులు మాత్రమే చేపట్టారు. మొత్తం రోడ్ల పనులు 7 నుంచి 97 శాతం మధ్య ఇంకా పురోగతిలోనే ఉన్నాయని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. రూ.6.70 కోట్లతో ఎన్జీవో కాలనీ, గాంధీనగర్‌ కాలనీల్లో పార్కులతో పాటు సిద్దవరం రోడ్డు పార్కునూ అభివృద్ధి చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ అవి అందుబాటులోకి రాలేదు.
ఈ పనుల్లో రూ.2 కోట్ల అంచనాతో ప్రతిపాదించినవి ఏడు ఉన్నాయి. వీటి ప్రతిపాదనలు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం మగ్గుతున్నాయి. ఈ పనుల్లో అట్లూరు, బి.కోడూరు మండలాల్లో ఎంపీడీవో కార్యాలయాలకు సంబంధించినవి ఉన్నాయి. బద్వేలు పరిధిలో శివాలయం నుంచి అబ్బుసాహెబ్‌పేట వరకు రూ.2.50 కోట్లతో బీటీ రోడ్డు తదితర పనులకు ఆమోదం లభించక పెండింగ్‌లో ఉన్నాయి.


పారిశ్రామిక పార్కుకు నీరూ లేదు.. విద్యుత్తూ రాలేదు..!

బద్వేలు నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం 480 ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించారు. దానికి అతికష్టంపై రూ.3.70 కోట్లతో అప్రోచ్‌ రోడ్డును నిర్మించారు. ఇప్పటివరకు దీనికి నీటి వసతి, విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించలేదు.

  • సగిలేరుపై ఒకచోట రూ.9.50 కోట్లతో, మరోచోట రూ.20 కోట్ల అంచనాతో రెండు వంతెనల నిర్మాణ పనుల్లోనూ అడుగు ముందుకు పడలేదు. బ్రాహ్మణపల్లి రోడ్డులో నిర్మించతలపెట్టిన రూ.9.50 కోట్ల వంతెన పనులకు డీపీఆర్‌ను మాత్రం సమర్పించారు. రెండో వంతెనకు డీపీఆర్‌ కూడా పూర్తి కాలేదు.
  • ఇటుగులపాడు, సవిశెట్టిపల్లి, కొండ్రాపల్లె, వరికుంట్ల, గంగనపల్లి ప్రాంతాల్లోని చెరువులను నింపేందుకు ఎస్‌పీవీబీఆర్‌ ఎడమ కాలువపై ప్రతిపాదించిన ఎత్తిపోతల పథకం పనులను గుత్తేదారుకు అప్పగించినా పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
  • రూ.79.67 కోట్లతో ప్రతిపాదించిన సగిలేరు ఎడమ ప్రధాన కాలువ విస్తరణ పనులూ ఇప్పటికీ పూర్తి కాలేదు.
  • పోరుమామిళ్ల మార్కెట్‌ యార్డులో గోదాము, మరుగుదొడ్లు, కార్యాలయ భవనం, ప్రహరీ పనులను మొత్తం రూ.3.96 కోట్లతో చేపడతామని ప్రకటించారు.  వీటిలో ప్రహరీ మాత్రమే పూర్తయింది. మిగిలిన పనులు ఇంకా పురోగతిలోనే ఉన్నాయి.
  • పోరుమామిళ్ల పట్టణ పరిధిలో మైదుకూరు-తాటిచెర్ల రోడ్డును 2 నుంచి 4 వరుసలుగా విస్తరించేందుకు రూ.25 కోట్లతో శంకుస్థాపన చేయగా ఇప్పటికి 25 శాతంలోపే పనులు పూర్తయ్యాయి.

ఈనాడు, అమరావతి, కడప

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు