నాడు దళితుడు.. నేడు బీసీ బిడ్డలు

సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో వడ్డెర వర్గానికి చెందిన బిడ్డల్ని బలి చేయాలని చూస్తున్నారని ఆ సామాజిక వర్గ సంఘం నేతలు ధ్వజమెత్తారు.

Published : 20 Apr 2024 04:52 IST

జగన్‌ అధికార దాహానికి బలి
వడ్డెర సంఘం నేతల ధ్వజం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసులో వడ్డెర వర్గానికి చెందిన బిడ్డల్ని బలి చేయాలని చూస్తున్నారని ఆ సామాజిక వర్గ సంఘం నేతలు ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి నాటకంతో దళిత యువకుడ్ని ఇలానే బలి చేశారని పేర్కొన్నారు. జగన్‌ గులకరాయి నాటకంలో వడ్డెర యువకులను అరెస్టు చేసిన పోలీసులు.. వారిపై ఒత్తిడి తెచ్చి ఎలాగైనా ఈ కుట్రలో ఇరికించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆ పార్టీ బీసీ సాధికార సమితి ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి, రాష్ట్ర వడ్డెర సేవా సంఘం అధ్యక్షుడు మల్లెల ఈశ్వరరావు మాట్లాడారు. రెక్కాడితే కానీ డొక్కాడని శ్రామికుల్ని దుర్మార్గంగా ఈ కేసులో ఇరికించారని విమర్శించారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల శవాలతో జగన్‌రెడ్డి వ్యాపారం చేస్తున్నారు. వేముల సతీష్‌, దుర్గారావుల్ని అక్రమంగా అరెస్టు చేయడం వడ్డెరల్ని అవమానించడమే. చీకట్లో వచ్చిన గులకరాయి సీఎంకు తగిలి ఆ తర్వాత వెలంపల్లి శ్రీనివాస్‌ను తాకి గాల్లోకి ఎగిరిపోవడం కోడికత్తి డ్రామా-2 కాదా?’’ అని గురుమూర్తి ప్రశ్నించారు. మైనర్‌లను తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టడం, వడ్డెరలను నేరస్థులుగా చిత్రీకరించాలని చూడటం దారుణమని మల్లెల ఈశ్వరరావు విమర్శించారు. ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకొన్న దుర్గారావు ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు తెలియదని, వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బీసీల పట్ల వైకాపా ప్రభుత్వం, పోలీసుల తీరు మారాలని సూచించారు. విజయవాడ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల దుర్గారావు, గుంటూరు నగర వడ్డెర సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని