Andhra Pradesh: ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరు నిరుద్యోగి!

రాష్ట్రంలో ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి ఉపాధి లభించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక-కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి బులెటిన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

Updated : 25 May 2024 07:44 IST

నిరుద్యోగ రేటు జాతీయ సగటు 18.9%, రాష్ట్రంలో 21.5%
జాతీయ స్థాయి కంటే అధికంగా ఉపాధి లేమి
ఇదంతా పట్టణాల్లో 15-29 ఏళ్ల  మధ్య వారిలో మాత్రమే!

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఐదుగురు యువకుల్లో ఒకరికి ఉపాధి లభించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర గణాంక-కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది జనవరి-మార్చి బులెటిన్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఇది కూడా కేవలం పట్టణాల్లో అదీ 15 నుంచి 29 ఏళ్ల వారి విషయంలోనే.. ఇతర వయస్సుల వారు, పట్టణేతర ప్రాంతాల ప్రజలనూ పరిగణనలోకి తీసుకుంటే ఉపాధి లేమి ఇంకా పెరగొచ్చు. వైకాపా పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోవడం, ఉన్నవాటినీ వెళ్లగొట్టడం, నిర్మాణ రంగం కుదేలవడం, ఐటీ ఊసే లేకపోవడం వంటి అనేక కారణాలతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లేకుండా పోయాయి.

రాష్ట్రంలో 21.5శాతం

రాష్ట్రంలో నిరుద్యోగ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. 2024 జనవరి-మార్చిలో జాతీయస్థాయి నిరుద్యోగ రేటు 18.9% ఉండగా.. రాష్ట్ర సగటు 21.5% నమోదైంది. ఒక్క పట్టణ ప్రాంత పురుషులనే తీసుకుంటే జాతీయ స్థాయిలో 15.1శాతం, ఏపీలో 19.1శాతంగా ఉంది.

  • గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు కేవలం పట్టణ ప్రాంతంలోని 15-29 ఏళ్ల యువత ఉపాధిలేమి రేటు జాతీయ స్థాయిలో 18.9% నుంచి 19.25% మధ్య నమోదైంది. అదే.. మన రాష్ట్రంలో గతేడాది అక్టోబరు-డిసెంబరు మధ్య గరిష్ఠంగా 26.55శాతానికి ఎగబాకింది.
  • ఈ ఏడాదికాలంలో 15-29 మధ్య వయసున్న పురుషుల విషయంలో జాతీయ సగటు 14.6%-15.19% మధ్య ఉండగా.. ఏపీలో మాత్రం 19.1% నుంచి 21.7 % మధ్య కొనసాగింది. 
  • మహిళల విషయానికొస్తే జాతీయ స్థాయిలో 22.5% నుంచి 22.9% మధ్యన ఉండగా..రాష్ట్రంలో 23.9% నుంచి 32.1% వరకూ నమోదైంది.
  • ఇక అన్ని వయసుల పురుషుల్లో నిరుద్యోగ రేటు జాతీయస్థాయిలో 3.4% ఉంటే.. అదే ఏపీలో 12%గా నమోదైంది. మహిళల్లో జాతీయ సగటు 3.7%కాగా రాష్ట్రంలో 20.2%గా ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని