Airtel: ఎయిర్‌టెల్‌ కొత్త ఆఫర్‌.. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై ₹6వేలు క్యాష్‌బ్యాక్‌!

Airtel cashback offer: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.6వేలు క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది.

Updated : 08 Oct 2021 19:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుపై రూ.6వేలు క్యాష్‌బ్యాక్‌ ప్రకటించింది. రెండు విడతల్లో ఈ మొత్తాన్ని ఖాతాదారుడికి జమ చేయనుంది. 2జీ కస్టమర్లను 4జీలోకి ఆకర్షించడంలో భాగంగా ‘మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్‌’ ప్రోగ్రామ్‌ కింద ఈ ఆఫర్‌ను ప్రకటించింది. వచ్చే నెల జియో నుంచి జియోఫోన్‌ నెక్ట్స్‌ వస్తున్న వేళ ఎయిర్‌టెల్‌ ఈ ఆఫర్‌ ప్రకటించడం గమనార్హం.

రూ.12వేలలోపు ధర ఉన్న వివిధ బ్రాండ్లకు చెందిన 150 స్మార్ట్‌ఫోన్‌ మోడళ్లకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్‌ కోసం కస్టమర్‌ ప్రతినెలా రూ.249, ఆ పై మొత్తంతో క్రమం తప్పకుండా 36 నెలల పాటు రీఛార్జి చేయాలి. అప్పుడు తొలి 18 నెలల తర్వాత రూ.2వేలు, 36 నెలల తర్వాత మిగిలిన రూ.4వేలు క్యాష్‌బ్యాక్‌ కింద ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో జమ చేస్తారు. ఏడాది పాటు ఉచితంగా స్క్రీన్‌ రీప్లేస్‌మెంట్‌ సదుపాయం కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాల కింద వింక్‌ మ్యూజిక్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో మొబైల్‌ ఎడిషన్‌ 30 రోజుల ఫ్రీ ట్రయల్‌ను కూడా పొందొచ్చు. తమకు నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవడంతో పాటు డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ భారత పౌరులు పొందాలన్న ఉద్దేశంతో ఈ సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

2జీ యూజర్లను తమవైపు తిప్పుకోవడానికి ఇప్పటికే జియో ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా గూగుల్‌తో కలిసి చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేసిన జియో ఫోన్‌ నెక్ట్స్‌ను లాంచ్‌ చేయనుంది. అక్టోబర్‌లోనే ఈ ఫోన్‌ను తీసుకురావాల్సి ఉండగా.. అనుకోని కారణాలతో ఆలస్యమైంది. దీపావళికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ ఈ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని